Home తాజా వార్తలు ఖరీఫ్‌కు రైతుల సన్నద్ధం…

ఖరీఫ్‌కు రైతుల సన్నద్ధం…

 Farmers

 

* మరింత పెరగనున్న సాగు విస్తీర్ణం
* రుతు పవనాల రాక కోసం రైతాంగం ఎదురు చూపులు
* ఖరీఫ్ సాగుకు వ్యవసాయ అధికారుల కార్యాచరణ ప్రణాళిక
* పంట రుణాలు రూ.1776 కోట్లు ఇచ్చేందుకు బ్యాంక్‌లు సిద్ధం
* ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ప్రభుత్వ పెట్టుబడి సాయం

మంచిర్యాల: ఖరీఫ్ పనుల్లో జిల్లా రైతులు పూర్తిగా నిమగ్నమయ్యారు. ఈ ఏడాది రుతు పవనాలు ముందే వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు కోటి ఆశలతో ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎండలు మండుతున్నప్పటికీ సాయంత్రం సమయం లో వాతావరణం చల్లబడడంతోపాటు ఈదురు గాలులు వీస్తున్నందు వల్ల రైతులు దుక్కులు దున్ని భూములను సిద్ధం చేసుకుంటున్నారు.

పంటల సాగుకు అనుకూలంగా పంట రుణాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1776 కోట్లు అందించేందుకు బ్యాంక్‌లు సిద్ధమయ్యాయి. అంతే కాకుండా ఖరీఫ్ సాగుకు వ్యవసాయ అధికారులు సైతం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. గత ఏడాది పంట రుణాలు రూ.1465 కోట్లు కాగా ఈ ఏడాది రూ.211 కోట్ల వరకు అదనంగా ఇచ్చేందుకు బాంకర్లు ముందుకు వస్తున్నారు. ఖరీఫ్‌లో విత్తనాలు ఎరువుల కొనుగోలుకు పెట్టుబడి సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఈనెలాఖరు లోగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

జిల్లాలో సాగు విస్తీర్ణానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిపడేంత తెప్పించేందుకు అధికారులు సిద్దం చేస్తున్నారు. జిల్లాలో సాగు ప్రణాళిక 2,43,288 ఎకరాల సాగు విస్తీర్ణం కాగా 21,754 క్వింటాళ్లు రాయితీ విత్తనాలు, 74,163 మెట్రిక్‌టన్నుల ఎరువులు రూ. 1776కోట్లు పంట రుణాలను లక్షంగా పెట్టుకున్నారు. 2,43 లక్షల ఎకరాల్లో అధికారులు సాగుకు ప్రణాళిక సిద్దం చేశారు. జిల్లాలో అత్యధికంగా పత్తి, వరి పంటలు సాగవుతాయని అంచన వేశారు. పత్తి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి ఇతర పంటలను సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఏడాది పత్తి 1.39 లక్షల ఎకరాలు, వరి 93,117 ఎకరాలు, కంది 6,297, ఇతర పంటలు 4,264 ఎకరాల్లో సాగు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

దీనికి అనుగుణంగా రాయితీ విత్తనాలు ఎరువుల విషయాన్ని వ్యవసాయ శాఖకు ప్రతిపాదనలు పంపించారు. పత్తి విత్తనాలు మినహా, మిగిత వాటిని 33 శాతం రాయితీపై ఇవ్వనున్నారు. దీనికోసం 2.70 లక్షల వరకు పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. ఇప్పటికే ఆయా విత్తనాల డీలర్ల వద్ద 20 వేల వరకు పత్తి విత్తనాల ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచారు. ఏడాది ఖరీఫ్‌లో 74163 మెట్రిక్ టన్నుల వరకు ఎరువులను వినియోగించనున్నారు. ఇందులో యూనియ 27,165 మెట్రిక్ టన్నులు, బిఏపి 12,121 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్ ఎరువులు 21,104 మెట్రిక్ టన్నులు,పొటాష్ 11,870 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటాయని అధికారులు ప్రతిపాదించారు. ఈవిషయమై వ్యవసాయ సంచాలకులు వీరయ్య మాట్లాడుతూ పత్తి రైతులు డీలర్ల వద్ద నుంచి నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని నకిలి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు. ఖరీఫ్ సీజన్‌కు గాను అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచే శామన్నారు.

District Farmers are Actively Involved in Kharif Work