Home ఎడిటోరియల్ రక్షణ లేని వైద్యులు

రక్షణ లేని వైద్యులు

Sampadakiyam          పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఒకందుకు విమర్శించాలి, మరొకందుకు అభినందించాలి. నాలుగు రోజుల క్రితం కోల్‌కతా ఎన్‌ఆర్‌ఎస్ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులపై ఒక వృద్ధ రోగి బంధువులు చేసిన దాడిపై ఆందోళన చేపట్టిన డాక్టర్లను తీవ్రంగా హెచ్చరించినందుకు ఆమెను తప్పు పట్టాలి. తద్వారా దేశ వ్యాప్తంగా గల వైద్య లోకం భగ్గున మండి నిరసనకు దిగేలా చేసినందుకు ఆమెను అభినందించాలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన రోగుల బంధువులు డాక్టర్లపై భౌతిక దాడులకు దిగడం కొత్త కాదు. ఇది దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లోనూ తరచూ సంభవిస్తున్న దారుణమే. అయితే ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఘటన దేశ వ్యాప్త వైద్యుల ఆందోళనకు దారి తీసింది. దీని వల్ల ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ఒక శాశ్వత నిరోధక వ్యవస్థ ఏర్పడడానికి అవకాశాలు మెరుగుపడతాయని ఆశించవచ్చు.

కోల్‌కతా ఎన్‌ఆర్‌ఎస్ ఆసుపత్రి ఉదంతం ఇంతలా విస్తరించడానికి బెంగాల్‌లో బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ మధ్య రగులుతున్న రాజకీయ శత్రుత్వం కూడా కొంత వరకు కారణమై ఉండవచ్చు. ప్రతిష్ఠకు పోకుండా సమస్యను పరిష్కరించాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మమతా బెనర్జీ కి సలహా ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. జాతీయ స్థాయి నిరసన పర్వంలో ఢిల్లీ ఎయిమ్స్, సఫ్దర్ జంగ్ ఆసుపత్రి, మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, హైదరాబాద్ నిమ్స్, గాంధీ, నిలోఫర్ తదితర వైద్య సంస్థల డాక్టర్లు పాలుపంచుకుంటున్నారు. ఆందోళన జిల్లాలకూ పాకింది. దేశ వ్యాప్తంగా గల వైద్యులు సోమవారం నాడు సమ్మె చేయాలని భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఎ) పిలుపు ఇచ్చింది. మమతా బెనర్జీ ఒక్కరు తన వైఖరిని మార్చుకుంటే ఈ ఉదంతం వల్ల దేశ వ్యాప్తంగా రోగులు ఎదుర్కొంటున్న కష్టాలు గట్టెక్కుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్య గమనించదగినది.

ఆయన వ్యాఖ్యలోని రాజకీయం బహిరంగ రహస్యమే. ఇప్పుడు జరగవలసింది బెంగాల్ సహా దేశమంతటా వైద్యులు జరపుతున్న ఆందోళన సద్దుమణగడమొక్కటే కాదు. విధి నిర్వహణలోని వైద్యులపై రోగులు, వారి బంధువులు భౌతిక దాడులకు దిగడమనే అసలు సమస్యకు గట్టి పరిష్కారం కనుగొనాల్సి ఉంది. ఈ ఆందోళనను చల్లార్చినంత మాత్రాన అది పరిష్కారానికి నోచుకున్నట్టు కాజాలదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకోదగిన అన్ని చర్యలు చేపట్టినప్పుడే ఈ దాడులకు కొంతైనా అడ్డుకట్ట పడుతుంది. ప్రాణం నిలబెట్టడం అనేది పూర్తిగా వైద్యుల చేతుల్లోనిది కాదు. అందుకోసం తగిన చికిత్స చేయడమే వారి పని. రోగి చనిపోతే వైద్యులు నిర్లక్షం చేశారనే అభిప్రాయానికి రావడం తగదు. డాక్టర్లపై దాడికి దిగడం ఇతర రోగులకు జరగవలసిన చికిత్సను దెబ్బ తీస్తుంది. రోగి చనిపోడానికి చికిత్స చేసిన వైద్యులే బాధ్యులనే అభిప్రాయానికి రావడంలో వారి విషాద పూరిత తక్షణ మానసికావేశం పని చేస్తుంది.

దానికి దారులు బంద్ చేసి ఈ దాడులను అరికట్టడానికి బహు ముఖమైన వ్యూహం అవసరం. ముందుగా ఆసుపత్రుల్లో ఆంతరంగిక భద్రత వ్యవస్థను పటిష్ఠం చేయాలి. వార్డుల్లో, ఇతర చోట్లా సిసి టివి కెమెరాలను ఏర్పాటు చేయడం, భద్రతా సిబ్బందిని పెంచడం, సందర్శకుల రాకపై సహేతుకమైన గట్టి ఆంక్షలు విధించడం వంటి చర్యలు తీసుకోవాలి. అలాగే ఆసుపత్రులకు వచ్చే రోగుల బంధువుల ప్రవర్తనలో మార్పు తీసుకు వచ్చే విధంగా వారికి చెప్పడం నిరంతరంగా జరుగుతుండాలని ఐఎంఎ వంటి సంస్థలు చిరకాలంగా సూచిస్తున్నాయి. కోల్‌కతా ఆసుపత్రి ఘటనలో రోగి బంధువులు 200 మంది ఆసుపత్రిలోకి చొచ్చుకు వచ్చి వైద్యులపై దాడి చేశారని సమాచారం. అంత మంది లోపలికి ఎలా రాగలిగారు అనేది ప్రశ్న. అన్ని ఆసుపత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించడానికి సంబంధించి కేంద్ర స్థాయిలో పకడ్బందీ చట్టాన్ని తీసుకు రావలసి ఉంది.

ఈ వైపుగా కొన్ని నమూనా చట్టాలు ఇప్పటికే రూపొంది ఉన్నాయి. వాటిని పరిశీలించి మెరుగైన చట్టాన్ని తీసుకు రావలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉంది. ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆయా రాష్ట్రాల ఆరోగ్యమంత్రులో, ముఖ్యమంత్రులో జోక్యం చేసుకొని వైద్యులను ఓదార్చడం, భవిష్యత్తులో అటువంటివి జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడం వంటివి చేసి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ విధుల్లో చేరకపోతే తడాఖా చూపిస్తానని వైద్యులను తీవ్రంగా హెచ్చరించడంతోనే ఈ సమస్య జాతీయ స్థాయి ఆందోళనకు దారి తీసింది. ఇది తగిన పరిష్కార చర్యలకు దోహదపడాలి.

Doctors protest after patient kin attack at NRS Hospital