Wednesday, April 24, 2024

నీట్-పిజి పరీక్షా కేంద్రాల మార్పునకు ‘సుప్రీం’ నో

- Advertisement -
- Advertisement -
Doctors demand change in NEET PG Exam Centres
ప్రయాణాలపై ఆంక్షలు లేవంటూ పిటిషన్ కొట్టివేత

న్యూఢిల్లీ: ఈ నెల 11న(శనివారం) జరగనున్న నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రెన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్(నీట్-పిజి) పరీక్ష సెంటర్లను మార్చాలని కోరుతూ 9 మంది డాక్టర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. కొవిడ్-19 ఆంక్షల కారణంగా నీట్-పిజి పరీక్ష రాసేందుకు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లడంలో ఇబ్బందులు తలెత్తుతున్న కారణంగా పరీక్ష సెంటర్లను మార్చాలంటూ 9 మంది డాక్టర్ల తరఫున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

న్యాయవాది మీనాక్షి అరోరా తన వాదనలు వినిపిస్తూ పిటిషనర్లలో ఒక డాక్టర్ ప్రస్తుతం కొవిడ్ విధుల నిమిత్తం వారణాసిలో ఉన్నారని, ఆయనకు నీటి-పిజి పరీక్ష సెంటర్ కేరళలో పడిందని, రోజువారీ కరోనా కేసులు తీవ్రంగా ఉన్న కేరళకు వెళ్లి ఆయన పరీక్ష ఎలా రాయగలరని ప్రశ్నించారు. ఇతర పిటిషనర్లు కూడా నీట్-పిజి పరీక్ష కోసం ఢిల్లీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక తదితర నగరాలకు ప్రయాణించవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆమె చెప్పారు. దూర ప్రాంతాలకు ప్రయాణించడం వల్ల యువ డాక్టర్లు కొవిడ్ బారిన పడే ప్రమాదం ఉందని న్యాయవాది వాదించారు. ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చుతూ ప్రస్తుతం ప్రజలు స్వేచ్ఛగా ఎక్కడికైనా ప్రయాణిస్తున్నారని, విమానాశ్రయాలకు వెళితే విమానాలన్నీ ప్రయాణికులతో పూర్తిగా భర్తీ అవుతున్నాయని, ఈ పరిస్థితులలో పరీక్షా కేంద్రాలను మార్చడం కుదరదని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News