Home స్పెషల్ ఆర్టికల్స్ ఆరోగ్యశ్రీపై చిన్నచూపు

ఆరోగ్యశ్రీపై చిన్నచూపు

nims-hospitals

నీరుగారి పోతున్న ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వం నుంచి ప్రైవేటు వార్డులకు వెళుతోన్న రోగులు
కార్పొరేట్ వైద్యానికి దూరమవుతోన్న ప్రజలు
రేపు మాపు అంటూ మభ్యపెడుతున్న వైద్యులు
రోగులపై, కుటుంబ సభ్యులపై దురుసుగా వ్యవహరిస్తున్న వైనం
పట్టించుకోని అధికారులు

మన తెలంగాణ/సిటీబ్యూరో : ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మరింత అనారోగ్యాల పాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. పేదలకు ఉచిత వైద్యం అందించాలనే లక్షంతో ప్రారంభించిన ఈ పథకం నీరు గారుతోంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు దారులను పట్టించుకోవడంలేదనే ఆరోపణలు నిత్యం వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న నిమ్స్ ఆసుపత్రిలో సైతం ఆరోగ్య శ్రీ కార్డు దారులను పట్టించుకోవడంలేదని పలువురు రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కార్డుపై చికిత్స పొందుతున్న రోగులు డిశ్చార్జీ చేసుకొని తిరిగి నిమ్స్‌లోనే డబ్బులు చెల్లించి అడ్మిట్ అవుతున్నారు. ఆరోగ్య శ్రీ కార్డులపై ఆసుపత్రులకు వెళుతోన్న రోగులకు అక్కడి వైద్యులు చుక్కలు చూపిస్తున్నారు. రోగులకు ప్రాణ భయం పెట్టి డబ్బులు కట్టించుకొని వైద్య సేవలు అందిస్తున్నారు. లేకపోతే డబ్బులు కట్టలేని వారిపై చిన్న చూపు చూస్తున్నారు. అమ్మో ఆరోగ్యశ్రీ నా రేపు మాపు రండి అంటూ రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇది కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతోన్న తతంగం. కానీ నిమ్స్ ఆసుపత్రిలో సైతం ఆరోగ్య శ్రీ కార్డు దారులు ఇదే చేదు అనుభవం ఎదురవుతోంది. ఆరోగ్య శ్రీపై నిమ్స్‌కు వచ్చే రోగులకు అడ్మిట్ చేసుకునేందుకు వారం పాటు సమయం పడుతోంది. తీరా అడ్మిట్ అయ్యాకా వైద్య సిబ్బంది రోగులను రోగులుగా చూడటంలేదని, తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రోగి ఆరోగ్య పరిస్థితి బంధువులకు తెలపడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంతే కాకుండా సిబ్బంది రోగులు, వారి బంధువులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.

అందని కార్పొరేట్ వైద్యం
ఆరోగ్యశ్రీ కార్డుదారులకు కార్పొరేట్ వైద్యం అందిస్తు న్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రైవేటు ఆసు పత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు వైద్యసేవలు ఎలా అందుతున్నాయో ఎవరు పర్యవేక్షించడంలేరు. ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే రోగాలతో బాధపడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే అక్కడ వైద్యులు పరీక్షించినఅనంతరం ఈ ఒక్కదానికి ఆరోగ్యశ్రీ వర్తించదని తేల్చి చెబుతున్నారు. చివరకు డబ్బులు కట్టించుకొని అదే రోగానికి వైద్యం అందిస్తున్నారు. ఇటీవల ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఇదే విషయంపై రోగి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఆలస్యంగా అందుతున్న సేవలు
కార్పొరేట్ ఆసుపత్రుల్లోకి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న రోగులు వెళితే అక్కడ వెళ్లినప్పటి నుంచి అంతా సపరేటే, ఆరోగ్యశ్రీ రోగులకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. నగదు చెల్లించే వారికి మాత్రమే కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు దారులకు వైద్య సేవలు కూడా ఆలస్యంగానే అందుతున్నాయి. ఇంతే కాకుండా ఆరోగ్యశ్రీ కార్డుతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్స లకు, ఇతర ఏదైనా వ్యాధులతో ఆసుపత్రుల్లో అడ్మిట్ కావాలంటే వారం పాటు సమయం పడుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు తిరిగి ఇంటికి వెళ్లలేక ఆసుపత్రుల ఆవరణలో అడ్మిషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.