Home తాజా వార్తలు సర్కారు బడిలోకి పుస్తకాలొచ్చాయ్…

సర్కారు బడిలోకి పుస్తకాలొచ్చాయ్…

Government Schools

 

తొర్రూరు : తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతీ ఒక్కరికి విద్యావకాశం కల్పించేందుకు సర్కారు బడులను బలోపేతం చేస్తున్నారు. సర్కారు బడుల్లోనే గుణాత్మక విద్యతో పాటు సన్నబియ్యంతో కూడిన రుచికరమైన భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందించి విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడుల్లో విద్యార్థులకు విద్యనందిస్తుండటంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వ విద్యకే మొగ్గు చూపుతున్నారు. ఇంతకు ముందు (సమైక్యాంధ్రలో) ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు ఉండటంతో గ్రామీణ, పల్లె ప్రాంతాల ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివించేందుకు ఆసక్తి చూపారు. దీంతో వేల రూపాయలు ఫీజులు, పుస్తకాలు, దుస్తులు కొనుగోలు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ సర్కారులో ప్రభుత్వ పాఠశాలలు మరింతగా బలోపేతమయ్యాయి.

ప్రభుత్వం పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ఎన్నో వసతులు కల్పించడంతో గ్రామీణ ప్రజలు తమ పిల్లలను సర్కారు బడిలోనే చదివించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మక విద్యతో పాటు సన్నబియ్యంతో కూడిన రుచికరమైన భోజనం అందిస్తుంది. వీటితో పాటు ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి రెండు జతల దుస్తులు, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందజేస్తున్నారు. విద్యా, క్రీడలు, సాంకేతిక విద్యతో పాటు సంస్కృతిక కార్యక్రమాల్లో ప్రభుత్వ విద్యార్థులు ముందంజలో నిలుస్తున్నారు. ఈ ఏడాది పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం మరింతగా పెరగడంతో తమ పిల్లలను సర్కారు బడిలో చదివించేందుకు గ్రామీణులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. డివిజన్ కేంద్రంతో పాటు అన్ని పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు రావడంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖాధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముందస్తుగానే పాఠ్య పుస్తకాలు…

జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో సర్కారు బడులకు ముందస్తుగానే పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తున్నారు. మండలంలో మొత్తం 56పాఠశాలలు ఉండగా ప్రాథమిక పాఠశాలలు 39, ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ఉన్నత పాఠశాలల తొమ్మిది, గురుకులాలు నాలుగు, ఒక టీఎస్‌డబ్లూ ఆర్‌ఎస్, కేజీవీబీ, మైనార్టీ పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 5640 మంది విద్యార్థులకు గాను 20వేల పాఠ్య పుస్తకాలు వచ్చాయి. ఈ పాఠ్య పుస్తకాలను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. మండలంలోని ఉన్నత, గురుకుల, సాంఘిక సంక్షేమ, కస్తూర్భా, మైనార్టీ పాఠశాలలకు పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థికి పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి చేశారు. పాఠశాలలు ప్రారంభంతోనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడం జరుగుతుందని ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య తెలిపారు.

ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తప్పవు : ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య

ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యనందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు రుచికరమైన భోజనంతో పాటు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేస్తున్నాం. విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు సర్కారు బడుల్లోనే అన్ని వసతులు కల్పిస్తుంది. పాఠ్య పుస్తకాలను ప్రైవేటుగా విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థికి పాఠ్య పుస్తకాలు అందజేస్తాం. విద్యార్థులకు ఏ ఒక్క పాఠ్య పుస్తకం కొరత లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. బుక్ స్టాల్‌లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పాఠ్య పుస్తకాలు లభిస్తే ఆ దుకాణ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

 

Distribution of free Books at Government Schools