Home రాష్ట్ర వార్తలు పోషక తిండికి గండి

పోషక తిండికి గండి

భారీగా తగ్గిపోయిన చిరుధాన్యాల సేద్యం, తలసరి వినియోగం

irrigarionహైదరాబాద్: చిరుధాన్యాలు (ముతక) వీటి గురించి ఈనాటి యువతరానికి తెలియదనడంలో అతిశయోక్తి లేదు. ఎండకు కాస్త నీరసపడినా, జ్వరం వచ్చినా ఇప్పటికి గ్రామాలలో వృద్ధులు జొన్నలతో తయారు చేసిన గటక తాగమని సూచిస్తారు. ఎంత వయస్సు వచ్చినా బలంగా ఉండి, ఏ నొప్పి లేకుండా ఉండటానికి తమ ఆరోగ్య రహస్యం చిరుధాన్యాలేనని చెబుతారు. అటువంటి పోషకాహార విలువలు అధిక మొత్తంలో కలిగిన చిరుధాన్యాల సాగు, దిగుబడి నానా టికి తగ్గిపోతుంది. ఇది దేశ ప్రజలను ఆందోళనకు గురి చేసే విషయం. చిరుధాన్యాలు జొన్నలు, రాగులు, సజ్జ లు, సామలు, కొర్రలు. ఆరు దశాబ్దాల కింద దేశంలో 40 శాతం పైగా ముతక ధాన్యాలను రైతులు సాగు చేసేవారు. అయితే ఇప్పుడు అది 10 శాతం కూడా లేదు. 1960ల లో మన దేశంలో మనిషికి సంవత్సరానికి సగటున 32.9కిలోల జొన్న, చిరుధాన్యాలను తినేవారు. 2015కి ఈ వినియోగం, పట్టణ ప్రాంతాలతో కలిపి, 4.0 కిలోల వరకు పడిపోయింది. 1956 నుండి పంట విస్తీర్ణం కూడా తగ్గి పోయింది. సజ్జ 23%, రాగి 49%, జొన్న 64%, ఇతర చిరుధాన్యాలు 85% సాగు నేల తగ్గింది. ఈ విస్తీర్ణం ఇంతకంటేకుంగిపోతే భారత దేశం చిరుధాన్యాల పంటలను కోల్పోతుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో కూడా సాగు, దిగుబడి తగ్గట్లు ప్రతి ఏడాది ముతక ధాన్యాల అంచనాలు కూడా తగ్గుతూ వస్తుంది. 2014-15లో 22.72 లక్షల ఎకరాలకు 19.58 లక్షల ఎకరాలు, 2015-16లో 22.55 లక్షల ఎకరాలకు 15.96 లక్షల ఎకరాల్లో మాత్రమే ముతక ధాన్యాల సాగు నమోదైంది. అదే విధంగా దిగుబడి 2014-15లో ముతక ధాన్యాలు 34.67 లక్షల ఉత్పత్తికావాల్సి ఉండగా వాస్తవంటా 20 లక్షల టన్నులు, 2015-16లో 36.27 లక్షల టన్నులు అంచనా వేయగా ఏకంగా 50 శాతం తగ్గి 17.01 లక్షల టన్నులుమాత్రమే ఉత్పత్తి అయినట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి.2016-17లో వీటి ఉత్పత్తి మరింత తగ్గనుంది. మూడేళ్ల కాలంలోనే ఏకంగా సగానికి పైగా దిగుబడి తగ్గింది.
ప్రభుత్వ ప్రోత్సాహం ఏదీ : ముతక ధాన్యాల దిగుబడి తగ్గడానికి కారణాలను విశ్లేసిస్తే సాగు భూమి తగ్గిపోవడం, మద్దతు ధర లేకపోవడం, పత్తి, వరి వంటి పంటల ప్రాధాన్యత పెరగడమే. పత్తికి సంబంధించిన ప్రైవేట్ కంపెనీలు విపరీతమైన ప్రచారంతో రైతుల దగ్గరికి నేరుగా వెళ్లి విత్తనాలు అమ్మడం, ప్రతిసారి ఈసారి అధిక రేటు లభిస్తుందని చెప్పడంతో అధిక మొత్తంలో సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. అదే విధంగా ముతక ధాన్యాన్ని అడవి జంతువులు, కోతులు పాడు చేస్తుండడంతో కూడా రైతులు వాటి సాగువైపు మొగ్గు చూపడం లేదు. వీటి బెడద నుంచి తప్పించే ప్రయత్నం అటవీశాఖ ఏమాత్రం చేయడం లేదు. నేటితరం చిరుధాన్యాలను నాసిరకం తిండిగా భావిస్తోందని ‘అనువర్తిత ఆర్థిక పరిశోధన జాతీయ మండలి’ తెలిపింది. ‘2013 -ఆహార భద్రతా చట్టం’ చేయక ముందు గోధుమలు, బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వం ప్రజా పంపిణి వ్యవస్థలో చేర్చింది. ఫలితంగా ముతక ధాన్యాల వినియోగం కూడాపడిపోయినట్లు పేర్కొంది.
చిరుధాన్యాల ప్రయోజనాలు: జొన్నతో సహా చిరుధాన్యాలన్నీ అతి తక్కువ నీటితో పండుతాయి. అందు వలన కరువు కాలానికి కూడా ఇవి పరిష్కారమవుతాయి. పోషకాహార లోపంతో మన దేశంలో ప్రతిసంవత్సరం 10 లక్షల మంది పిల్లలు 5 ఏండ్ల లోపే మరణిస్తున్నారు. మహిళలలో రక్తహీనత 48.1% దగ్గర స్థిరంగా ఉంది.
185 ప్రపంచదేశాలలో మనం 170వ స్థానంలో అతి దారుణమైన స్థితిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేవలం 40% బియ్యం తిన్న ఆడపిల్లల కంటే 60% జొన్నలు తిన్న వారి పెరుగుదల రేటు అధికంగా ఉందని ‘భారతీయ చిరుధాన్యాల పరిశోధక సంస్థ’, ‘జాతీయ పోషకాహార సంస్థ’ తమ 2015 అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు చిరుధాన్యాలను పోత్రాహించే దిశగా అడుగులు వేయాలి. సాగు, దిగుబడి పెంచడానికి పరిశోధనలతో పాటు మద్ధతు ధర కల్పించాలి. పోషకాహార పంటలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.