Thursday, April 25, 2024

సెప్టెంబర్ 17 నుంచి బతుకమ్మ చీరలు

- Advertisement -
- Advertisement -

distribution of Bathukamma Sarees begins from Sep 17

రూ.333 కోట్లతో 1.10 కోట్ల చీరలు సిద్ధం

ఈ నెల 22నుంచి జిల్లాలకు పంపిణీ 18ఏళ్లు నిండిన నిరుపేద మహిళలకు అందజేత
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరెల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి 1.10 కోట్ల చీరలను పంపిణీ చేయనుంది. దీని కోసం ప్రభుత్వం రూ.333 కోట్లను వెచ్చిస్తోంది. తయారైన చీరెలను ఈ నెల 22వ తేదీ నుంచి జిల్లాలకు పంపనున్నారు. మారుతున్న మహిళల అభిరుచికి అనుగుణంగా చీరెలను తయారు చేయిస్తున్నారు. ఈసారి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలతో చీరెలను రూపొందించారు. ఈసారి చీరల డాబీ అంచు ఉండటం ఒక ప్రత్యేకతగా పేర్కొంటున్నారు. వచ్చే నెల 25 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో, వార్డుల్లో లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో మాదిరిగానే 18 ఏళ్లు దాటిన నిరుపేద మహిళలకు వీటిని పంపిణీ చేస్తారు. కంటే వేగంగా ఈ ఏడాది పంపిణీ చేపట్టేందుకు జనవరిలోనే చీరెల తయారీని ప్రారంభించింది. ప్రతి నెలా చొప్పున ఇప్పటి వరకు 90 లక్షలకు పైగా చీరలను తయారు చేశారు.

మరో నాలుగురోజుల్లో 20 లక్షల చీరలు ఉత్పత్తి కానున్నాయి. ఈ చీరెల తయారీకి సిరిసిల్లలోని 16 వేల మంది నేత కార్మికులకు పనులను అప్పగించింది. సుమారు 15వేల పైగా కేంద్రాల ద్వారా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పురపాలక వార్డులు, నగరపాలక డివిజన్ల వారిగా రేషన్ షాపులకు సమీపంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో రేషన్ డీలరు, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీలు, నగరాలు, పట్టణాల్లో రేషన్ డీలరు, పురపాలక బిల్ కలెక్టర్, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీల ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతాయి. కాగా గత సంవత్సరం వరంగల్ జిల్లాలోని టెస్కో గోదాములో జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుజాగ్రత్తగా అన్ని గోదాముల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. మండలస్థాయి గోదాముల వద్ద కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేసింది.

Batukamma Saries to distribute from Sep 17

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News