Friday, March 29, 2024

అమెరికా చైనాల మధ్య దూరం

- Advertisement -
- Advertisement -

Distance between China and America  అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం విస్తరించుకుంటున్నది. వాటి సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. తాజాగా అమెరికా హూస్టన్‌లోని చైనా కాన్సలేట్‌ను మూసివేయించడం, అందుకు ప్రతిగా చైనా చెంగ్డూ నగరంలోని అమెరికా దౌత్య కార్యాలయానికి తాళం వేయించడం జరిగిపోయాయి. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని చేజారిపోనివ్వకుండా తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలని దీక్ష వహించిన డోనాల్డ్ ట్రంప్ చైనాతో లడాయిని అందుకు బలమైన సాధనం చేసుకోదలచాడని రూఢి అవుతున్నది. స్వదేశంలో కరోనా వ్యాప్తిని అదుపు చేయలేకపోయిన తన వైఫల్యం నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించడానికి కూడా చైనాపై అక్కసును మితిమించి చూపుతున్నాడనే అభిప్రాయమూ ఉన్నది. అమెరికా తర్వాత రెండవ అతి పెద్ద ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా అంతర్జాతీయ ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నది.

అటువైపుగా వడివడిగా అడుగులు వేస్తున్నది. చేరువలోనూ, దూరంలోనూ గల పలు దేశాలకు ఆర్థిక సహాయం చేస్తూ తన వైపుకి తిప్పుకుంటున్నది. ఇండియాకు సన్నిహితంగా ఉంటూ వచ్చిన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లను చైనా తనకు అనుకూలంగా మలచుకున్నది. ఇరాన్‌తో భారీ సహకార ఒప్పందం కుదుర్చుకున్నది. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ద్వారా ఆసియా, ఆఫ్రికా, యూరప్ తదితర ప్రాంతాల్లోని దాదాపు 70 దేశాలను కలిపే రోడ్డు రేవుల మార్గాన్ని నిర్మిస్తున్నది. ప్రధాని మోడీ హయాంలో భారత దేశం అమెరికాకు అమితంగా చేరువైందన్న కక్షతో మన లడఖ్ వద్ద సరిహద్దుల్లో మనతో సైనిక ఘర్షణకు దిగి దురాక్రమణ దుస్సాహసానికి చైనా పాల్పడింది. దాని విస్తరణ వాద సామ్రాజ్య కాంక్షకు అడ్డుకట్ట వేయాలని అమెరికా సంకల్పించడం ఈ నేపథ్యంలో అత్యంత సహజం.

ట్రంప్ దుడుకు స్వభావంతో దీనిని మరింత పెంచాడు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోడానికి అక్కడ అమెరికా నౌకా బలాన్ని మోహరింప చేశాడు. ఇంకో వైపు చైనాతో వాణిజ్య యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకు వెళ్లాడు. ఉన్నట్టుండి హూస్టన్‌లోని చైనా కాన్సలేట్‌ను ఇప్పుడు మూసివేయించాడు. ఇందుకు ప్రతీకారంగా చైనా తన చెంగ్డూ నగరంలోని అమెరికా కాన్సలేట్‌ను మూయించివేసింది. వాణిజ్య యుద్ధానికి గత జనవరి నాటి ఒప్పందంతో కొంత మేరకు తెరపడినప్పటికీ ఇప్పడీ కాన్సులేట్ల మూసివేత అంకం అమెరికా, చైనాల మధ్య సంబంధాలను మరింత క్షీణింప చేస్తుంది. అమెరికాలో గల స్వేచ్చా సమాజం కల్పించే అనేక అవకాశాలను చైనా యువత కోల్పోతుంది. అక్కడ చదువుకోవాలనే ఆరాటపడే పెక్కు మంది చైనీయుల ఆశలు వమ్ము అవుతాయి.

చైనా తన కాన్సలేట్ ద్వారా అమెరికా శాస్త్ర పరిశోధనలపై నిఘా వేసిందని, తన మేధా హక్కులకు భంగం కల్గించే చర్యలకు సమ కట్టిందని ఆరోపిస్తూ ట్రంప్ ప్రభుత్వం చైనా కాన్సలేట్ మూసివేతకు ఆదేశించింది. ఈ తాజా యుద్ధానికి తెర లేపింది ట్రంపేనని బోధపడుతున్నది. వాస్తవానికి గత జనవరి ఒప్పందం తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్యం సుస్థిరంగా కొనసాగుతున్నది. అంతకు ముందు దాదాపు రెండేళ్ల పాటు సాగిన భీషణ వాణిజ్య యుద్ధం వల్ల చైనా నుంచి వచ్చే దిగుమతులపైనే అధికంగా ఆధారపడి ఉన్న అమెరికాలో వాటి పెరిగిపోయి అక్కడి వినియోగదార్లకు, ఆయా వస్తువుల వాణిజ్యం సాగించే సంస్థలకూ తీవ్ర నష్టం కలిగింది. అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులను చైనా అధికంగా దిగుమతి చేసుకొనేలా చేయడానికి, దానితో గల భారీ వాణిజ్య లోటును తగ్గించుకోడానికి ట్రంప్ ఈ సుంకాల యుద్ధానికి తెర లేపాడు.

అందుచేత అమెరికాలోని రైతు లాబీ ట్రంప్‌కు చేరువైంది. అదే సందర్భంలో సాధారణ వినియోగదార్లను దూరం చేసుకున్నాడు. అమెరికా అధిక సుంకాల కారణంగా చైనాలోని తయారీ పరిశ్రమ నష్టపోయింది. చైనా అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఏటా 660 బిలియన్ డాలర్ల వాణిజ్యం రెండు దేశాల మధ్య సాగుతుంది. హాంకాంగ్ విషయంలో చైనాను ఇరకాటంలో పెట్టడానికి అమెరికా, పాశ్చాత్య దేశాలు తీవ్ర యత్నాలు చేస్తున్నాయి. హాంకాంగ్‌లో కొత్త భద్రతా చట్టాన్ని అమల్లోకి తెచ్చి దాని స్వయం ప్రతిపత్తిని కబళించిన చైనా చర్యను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల వేదికపై అమెరికా, బ్రిటన్, 27 యూరప్ దేశాలు విమర్శించగా ఈ విషయంలో చైనాకు అనుకూలంగా ప్రతిపాదించిన తీర్మానంపై 53 దేశాలు సంతకాలు చేశాయి. అందుచేత చైనాపై వాణిజ్య తదితర కయ్యాలలో ట్రంప్ పూర్తిగా పై చేయి సాధించలేకపోతున్న విషయం సుస్పష్టం. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య రగులుతున్న ఘర్షణ వాతావరణం అధ్యక్ష ఎన్నికల వరకే ఇలా సాగుతుందని ఆ తర్వాత మళ్లీ మామూలు పరిస్థితులు ఏర్పడ గలవని భావించవచ్చు. ఎందుకంటే అవి రెండూ ఎంత బద్ధ శత్రువులో అంతగా పరస్పరం ఆధారపడి ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News