Home లైఫ్ స్టైల్ ఆత్మహత్యలే పరిష్కారం కాదు…

ఆత్మహత్యలే పరిష్కారం కాదు…

 Suicide

 

ఈ సృష్టిలో ఉండే ఏ జీవరాశిలోనూ తన ప్రాణం తనే బలవంతంగా తీసుకోవాలనే కోరిక ఉండదు. సూక్ష్మశరీరంతో ఉండే కీటకాల దగ్గర నుంచి ప్రతిక్షణం క్రూర జంతువులు చేతిలో ప్రాణహాని ఉన్నా ఏ జంతువు కూడా పోన్లే అస్తమానం కష్టపడే ఈ జీవితం ఎందుకు? నిమిష నిమిషం ఈ ఆపదలు ఎందుకు అని ఆత్మహత్య చేసుకోవాలని చూడవు. బలమైన జంతువులున్న ప్రాంతంలో నివసిస్తూ బతుకు పోరాటం చేస్తాయి. మరి ఈ జంతువుల కంటే తెలివైన, విచక్షణా జ్ఞానం కలగిన మనిషి ఎందుకు జీవితం నుంచి పారిపోవాలని చూస్తున్నాడు. తన ప్రాణం తనే తీసుకోవాలనే పిరికితనం మనిషికెందుకు?

చుట్టూ సమాజం, ప్రజలు, ఆత్మీయులు, తనను కన్న వాళ్లు, తను కన్నవాళ్లు, స్నేహితులు, ఇరుగు పొరుగు ఇంతమందితో ప్రతి క్షణం ఎంతో సంయమనంతో స్నేహంతో, ప్రేమతో మెలిగే సంఘ జీవి మనిషి. నిజమే కష్టాలు, ఆపదలు, భరించలేని బాధలు అనారోగ్యాలు వస్తాయి నిజమే. కానీ ఏ సమస్యకైనా చావే… అందుకే బలన్మరణమే సమాధానమా? ప్రపంచంలో ప్రతి సంవత్సరం దాదాపు ఎనిమిది లక్షలపైనే ఆత్మహత్యలు రికార్డవుతున్నాయి. వీటిలో 17 శాతం ఆత్మహత్యలు భారతదేశంలోనే జరుగుతున్నాయి. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 17.5. మరి ఈ ఆత్మహత్యల సంఖ్య ఆందోళన కలగిస్తోంది అంటే ఆశ్చర్యం ఏముందీ?

ఒక సర్వే ప్రకారం ఆత్మహత్యల విషయంలో చైనా, భారత్, రష్యా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు ముందున్నాయి. ప్రతి పదిలక్షల జనాభాకి 16.4 శాతం ఆత్మహత్యలు మహిళల్లో జరుగుతున్నాయి. 25.8 శాతం పురుషుల ఆత్మహత్యలుగా రికార్డులు చెబుతున్నాయి. సాధారణంగా భారతదేశంలో అరవై శాతం స్త్రీలు పురుషులపై ఆధారపడి జీవిస్తున్నవారే. ఉద్యోగాల్లో పురుషులు ఉంటే గృహిణులుగా ఇంటికి పరిమితమైన స్త్రీలున్నారు. ఒక్క రూపాయి సంపాదన లేకుండా, భర్తలపై, తండ్రులపై ఆధారపడి ఉన్న స్త్రీల ఆత్మహత్యల శాతం తక్కువగా ఉంటే పురుషుల శాతం ఎక్కువగానే ఉంది.

ఆత్మహత్యల విషయం జరుగుతున్న సర్వేలో అనారోగ్యాలు ప్రధాన కారణంగా గుర్తించారు. భారతదేశంలో మాససిక, శారీరక దీర్ఘకాల అనారోగ్యాల కారణాలుగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తరువాత కుటుంబ సమస్యలు రెండో కారణంగా ఉన్నాయి. అంతే కాదు, ఈ కుటుంబ సమస్యల్లో పిల్లల చదువులు, వాళ్ల ప్రవర్తన కూడా కారణాలుగా ఉన్నాయి. మిగతా వరసలో వ్యక్తిగత విభేధాలు, దాంపత్య జీవిత నైపుణ్యాలు విడాకు లు, ఒంటరి జీవితం వంటివి కారణాలుగా ఉన్నాయి.
దక్షిణాది రా్రష్ట్రాల్లో ఈ ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణాల్లో ఆత్మహత్యలు పెరిగాయి. విద్య ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండి వెనుకబడ్డ రాష్ట్రాలుగా గుర్తించిన ప్రదేశాల్లో ఆత్మహత్యలు తక్కువే. ఆ లెక్కన, బీహార్, ఉత్తరాఖాండ్, హిమాచలప్రదేశ్, జార్ఖండ్, ఒడిశాల్లో ఆత్మహత్యల సంఖ్య చాలా తక్కువ.

దాంపత్య జీవవితంలో వేధింపులు, జీవితంలో కోరుకున్న కోరికలు తీరకపోవటం, ప్రేమ వైఫల్యాలు ఆర్థిక సమస్యలు వంటివి కొన్ని కారణాలుగా ఈ ఆత్మహత్యల విషయంలో కనిపిస్తాయి. అన్నింటికంటే ఆందోళన కలిగించే సమస్య విద్యార్థుల్లో ఆత్మహత్యలు. మనదేశంలో 15, 29 సంవల్సరాల మధ్య వయసులో అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది.

జీవితం గురించి కమ్మని కలలుంటాయి. గొప్పలక్షాలుంటాయి. ఉత్సాహపు వెల్లువలాగా కనిపించే పిల్లలు ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పే విషయం ఏమిటీ? వాళ్ల మనసులోకి బలహీనత ఎందుకు ప్రవేశిస్తుంది అంటే ముందుగా తప్పు పట్టవలసింది తల్లిదండ్రులనే… ఈ తరం పేరెంట్స్ వాళ్ల కెరీర్‌లో కాస్త మంచి స్థానంలోనే ఉన్నారు. కుటుంబం అంటే తల్లిదండ్రీ పిల్లలకే పరిమితమై ఆ కుటుంబంలో పెద్దవాళ్లకు చోటివ్వని స్వార్థంతో ఉన్నారు. వాళ్ల శిక్షణలో పిల్లలకు అర్థం అయింది కేవలం జీవితంలో మొదటిస్థానం అందుకోవటం. మార్కులు సంపాదించి, అమెరికా వెళ్లేదారిని సుగమం చేసుకోవటం. కోచింగ్ కేంద్రాల ప్రభావంతో పోటీ తత్వంతో పిల్లల బతుకు జైలు కంటే అధ్వాన్నంగా తయారయింది.

భారతదేశంలో ఆత్మహత్యలు కేవలం విద్యార్థులకే పరిమితం అవలేదు. అతి చిన్న కారణంతో కూడా ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య తక్కువగా లేదు. మత విన్యాసాలు మనిషి ప్రాణం తీస్తున్నాయి. సామూహిక ఆత్మహత్యలు మరింత భయం కలిగిస్తున్నాయి.ఈ ఆత్మహత్యల్లో అధికశాతం ఆర్థిక ఇబ్బందులకు సంబంధించినవి. బతుకు దారిలో ఎదురయ్యే కష్ట నష్టాలను, ఓర్పుగా ఎదుర్కోగలిగే నేర్పును పిల్లలు అలవర్చుకునేలా వాళ్లకి మనసుకి హత్తుకునే లాగా చెప్పాలి. ముందుగా పిల్లలకు పెద్దవాళ్లు సమయం ఇవ్వాలి. పిల్లలకు ఖరీదైన వస్తువులను కొని ఇవ్వటం మాత్రమే ప్రేమ కాదని గుర్తించాలి. వస్తు వ్యామోహం, విలాసవంతమైన జీవితమే ప్రధానంగా వాళ్లను పెంచకూడదు.

వాళ్లని మంచి పౌరులుగా, ప్రేమ ఆదరణల అర్థం తెలిసిన వాళ్లుగా, సమాజాన్ని, చుట్టూ మనుషులనీ, పక్షులని, జంతువులను, సమస్త ప్రకృతినీ ప్రేమించేవాళ్లుగా, అచ్చమైన మనుషులుగా పెంచితే అసలీ ఆత్మహత్యల ఆలోచనలే రావు. వాళ్లు కష్టాల్లో ధైర్యంగా నిలబడతారు. తోటి వారికి ప్రేమ పంచుతారు. ప్రేమ గ్రహిస్తారు. ఎలాంటి సందర్భాన్నయినా ఎదుర్కొంటారు. తమ కుటుంబానికే కాదు, తమ చుట్టూ ఉన్న వాళ్లకి కూడా కొండంత అండగా ఉంటారు. అలాంటి తరాన్ని మనం తయారు చేసుకునే వరకు ఈ ఆత్మహత్యల వృత్తాంతాలు వింటూ ఉండవలసిందేనా!

Do not Commit Suicide