Home ఎడిటోరియల్ సంపాదకీయం : ఐఎస్ వెన్ను విరిగింది!

సంపాదకీయం : ఐఎస్ వెన్ను విరిగింది!

Sampadakeeyam-Logo

ప్రపంచ మానవాళికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) వెన్ను విరిగింది. ఇరాక్ భూభాగం లోని వారి రాజధాని మోసుల్ నగరాన్ని ఇరాక్ సైనికులు గురువారం (జూన్ 29) విముక్తి చేశారు. చరిత్రాత్మకమైన అల్‌నూరి మసీదు ఇరాక్ సైన్యం వశం కావటంతో ఇరాక్‌లోని ఇస్లామిక్ స్టేట్ కూలిపోయింది. వారి “కలిత రాజ్యం” కూలిపోయిందని ఇరాక్ సైన్యం అధికార ప్రతినిధి ప్రకటించారు. అయితే నగరం ఉత్తర, దక్షిణ ప్రాంతం ఇంకా విద్రోహుల అధీనంలోనే ఉంది. కాగా సిరియాలోని ఐఎస్ రాజధాని రక్కా అమెరికా తోడ్పాటుతో ముందుకు సాగుతున్న కుర్దిష్, దాని మిత్ర సైనికుల దిగ్బంధంలో ఉంది. జిహాదిస్టులు మూడేళ్ల క్రితం ఇరాక్, సిరియా భూభాగాలను మెరుపుదాడితో స్వాధీనం చేసుకున్న తదుపరి, అబు ఒకర్ అల్-బగ్దాది 2014 జులై 4 న ఈ మోసుల్ మసీదునుంచే తనను తాను “కాలిఫ్‌”(ముస్లింలందరికీ చక్రవర్తి) గా ప్రకటించుకున్నాడు. యావత్ ముస్లిం దేశాలతో “కాలిఫెట్‌” స్థాపన తన లక్షంగా ప్రకటించాడు. తదాదిగా ఐసిస్ పరమ ఛాందస సిద్ధాంత ప్రచారం తో అనేక దేశాలనుంచి ముస్లిం యువతను ఆకర్షించింది. మన దేశంనుంచి కూడా కొద్దిమంది ఇరాక్ చేరుకోవటం గుర్తు చేసుకోదగింది. మోసుల్ మసీదు నుంచి ప్రసంగించిన వీడియో ద్వారానే బగ్దాది ముఖం ప్రపంచానికి తెలిసింది. ఈనాటికీ అదొక్కటే “కాలిఫ్‌” వీడియో రికార్డింగ్. మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవటానికి ఇరాకీ సైన్యం 2016 అక్టోబర్‌లో ప్రయత్నాలు ప్రారంభించింది. ఐసిస్ నాయకులు అబు తుర్క్, ఫలా అల్ రష్దీ వైమానిక దళం బాంబుదాడుల్లో మరణించారు. బగ్దాదీ కూడా డ్రోన్ విమానదాడుల్లో మరణించి ఉండవచ్చన్న వదంతులున్నప్పటికీ అవి ధృవీకరణ కాలేదు.
ఐఎస్‌ఐఎస్ ఎక్కడినుంచో ఆకస్మికంగా ప్రత్యక్షం కాలేదు. ఇరాక్‌పై అమెరికా దండయాత్ర తదుపరి కాలంలో ఆవేశపరులైన యువతనుంచి పుట్టుకొచ్చింది. ఇస్లాం మత ఆధిపత్యాన్ని నెలకొల్పటం లక్షంగా అది వృద్ధి చెందింది. టెర్రరిజాన్ని మార్గంగా ఎంచుకుంది. ఇరాక్, సిరియాల్లోని అస్థిర రాజకీయ పరిస్థితులు దాని పెరుగుదలకు సహాయకారి అయినాయి. తొలుత ఇరాక్‌కే పరిమితమైన ఐఎస్‌ఐ ఆ తదుపరి సిరియాను కూడా చేర్చుకుని ఐఎస్‌ఐఎస్‌గా మారింది.
మోసుల్ ఇరాక్‌లో రెండవ అతిపెద్ద ప్రాచీననగరం. జనాభా సుమారు 9లక్షలు. యుద్ధకాలంలో సగంమంది కాందిశీక శిబిరాలకు, బంధువుల వద్దకు చేరినట్లు అంచనా. ఈనాటి టర్కీ, సిరియా, ఇరాక్ భూభాగాలతో కూడిన ఫ్యూడల్ రాజ్యంనుంచి దాడిచేసిన తొలితరం క్రూసేడర్స్‌తో పోరాడిన నోబుల్ నూరుద్దీన్ అల్-జంకి 1172-73లో మోసుల్ అల్-నూరి మసీదును నిర్మించాడు. తను చనిపోయేముందు అందులో ఇస్లామిక్ స్కూలు ఏర్పాటు చేశాడు. పాతనగరంలోని ఆ మసీదును ఐఎస్ తీవ్రవాదులు తమ కేంద్రంగా చేసుకున్నారు. ఇరాక్ సైన్యాల విమానదాడుల్లో మసీదు అత్యధికభాగం శిథిలమైంది. ఇస్లామిక్ స్టేట్ గతవారం ఆ వీడియో ప్రసారం చేసింది.
ఈ మహానగరాన్ని స్వాధీనం చేసుకోవటానికి సైన్యం ఎంతో కష్టపడింది. జననష్టం సాధ్యమైనంత తక్కువగా ఉండేటట్లు చూడటానికి అది వ్యూహాత్మకంగా అంచెలంచెలుగా – అడుగడుగున ప్రతిఘటనను తిప్పికొడుతూ-ముందుకు సాగింది. పాతబస్తీలోని ఇరుకు రహదారుల గుండా ముందుకెళ్లిన ఇరాక్ సైన్యానికి అమెరికా నాయకత్వంలోని ఇంటర్నేషనల్ కొయిలేషన్ గగన, భూమార్గాల గుండా తోడ్పాటిచ్చింది . సైన్యం, పోలీసు ఇతర దిక్కులనుంచి మసీదు వైపు వస్తున్నందున తీవ్రవాదులను తుడిచిపెట్టటానికి ఇంకెంతోకాలం పట్టదు. ఇప్పుడిక సిరియాలోని రక్కాను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఆ పని పూర్తి అయితే ఐఎస్‌ఐఎస్ ‘కాలిఫెట్’ను తుడిచిపెట్టినట్లే. అయితే ఇస్లామిక్ తీవ్రవాదం అంతటితోనే సమసిపోదు. అందుకు అనుకూలించిన భౌతిక పరిస్థితులను మార్చగలగాలి.