Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎపి మండలి రద్దు

ఎపి మండలి రద్దు

AP Council

 

133 అనుకూల ఓట్లతో కౌన్సిల్ రద్దు తీర్మానాన్ని ఆమోదించిన శాసనసభ

అనుకూలంగా జనసేన ఎంఎల్‌ఎ ఓటు, టిడిపి గైర్హాజరు, కేంద్రానికి వెళ్లనున్న అసెంబ్లీ తీర్మానం
కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే పార్లమెంట్‌లో ప్రవేశం

హైదరాబాద్ ః పెద్దల సభకు స్వస్తి పలుకుతూ ఎపి శాసనసభ నిర్ణయం తీసుకుంది. ఒక్కరోజు చర్చతోనే మొత్తం తతంగం పూర్తి చేసింది. ఎపి శాసనమండలిని రద్దుకు శాసనసభ ఆమోదం తెలిపింది. మండలి రద్దుపై సోమవారం ఉదయం శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ్యులు దానిపై చర్చించారు. తీర్మానంపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చల్లో పాల్గొన్న సభ్యులంతా మండలి రద్దుకే మొగ్గుచూపారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న విధానపరిషత్‌ను రద్దు చేయాలని కోరారు. జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన మండలి అలాంటి వాటికి కే్రందంగా మారిందని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. 2014లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మండలిని పునరుద్ధరిస్తే నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సభ సాక్షిగా తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. సభలో నాడు చంద్రబాబు మాట్లాడిన వీడియో టేపులను ప్రదర్శించారు.

ఈ దిక్కుమాలిన మండలికి ఒక్కరూపాయి ఖర్చు చేయడం దండగే..
పార్టీ కంటే ప్రజావసరాలు ముఖ్యం… జగన్మోహన్‌రెడ్డి
మండలి రద్దు తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందన్నదానిపై చివరగా సీఎం జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబే లక్షంగా విమర్శలు గుప్పించారు. రాజకీయ కోణంలో తాత్కాలికంగా బిల్లుల్ని అడ్డుకునేందుకే మండలి ఉందని అన్నారు. కాలయాపనతో పాటు ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని.. ఎలాంటి మంచి జరిగే అవకాశం మండలి వల్ల కనిపించడం లేదన్నారు. మండలి వల్ల ఎటువంటి ప్రజా ప్రయోజనం లేదని స్పష్టపర్చారు. అదే క్రమంలో ఈ దిక్కుమాలిన మండలి కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయడమైనా దండగేనన్నారు.

మండలికి రాష్ట్రప్రభుత్వం ఏటా రూ.60 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ప్రజా ప్రయోజనార్థం తమ ప్రభుత్వం తీసుకొస్తున్న ఇంగీలషు మీడియం, ఎస్సి, ఎస్టి బిల్లు, వికేంద్రీకరణ వంటి బిల్లుల్ని మండలి అడ్డుకుంటోందని జగన్ అన్నారు. ఎన్టీఆర్ హయాంలో ఒక వ్యక్తి కోసం మండలిని రద్దు చేశారని ఆయన అన్నారు. పార్టీ కంటే ప్రజా అవసరాలే ముఖ్యమని తలిచి మండలిని రద్దు చేస్తున్నామని చెప్పారు. గురువారం మండలిని రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని, ఇందుకోసం సోమవారం శాసనసభను ఏర్పాటు చేస్తున్నామని కూడా ముందే చెప్పామన్నారు. ఈ అంశంపై చర్చ జరగాలి.. ప్రజల్లో నానాలి.. అని మూడు రోజుల వ్యవధి ఇస్తే.. తాను ఎమ్‌ఎల్‌సిలను కొనుగోలు చేస్తున్నానని, ఆపరేషన్ ఆకర్ష్ అని దుప్ప్రచారం చేస్తున్నారన్నారు.

ఓటింగ్ కొనసాగిందిలా…
తదుపరి స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ తీర్మానంపై సోమవారం సాయంత్రం ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. తీర్మానానికి వైసీపీ ఎమ్మెల్యేలు 132 మంది, జనసేన ఎమ్మెల్యే రాపాక అనుకూలంగా ఓటు వేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభకు హాజరు కాలేదు. శాసనమండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా ఓటేసేవారంతా తమ తమ స్థానాల్లో నిలబడాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరగా.. వైసీపీ ఎమ్‌ఎల్‌ఎలు, జనసేన ఎమ్‌ఎల్‌ఎ లేచి నిలబడి మద్దతు తెలిపారు. వ్యతిరేకంగా ఓటేసేవారు, ఎటూ ఓటు వేయని వారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్ కోరినప్పుడు ఎమ్‌ఎల్‌ఎలు ఎవ్వరూ నిలబడలేదు. 133 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటేశారని, వ్యతిరేకంగా ఎవ్వరూ ఓటు వేయలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. కావున శాసన మండలి రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందిందని వివరించారు. శాసనసభ నిరవధికంగా వాయిదా వేశారు.

శాసనమండలిని రద్దు ప్రక్రియ పూర్తయ్యేదిలా…
శాసనమండలిని రద్దు చేయాలంటే తీర్మానాన్ని అసెంబ్లీ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాలి. శాసనసభలో పాలక వైసీపీకి 175 స్థానాలకు గానూ 151 మంది సభ్యులు ఉన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే శాసనమండలి రద్దుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతుంది. ఉభయసభల్లో(లోక్‌సభ, రాజ్యసభ)నూ అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా నిర్ణయం వెలువడితే శాసనమండలి రద్దు ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతం శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. వారిలో టిడిపి 26, వైసిపి 9, ప్రొగ్రెసివ్ డెమొక్రాటిక్ ఫ్రంట్(పిడిఎఫ్) 5, బిజెపి 3, ఇండిపెండెంట్లు(స్వతంత్రులు) ౩, నామినేటెడ్ సభ్యులు 8 మంది ఉన్నారు. నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాగా శాసనమండలి రద్దు నిర్ణయాన్ని విపక్ష టిడిపి, పీడీఎఫ్, ఇతర సభ్యులు వ్యతిరేకిస్తున్నారు.

Dissolution of the AP Council