Home లైఫ్ స్టైల్ దీపావళి- ‘ధర్మసింధు’

దీపావళి- ‘ధర్మసింధు’

ఆశ్వియుజ శుద్ధ త్రయోదశి మొదలుకొని అయిదురోజుల పండుగ, దీపావళి పండుగ. 1. ధనత్రయోదశి, 2. నరకచతుర్దశి, 3. దీపావళి, 4. బలిపాడ్యమి, 5. యమద్వితీయ అని వరుసగా అయిదు రోజుల పాటు పాటించే ఈ పర్వవిశేషాలలో నరకచతుర్దశి రెండవది ఈరోజున తైలాభ్యంగనంవిధి.

diwali1తథాకృష్ణచతుర్దశ్యామాశ్వినేర్కోదయాత్పురా
యామిన్యాః పశ్చిమేయామే తైలాభ్యంగోవిశిష్యత
అని నిర్ణయసింధుకారుడు కమలాకరభట్టు వాక్యం. అందుకు అనేక ఇతర ధర్మగ్రంథాలు కాలాదర్శం వంటివి కూడా ప్రమాణాలు. ఆశ్వియుజ మాసం కృష్ణపక్షచతుర్దశి, చంద్రోదయవ్యాప్తి అయిన సమయంలో నరకానికి భయపడేవారంతా నువ్వులనూనె అలదుకొని అభ్యంగస్నానం చేయాలి.
పురాణకథనం ప్రకారం, శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో లోకకంటకుడైన నరకుని సంహారం చేసిన రోజు నరకచతుర్దశి. దుష్టశిక్షణ చేసి శిష్టులను రక్షించినవాడు పరమాత్ముడు. ఇది ఒకసారి మాత్రమేనా? అంటే నరకుడిని మాత్రమేకాక, రావణ, హిరణ్యకశ్యప, హిరాణ్యక్ష, కంసాది అనేకులను సంహారం చేసినవాడు పరమాత్ముడు. మరి ఆయా రోజులలో తైలాభ్యంగనం విధిగా చెప్పబడలేదే? అంటే నరకచతుర్దశికి మరేదో విశేషం కూడా ఉండాలి.
ఈరోజున మనం ఆచరించవలసినవి మూడు ప్రధాన కర్మలు. అవి తైలాభ్యంగనం, యమతర్పణం, ఉల్కాదానం.
తైలాభ్యంగనం :
Diwali4దేహమంతా నువ్వులనూనెను రాసుకొని, గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్నాన సమయంలో సీకాయ, పెసరపిండి, సెనగపిండి వంటి వాటితో నూనె జిడ్డును తొలగించుకోవాలి. సబ్బులు వినియోగించరాదు. మనదేహంలో ఉన్న కళ్లు-ముక్కు-చెవి-నాలుక-చర్మం అనే అయిదు ఇంద్రియాలలో, స్పర్శ చర్మసంబంధితం. శరీరానికి ఉన్న మరోలక్షణం, వీలువెంబడి వంగే స్వభావం కలిగి ఉండడం. చర్మాన్ని చేతపట్టుకొని లాగితే, సాగే గుణం ఉండి వదలగానే తిరిగి యథాప్రకారం కావడం అనే స్వభావానికి మూలం దేహంలో ఉన్న వాయుతత్వం.
స్పర్శ వేభ్యధికో వాయుః స్పర్శనంతత్వగాశ్రితమ్
త్వచంచ పరమోభ్యంగంః తస్మాత్తం తిలయేన్నరః
అని చరక సంహిత. స్పర్శ అనే ఇంద్రియగుణం చర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఈ చర్మపు కదలికలకు వాయువు ఆధారం. దీనికి బలం కలిగించేదే తైలాభ్యంగం.
నూనెతో శిరస్సుకు మర్దన చేస్తే శరీరం మొత్తానికి సుఖం, బలం, తృప్తి లభిస్తాయి. అరికాళ్ళకు మర్దన చేస్తే కళ్లు చల్లబడతాయి. ఇవి మనకు అనుభవంలో ఉన్న విషయాలు. చెవులలో కొన్ని చుక్కలు నూనె వేసుకుంటే, కర్ణరోగాలు, కర్ణమలం, మెడబిగిసిపోవడం, చెవిలో హోరు తదితర వ్యాధులు రావు. ముక్కు రంధ్రాలలో వేయడం ద్వారా జలుబు, తిమ్మిరులు, తుమ్ములు వంటివి అరికట్టవచ్చు. కంటి చివరలో వేసి నేత్రవ్యాధులకు కూడా దూరంగా ఉండవచ్చు. దంతాలకూ కళ్ళకూ సంబంధం ఉండడం కూడా తెలిసిన విషయమే. ఆ విధంగా దంత వ్యాధులూ దరిచేరవు. కనుక తైలాభ్యంగనం తప్పనిసరి. సంవత్సరకాలంలో తరచుగా ఇలా మనం తైలాభ్యంగనాన్ని ఆచరిస్తూ ఉండాలి. నరకచతుర్దశినాడైతే తప్పనిసరిగా ఆచరించాలి.
యమతర్పణం:
స్నానం చేసే సమయంలో విధిగా శరీరానికి మట్టిని రాసుకోవాలి. దశవిధ స్నానాలలో మృత్తిక (మట్టి)ను రాసుకొని చేసే స్నానం ద్వారా సకల పాపాల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్ర ప్రమాణం.
శీతలోష్ణ సమాయుక్త సకంటక దశాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమాణ ః పునఃపునంః
నాగలితో దున్నగా పెల్లగింపబడిన మన్ను ఉత్తమం. ఆముదం చెట్టు కొమ్మ, లేదా ఆనపతీగ లేదా ఉత్తరేణి కొమ్మలతో ఆ నీటిని మధ్య మధ్య కలుపుకొంటూ స్నానం చేయాలని ఆ తరువాత దోసిలిలో నీళ్లు తీసుకొని, దక్షిణం వైపు తిరిగి వేళ్ల చివరల నుండి నీళ్ళు వదులుతూ ఒక్కొక్క నామానికి మూడుసార్లు చొప్పున తర్పణం వదలాలని ఈ శాస్త్ర బోధ.
1. “యమాయనమః
2. ధర్మరాజాయనమః
3. మృత్యవే నమః
4. అంతకాయనమః
5. దైవస్వతాయ నమః
6. కాలాయనమః
7. సర్వభూతక్షయాయనమః
8. ఔదుంబరాయనమః
9. దధ్యాయనమః
10. నీలాయనమంః
11. పరమేష్టినే నమః
12. వృకోదరాయనమః
13. చిత్రాయనమః
14. చిత్రగుప్తాయనమః
Diwali2ఈ విధంగా పదునాల్గురికి తర్పణం వదలాలి. తండ్రి మరణించినట్లైతే, చూపుడువేలు బొటనవేలు మధ్య భాగం నుండి ఈ నీరు వదలాలి. తండ్రి బతికి ఉన్నచో యజ్ఞపవీతం సవ్యంగానే ఉంచి నాలుగువేళ్ల చివరనుండి వదలాలి. ఇది యమతర్పణమని ఈ శాస్త్రం విశదీకరించింది.

ఉల్కదానం
ఉల్కలు అంటే కొరవులు. కట్టె చివర పేడ, బొగ్గుపొడి కలిపి, అద్ది ఎండబెట్టి దానిపై తైలం వేసి వెలిగించితే అది కొరవి. సూర్యాస్తమయం కాగానే వాటిని వెలిగించి ఆకాశంవైపు చూపుతూ ఇలా చెప్పాలి.
అగ్ని దగ్ధాశ్చయేజీవా యేప్యదగ్ధాఃకులేమమ
ఉజ్జల జ్యోతిషాదగ్ధాస్తేయాంతు పరామాంగతిం
యమలోకం పరిత్యజ్య ఆగతాయే మహాలయే
ఉజ్జల జ్యోతిషా వరర్త ప్రవశ్యంతు వ్రజంతుతే
ఈ చుతుర్దశి నాటి సాయంత్రం, చేతిలో ఇలా కొరవిని పట్టుకొని ఆకాశంవైపు చూపుతూ, అగ్నిచేత దేహం మాత్రమే దహింపబడుతుంది. ఆ అగ్నిచేత ధర్మం నిర్వహింపబడుతుంది. ఆ అగ్నిమార్గం చూపిస్తుంది. ఉత్తమలోకాలకు మార్గనిర్దేశం చేస్తుంది కనుక, యమలోకం విడిచి మహాలయపక్షంలో మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈ లోకాలకు వచ్చిన పితృదేవలకు ప్రీతికరంగా ఉత్తమ లోకాలకు పథం నిర్దేశించే నిమిత్తమే ఈ ఉల్క అని ఆ తరువాత కొరవిని ఇంటి మేడపైన దక్షిణ దిగ్భాగంలో పెట్టాలి. దీనికే ప్రతీకగా, ఆకాశదీపాన్ని నేడు మనం వెలిగిస్తున్నాం.
ఆ తరువాత, దేవాలయం, మఠం, ప్రాకారం, వీధికూడలి, ఇంటిముందు భాగం, గోశాల, గజశాల, అశ్వశాల అనే ఎనిమిది చోట్ల దీపాలను వెలిగించాలి.
ఈ నరకచతుర్దశినాడు నక్తభోజనం చాలా పుణ్యప్రదమని శాస్త్రం. మధ్యాహ్నం భోజనం చేయరాదు. దీపావళి నాడు కూడా ఇదే ప్రకారంగా భోజన నియమాలను ఆచరించాలి అని ధర్మసింధు చెబుతున్నది. నరకచతుర్దశి సంపూర్ణంగా పితృదేవతాకమైన పర్వదినంగా శాస్త్రం చెబుతున్నప్పుడు మరి కృష్ణుడు సత్యభామల కథ-నరకవధ- అంశాల పౌరాణిక ఇతివృత్తానికి ఇంత ప్రచారమెక్కడిది?
నరకాసురవధ
భాగవతంలో ఒక కథ ఇది. నరకుడు భూదేవి కుమారుడు. ప్రాగ్జోతిషపురం ఇతడి రాజధాని. ఇతడు తన రాజ్యంలో పదహారువేలమంది స్త్రీలను బంధించి ఉంచాడు. దేవతల కోరికపై శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా, గరుత్మంతుడు వాహనంగా నరకుడిపైకి యుద్ధానికి వెళ్లి, అతడిని చంపి, ఆ స్త్రీలందరికీ బంధవిమోచనం చేశాడు. ఇదీ కథ. ఖగోళంలో వచ్చిన మార్పులకు ప్రతీక ఈ కథ. మేషరాశికి అధిపతి కుజుడు. ఇతడు భూ పుత్రుడు. సింహరాశి నుండి కన్యారాశిలోని సంచారం దసరా పండుగ కథ అయితే, కన్యారాశి నుండి తులారాశికి సూర్యసంచారమార్పు, ఈ నరక చతుర్దశి పండుగ కథ. పదహారు వేల మంది స్త్రీలకు కన్యారాశి నుండి విడుదల ప్రతీకాత్మక ఇతివృత్తం.
వేదం చెప్పిన శాస్త్ర ప్రమాణ ధర్మాన్ని పురాణ ఇతిహాసాలు మనోహరంగా కథల సహాయంతో వర్ణనతో వివరిస్తాయి. “హరి జూచున్ అరిజూచు”, “చూచుకములందందు మందార సలిలస్యందంబు లందంబులు”గా వర్ణించిన నాచన సోమనలాంటి కవుల కల్పనలు కావ్యానందాన్ని కలిగిస్తూ, ధర్మ ప్రబోధం కూడా చేస్తాయి.
ఈ చతుర్దశికి మరో పేరు!
నరకచతుర్దశికి మరో పేరు కూడా ఉంది. అది ప్రేత చతుర్దశి. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల ముందు కాలం అరుణోదయం. అంతకుముందే నూనెతో తలతో పాటు శరీరమంతా మర్దన చేసుకొని ఆ సమయంలో తలస్నానం చేయాలి. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలం కూడా కనుక, ఉష్ణకాంతి స్వల్పంగా భూమికి చేరుతుంటుంది. అంటే మేషరాశిలో సూర్యాస్తమయం తులారాశిలో సూర్యోదయం. కనుక ఈ రోజులల్లో పగటికాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువ. ఫలితంగా మనమంతా చర్మంపై పగుళ్లతో, శరీరకాంతి కొంచెం తగ్గిపోయి కనిపిస్తాము. ఈ దోషం తొలగిపోవడం కోసమే చతుర్దశి నాటి తైలాభ్యంగనం అని శాస్త్రోక్తి.
అందరూ చెప్పే మాట!
తైతేలక్ష్మీర్జలేగంగా దీపావళితిథేవసేత్
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగోవిధీయతే
ఈ పండుగ రోజులలో నువ్వులనూనెలో లక్ష్మి, నీటిలో గంగ తమతమ శక్తులను నిక్షేపిస్తారు కనుక, అలక్ష్మి అంటే దరిద్రం తొలగడం కోసం తలంటుకొని స్నానం చేయాలి. అందుచేత గంగాస్నాన పుణ్యఫలం కూడా లభిస్తుంది.
జ్యోతిషపరంగా నరకచతుర్దశి
ఇది అయనాంశ మార్పులకు చెందిన పండుగ. భూమికి ఉండే రెండు చలనాల గురించి అందరికీ తెలుసు. భూభ్రమణం, భూపరిభ్రమణం. ఈ రెండింటితో పాటు మూడవ చలనం అక్షసంబంధితం. ఇరవై ఆరువేల ఏడువందల సంవత్సరాలకొకసారి భూమి ఒక డిగ్రీ పక్కకు జరిగి కొత్త దిశను తూర్పుగా నిర్ణయం చేసుకుంటుంది. పూర్వం అటువంటి మార్పు జరిగినప్పుడు దిశానిర్దేశం చేసే నరక నక్షత్రం తొలగిపోయి, ప్రస్తుతం తూర్పు దిశ సూచించే ధ్రువనక్షత్రం వచ్చి చేరింది. ఈ మార్పును సూచించేదే నరకచతుర్దశి. నరకచతుర్దశి ఆశ్వియుజ బహుళపక్షంలో వస్తుంది. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలం ఇది. చిత్త రెండు పాదాలు, స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు, విశాఖ మూడు పాదాల కాలం వెరసి, ఒక మాసం ఇది, తులామాసం. చిత్తకుజ నక్షత్రం. కుజుడు అగ్నిగ్రహం. స్వాతి నక్షత్రం రాహు నక్షత్రం. ఇది వాయువు ఆధిపత్యం కలది. విశాఖ నక్షత్రం గురు నక్షత్రం. ఇంద్రాణి ఆధిపత్యం కలది.
కుజనక్షత్ర సంబంధిత కథనం ; నరకాసుర కథ.
స్వాతినక్షత్ర సంబంధిత జ్ఞానం ; తైలాభ్యంగన నియమం
విశాఖానక్షత్ర సంబంధిత విజ్ఞానం ; గురుప్రోద్బలమైన సంప్రదాయానుచరణం.
ఇది తెలిస్తే ఈ చతుర్దశి, స్వర్గచతుర్దశి.

డా॥ కాకునూరి సూర్యనారాయణమూర్తి

సెల్ : 9866542365