Home వనపర్తి కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు

కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు

LAND

పట్టించుకోని రెవెన్యూ అధికారులు
 భూములను పేదలకు పంచాలి
 డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడి డిమాండ్

హసన్‌పర్తి: కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు పట్టించుకోని హసన్‌పర్తి రెవెన్యూ అధికారులు వెంటనే భూములను నిరుపేదలకు పంచాలని డిబిఎఫ్  జిల్లా అధ్యక్షులు చుంచు రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతుందని రోజురోజుకు భూముల విలువ విపరీతంగా పెరుగుతుండడంతో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. మండలంలోని కోమటిపల్లిలో సర్వే నెం.360/బిలో ఐదు ఎకరాల మూడు గుంటల భూమిని గతంలోనే ఇందిరాగాంధీ హయాంలో రైతు గిరిజనులకు ఇండ్ల స్థలాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని కొనుగోలు చేసి ఇండ్లను నిర్మించి పేదలకు కేటాయించిందని తెలిపారు. కాని అప్పటి నుంచి ప్రభుత్వం మౌళిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇండ్లను వదిలేసి నివాసాలకు వెళ్లి పోయారు. ఆ తరువాత భూమిని అమ్మిన ప్రైవేటు వ్యక్తులు ఆస్థలం మాదేనని కాగితాలను తారుమారు చేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అట్టి భూమిని ప్రభుత్వ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని వారిపై ఎస్సి, ఎస్టి, అట్రాసిటి కేసు నమోదు చేయాలని, దళిత బహుజన ఫ్రంట్ డిమాండ్ చేస్తుందన్నారు. అదేవిధంగా పెగడపల్లి గ్రామంలో 712, 713, 714 సర్వే నెంబర్‌లలో ఉన్న 52 ఎకరాల ప్రభుత్వ భూమిని భూస్వాములు అక్రమంగా ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. వంగపహాడ్ శివారులో 410/2 సర్వే నెంబర్ ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న కొంతమంది రియల్ వ్యాపారులు ప్లాట్లు చేసి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నాగారంలో సర్వే నెం.202లో ఉన్న ప్రభుత్వ భూమిని పక్కనే ఉన్న రైతులు సుమారు 20 గుంటలు ఆక్రమించుకున్నారని, అట్టి స్థలాన్ని దళితులకు స్మశాన వాటిక కోసం రెవెన్యూ అధికారులు కేటాయించారు. కాని ఫలితం లేకుండా పోయింది. రెవెన్యూ అధికారుల నిర్లక్షం మూలంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న పట్టించుకున్న నాధుడే లేడని భూ సమస్యలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక సర్వే చేయించి నిరుపేదలకు ప్రభుత్వ భూములను అందజేయాలని కోరారు. అంతేకాకుండా డిబిఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటు వంటి భూ కుంభకోణంపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తూ నిరుపేదలకు భూము లు అందే వరకు ఉద్యమిస్తామని పేర్కొన్నారు.