Home ఎడిటోరియల్ అవైద్యుల కార్ఖానా

అవైద్యుల కార్ఖానా

Sampadakiyam      రాష్ట్రపతి ఆమోద ముద్రతో శాసన రూపం ధరించిన తర్వాత కూడా జాతీయ మెడికల్ కౌన్సిల్ వ్యవస్థ పట్ల దేశంలోని వైద్యలోకం నుంచి నిరసనలు సద్దుమణ గకపోగా తీవ్రరూపం ధరించడం ఆ చట్టంలోని చీకటిపార్శ్వాన్ని ఎత్తిచూపు తున్నది. అంతవరకూ గల భారత మెడికల్ కౌన్సిల్ (ఐఎంసి) అవినీతిమయమై పోయిందని చెప్పి దాని స్థానంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసి)ని తీసుకు వచ్చారు. ఈ ఎన్‌ఎంసి ఎంబిబిఎస్ కోర్సును మరింతగా కేంద్రీకృతం చేస్తున్నది. ఇప్పటికే వివాదాస్పద నీట్ (NEET) పరీక్ష రూపంలో ఆ కోర్సులో ప్రవేశం కల్పించే ఎంట్రన్స్ టెస్టును కేంద్రీకృతం చేసింది. ఎంసెట్ వంటి రాష్ట్రాల స్థాయి ప్రవేశ పరీక్షలను రద్దు చేసి దేశమంతటికీ ఒకే ప్రవేశ పరీక్ష నీట్ (నేషనల్ ఎలిజి బిలిటీ, ఎంట్రన్స్ టెస్టు)ను ప్రధాని మోడీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనిని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాడిన ఆ రాష్ట్ర విద్యార్థిని ఒకరు ఆత్మహత్యకు పాల్పడడం నీట్‌కు అక్కడ వెల్లువెత్తిన నిరసన తీవ్రతను చాటింది.

తాజాగా తీసుకొచ్చిన ఎన్‌ఎంసి చట్టం ఎంబిబిఎస్ చివరి సంవత్సరం పరీక్షను కూడా కేంద్రీకృతం చేస్తున్నది. అన్ని రాష్ట్రాలలోని వైద్య విద్యార్థులకు జాతీయ స్థాయి పరీక్ష (నెక్స్- నేషనల్ ఎగ్జిట్ టెస్టు) నిర్వహించి అందులో పాసైన వారికే వైద్యులుగా గుర్తింపునిస్తారు. అన్నింటికంటే ప్రమాదకరమైనది ఎన్‌ఎంసి చట్టం లోని 32వ సెక్షన్. దీని ద్వారా దేశమంతటా గల ఆయుష్ (ఆయుర్వేద, యునాని, హోమి యోపతి, ప్రకృతి వైద్యం, యోగా, సిద్ధ) వైద్యులకు, నర్సులకు, మెడికల్ టెక్నిషియన్లకు ఆల్లోప తిలో ఆరు మాసాల శిక్షణ ఇచ్చి దాదాపు ఎంబిబిఎస్ పట్టభద్రుల స్థానంలో గ్రామీణ వైద్యు లుగా నియమించడానికి అవకాశం కలుగుతున్నది. ఆ విధంగా పల్లెలు ఎదుర్కొంటున్న యోగ్యు లైన వైద్యుల కొరత తీర్చాలన్నది మోడీ ప్రభుత్వ సంకల్పం. వైద్యం అనేది ప్రాణం పోయడంతో సమానమైనది.

శరీరంలో ఏ అవయవానికి, ఏ వ్యవస్థకు ఏ చిన్న కష్టం కలిగినా దానికి సంబంధించి పూర్తి శాస్త్రీయ చికిత్స తెలియకుండా వైద్యానికి సమకట్టే వారి వల్ల అది ముదిరి మరింత ప్రమాదకరంగా మారుతుంది. అరుదుగానైనా ప్రాణం మీదికే తెస్తుంది. ఇప్ప టికే ఆర్‌ఎంపి, పిఎంపిల వంటి అనర్ధక, దురర్ధక, నకిలీ వైద్యుల వల్ల నానాకష్టాలు ఎదుర్కొంటున్న గ్రామీణ పేదలు ఈ కొత్త మెడికల్ మూకతో మరింతగా యాతనలు పడాల్సి వస్తుందని, భార తీయ జనతా పార్టీ తన ఓటు బ్యాంకు రాజకీయ దృష్టితోనే ఈ ఎత్తుగడ ఎత్తిందని వైద్యలో కం ఒక్క కంఠంతో విమర్శిస్తున్నది. దీనికి నిరసనగా భారతీయ వైద్య సంఘం ఇప్పటికే దేశ వ్యాప్త వైద్యసేవల బంద్ నిర్వహించింది. దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతా లలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న మాట వాస్తవం. ఇప్పుడున్న 8లక్షల మంది వైద్యులకు తోడు అదనంగా కనీసం 5లక్షల మంది అవసరమని అంచనా. కొన్ని రాష్ట్రాలలో అవసరానికి మించి వైద్యులు ఉన్నా వారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధంగా లేరు.

పట్టణ ప్రాంతాల్లోనే స్థిరపడి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఈ కొరతను చూపించి ఎన్‌డిఎ ప్రభుత్వం మొద్దుకత్తుల వంటి అవైద్యులకు ఆరు మాసాల వ్యవధిలో ఇంగ్లీషు వైద్యుల వేషం వేయించి గ్రామాలకు పంపించదలచడంలోని తొందరపాటుతనాన్ని వివరించనక్కరలేదు. గ్రామీణ వైద్యంలో ముఖ్య అంశమైన ప్రజారోగ్యం గురించి వీరికి బొత్తిగా అవగాహన కరువు. ఆరుమాసాల అతి స్వల్ప వ్యవధిలో ఐదేళ్లు చదువుకునే ఎంబిబిఎస్ డాక్టర్ స్థాయి శాస్త్రీయ జ్ఞానాన్ని వీరికి ఎలా కలిగిస్తారనేది జవాబు లేని ప్రశ్న. ఆయుష్ వైద్యులను అలాగే కొనసాగిస్తే ఆయా రంగాలలో ప్రజలకు ఏదో స్థాయిలో ఉపయోగపడే అవకాశం ఉన్నది. వారికి తగిన ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ప్రభుత్వ వైద్యులుగా మార్చి నికరాదాయం కల్పించాలన్న దృష్టితోనే ప్రభుత్వం ఈ దొడ్డిదారిని ఎంచుకున్నదన్న విమర్శను తీసిపారయలేము.

ఇప్పటికే ఎంబిబిఎస్ పట్టభద్రులే తగినంత నైపుణ్యం గలవారు కాదనే అభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో వీరు తాము నేర్చుకున్న శాస్త్రం నుంచి అత్యాధునికమైన ఆల్లోపతి వైద్యులుగా ఎలా మారుతారన్నది ఎవరికి అర్థం కాని విషయం. దీనికి బదులుగా చత్తీస్‌ఘడ్‌లో మాదిరిగా మూడేళ్ల ప్రత్యేక గ్రామీణ వైద్యుల కోర్సును ప్రవేశపెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మూడేళ్లలో సంక్షిప్త ఎంబిబిఎస్ కోర్సు ను ప్రజారోగ్య చికిత్స విధానాన్ని నేర్పించితే ప్రాథమికస్థాయిలో పటిష్ఠమైన, నూతన గ్రామీణ వైద్యతరం రూపొంది పల్లెల్లో డాక్టర్ల కొరతను కొంతైనా తీరుస్తుంది. ప్రస్తుతం మారుమూల గ్రామస్థులు సైతం ఉన్నదీ లేనిదీ తాకట్టు పెట్టి, అమ్ముకొని అయినా నగరాలలోని సూపర్ స్పెషలిస్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఖరారు చేయబోతున్న ఈ అవైద్యులు, అర్ధవైద్యులు ఆదరణ కొరవడి ఈ ప్రయోగం విఫలయత్నంగా చరిత్ర చెత్తబుట్టలో కలిసి పోవ చ్చు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ చట్టానికి సవరణ తెచ్చి ప్రజల విశ్వాసాన్ని చూర గొనే విధంగా గతంలో ఉండిన ఎల్‌ఎంపిల మాదిరి వ్యవస్థనైనా పునరుద్ధరించడం మంచిది.

Doctors, students protest against NMC Bill