Home Default లక్ష్మిఅంటే డబ్బు ఒక్కటేనా..?

లక్ష్మిఅంటే డబ్బు ఒక్కటేనా..?

Varalakshmi-Vratham

లక్ష్మి అంటే లక్ష్మింపబడేది అని అర్థం. జనం ఎవరినైతే బాగా పట్టిపట్టి పరకాయించి చూస్తారో ఆమే లక్ష్మి. ఆమె సంపదకు రారాణి అంటోంది పురాణం. కనుక లోకమంతా సహజంగా ఆమె వైపే చూస్తోంది. డబ్బుకున్న ఆకర్షణే అది కదా! లక్ష్మిఅంటే డబ్బు. డబ్బు అంటే లక్ష్మి అన్నట్టుగా చూస్తుంటారు మనవాళ్ళు.
లక్ష్మి అంటే డబ్బేనా? డబ్బే సర్వసమా?..కాదు..! ధన, కనక, వస్తు, వాహన, పుత్ర, పౌత్రాభివృద్ధి లక్ష్మీ కటాక్షం వల్ల అమరుతాయని చెబుతుంటారు. కనుక చేతిలో ఆడే డబ్బొక్కటేకాదు ఒంటి మీద మెరిసే బంగారం కూడా లక్ష్మి స్వరూపమే! దేనికీ తడుముకోనక్కర్లేకుండా అవసరానికి, అందానికి, సదుపాయానికి, సౌలభ్యానికి ఉపయోగపడే వస్తువులు కూడా లక్ష్మీ స్వరూపమే! ఇలా పరిపూర్ణంగా ఉంటే అది భాగ్యవంతమైన జీవితంగా కదా పరిగణిస్తారు. ఇవికాక విలాసవంతమైన వస్తువులు సమకూరితే అది భోగవంతమైన జీవితం అంటారు. భోగాన్ని అనుభవించే యోగ్యత ఉంటే దాన్ని భాగ్యం అంటారు. అందుకే భోగభాగ్యాలు కవలపిల్లల్లా కనబడతాయి. సాధారణంగా భోగం ఉన్న వాడికి భాగ్యం ఉండదు. భాగ్యం ఉన్న వాడికి భోగం ఉండదు. ఈరెండూ ఉన్న వారికి వారసత్వం ఉండదు. ఇవన్నీ అమరిన వారికి అదృష్టానికేకొదవా ఉండదు. డబ్బు ఒక్కటే కాదు లోకంలో అనేక రకాల సంపదలున్నాయి. అవన్నీ సమకూరితేనే బతుకు పరిపూర్ణమవుతుంది. అందుకే మనకు పురాణాలలో రకరకాల లక్ష్ములు కనబడతారు. అందులో సుప్రసిద్ధమైన వారు అష్టలక్ష్ములు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి.
వీరి కన్నా పురాతనంగా ఆరాధనలో ఉన్న వారు సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి. -వీళ్ళంతా విడివిడి దేవతలు కారు. అంతా కలిపి ఒకే లక్ష్మి. ఆమెనే మహాలక్ష్మి అన్నారు. ఇటు అష్టలక్ష్ములలోకాని, అంతకు ముందు నుంచి పూజలందుకుంటున్న వారినిగానీ చూసినపుడు మొట్టమొదటి స్థానంగా ధనం కనిపించదు.
అష్టలక్ష్ములు-సామాజిక కోణం :
అష్టలక్ష్ములలో మొదట కనిపించేది ఆదిలక్ష్మి. అంటే వస్తుతః మనలో ఉండే జీవకళ. ఈ కళను పెంచిపోషించేది పౌష్టికాహారం. అందుకే ధాన్యలక్ష్మి రెండోస్థానంలో నిలిచింది. తిండి ఉండేవాడికెటూ కండ ఉంటుంది. తిండి కలిగితె కండగలదోయ్ కండగలవాడేను మనిషోయ్ అన్నారుగా పెద్దలు. కండా గుండె ఉండేవాడికి ధైర్యం చాలా సహజంగానే అలవడుతుంది. అలాంటి వాడే మనిషి కనుక ధైర్యలక్ష్మిమూడోవరసలో నిలబెట్టారు. ధైర్య స్థైర్యాలతో ముందుకు దూసుకుపోయే డైనమిక్ యంగ్ మాన్‌కు సకల సంపదలు ఎలాగూ వశమవుతాయి. కనుక నాలుగో స్థానంలో గజలక్ష్మి నిలిచింది. అణిమాది అష్టసిద్ధులకు, అష్టైశ్వర్యాలకు గజలక్ష్మి సంకేతం. సంపద ఎంత ఉన్న సంతానం లేకపోతే ఆ లోటు ఏం చేసినా తీరేదికాదు. కనుక సంతానం కూడా ఉండాలని అయిదో స్థానంలో సంతాన లక్ష్మిని నిలిపారు. చక్కని సంపద, సత్సంతానం ఉన్న వాడిదే విజయవంతమైన జీవితమంటే! అందుకే ఆరవ స్థానంలో విజయలక్ష్మిని నిలబెట్టారు. ఇక్కడితో సామాన్యుడి జీవితం కావడానికి కావాల్సిన సకల సంబరాలు పూర్తవుతాయి. ఇక ముందు చెప్పబోయేవి టాపప్స్ మాత్రమే! అందులో మొదటిది చదువు. చదువుకుంటే, చదువు బాగా అబ్బితే సంతోషమేకాని అది లేకపోతే జీవితమేలేదనికాదు. చదువులో బాగా రాణిస్తే సంతోషం. అలాకాకపోయినంత మాత్రాన డిప్రెస్ అయిపోయి నిద్రమాత్రలు తినేసి, ఉరితాడికి వేలాడబడి, బిల్డింగ్ మీది నుంచి దూకేసి ప్రాణాలు తీసుకోనకర్లేదు. చివరాఖరుగా కనిపించే 8వ లక్ష్మి ధనలక్ష్మి. అదీ డబ్బుకున్న విలువ. డబ్బు ఉంటే సంతోషమే కానీ అది ఎక్కితొక్కి లేనందుకు బాధపడక్కర్లేదు. డబ్బుతో చేయలేని అనేక పనులున్నాయి. అవి చేసుకుని కూడా జీవితాన్ని చరితార్ధం చేసుకోవచ్చు.
ఇతర లక్ష్ములు-ఇంగిత జ్ఞానం :
పురాతన కాలం నుంచి కనిపించే లక్ష్ములు సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి. వీరిలో మొట్టమొదటిది సిద్ధలక్ష్మి. ఏ పనైనా ఎప్పుడు సిద్ధిస్తుంది? పనిచేసినపుడు. అసలు పనిచేయకపోతే సిద్ధి ఉండదు కదా! కనుక చేతులెత్తేసి ఊరికనే కూచోకుండా చాతనైన పని ఏదో ఒకటి చేస్తూ ఫలితాన్ని సిద్ధింపజేసుకొమ్మని చెప్పడానికే సిద్ధలక్ష్మికి పెద్దవాళ్ళు అగ్రతాంబూలమిచ్చారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట కూడా ఇదే! ఆ తర్వాతది మోక్షలక్ష్మి. మోక్షం అంటే ఒక్కరిగా ఉండడం. ఇప్పటి భాషలో చెప్పాలంటే నెంబర్ వన్‌గా మిగలడం. పనిచేయడం అంటూ మొదలుపెడితే ఏదో ఒకనాటికి నెంబర్ వన్ పొజిషన్‌కు వస్తాడు కదా అదే మోక్షలక్ష్మి స్థానం. దీన్ని సుస్థిరం చేసుకుని ముందుకు దూసుకుపోయేవాడే ఎదురులేని విజయుడిగా గుర్తింపు పొందుతాడు. ఈ స్థితినే విజయలక్ష్మిస్థానం అన్నారు.ఇలా ఉన్నత స్థానానికి వెళ్లడానికి చదువుతో సంబంధం లేదు. కృషి ఒక్కటి చాలు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరిన వారంతా పెద్దపెద్ద చదువులు చదువుకున్న వారేంకారు. చదువు ఉంటే పువ్వుకు తావి అబ్బినట్టుంటుంది. అందుకే చదువు, సంస్కారం, సంపద తోడైతే వచ్చే స్థితిని సరస్వతి అంటారు. చదువు, సంపదలు గలిగి ముందుకుపోయేవాడే సంపదను నిలబెట్టుకోగలుగుతాడు. దాన్ని సద్వినియోగం చేయగలుగుతాడు. తద్వారా సామాజిక గుర్తింపు కలిగి గౌరవం పెరుగుతుంది.
డబ్బున్న ప్రతీ ఒక్కడికీ పేరు రాదు. ఆ సంపద మానవ సేవకు ఉపయోగపడేలా చేస్తేనే గౌరవస్థానం ఏర్పడుతుంది. ఈ స్థితే శ్రీలక్ష్మి స్థానం. ఇలాంటివాణ్ణే శ్రీమంతుడు, స్థితిపరుడు అంటారు. ఇలాంటి వాణ్ణే వరప్రసాది అంటారు. అలాంటి స్థితినే వరలక్ష్మిస్థానం అంటారు. జీవితంలో ఎవరైనా ఇలాంటి స్థితిని చేరుకోడానికి, సర్వదా కొనసాగించడానికి లక్ష్మిని ఆశ్రయించాలి. ఈ సందేశాన్నే వరలక్ష్మి వ్రతం మనకు అందిస్తోంది.

వాయనాలలో పోషక విలువలు : 

వాయనం మాటకు మూల పదం ఉపాయనం. అంటే కానుక. కానుక తీసుకున్నవారు మనకు దగ్గరవుతారనే భావం. ఉపాయనం అనేది సౌహార్థాన్ని పెంచుతుంది. ఎవరు వ్రతం చేయించారో ఆ బ్రాహ్మణులకు, పెద్దలకు కానుకలు ఇవ్వడం సంప్రదాయం. దాని తర్వాత ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వాలి. ఆ తరువాత వచ్చిన బంధువులకు, మిత్రులకు ఇవ్వాలి. అందరికీ శక్తి ఉంటే భోజనం పెట్టాలి. లేకుంటే కొందరికైనా పెట్టాలి. భోజనం, తాంబూలం, వస్త్రములు, కానుకలు, వాయనములు ఇవన్నీ మన హృదయాన్ని చెబుతాయి. ఇవన్నీ శక్తిని బట్టి చేసుకోవాలి. అమ్మవారు భక్తికి సంతోషిస్తుంది కానీ ఆడంబరాలకు కాదనేది గుర్తుపెట్టుకోవాలి. గృహిణి అనగానే ఇంట్లో ఆమె పిల్లలు ఉంటారు కనుక వారి కోసం అరటిపండు. ఆవిడ నిత్యం సుఖంగా ఉండాలని కుంకుమ. దీంతోపాటు పువ్వులు. ఈ ద్రవ్యాలను ముత్తైయిదువుకు వాయనంగా ఇవ్వడం సరైన విధానం.
నానబెట్టిన శనగలు: వందగ్రాముల శనగల్లో 115 క్యాలరీల శక్తి, 7.2 గ్రాముల ప్రొటీన్లు, 16.1 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 2.9 గ్రా. కొవ్వు పదార్థాలు, ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ వల్ల రక్తంలో హానికరమైన కొవ్వు తగ్గుతుంది. అధిక మోతాదులో ప్రొటీన్లు లభిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. రక్తప్రసరణకు తోడ్పడుతాయి. వీటిలోని ప్రత్యేక పదార్థాలు నిద్ర రావడానికి తోడ్పడతాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి రోజూ మొలకెత్తిన శనగలు తీసుకోవాలి.
తాంబూలం :
ఆకు వక్క సున్నం కలిపితే తాంబూలం.. ఇవి దేనికదే విడివిడిగా తింటే అనార్యోగం. మూడూ కలిపి వేసుకుంటే జీర్ణశక్తి సక్రమంగా ఉంటుంది. నాలుకకు సంబంధించి వ్యాధులను రాకుండా చేసేది తాంబూలం. ఆకు వక్క సున్నం మూడు కలిపి వేసుకుంటే నాలుకకు సంబంధించిన వ్యాధులను దూరం చేసినట్లే. నాలుకకు ఉండే వ్యాధిని తొలగించే శక్తి తాంబూలానికి ఉంది. స్త్రీ ఆరోగ్యం మీద కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఆవిడ ఆరోగ్యం కోసం తాంబూలం.
అరటిపండు : జీర్ణసంబంధమైన వ్యాధులకు అరటిపండు దివౌషధం. జబ్బు పడిన వాళ్లు ఈ పండు తింటే త్వరగా కోలుకుంటారు. దీంట్లో అధ్యధికంగా ఉండే పొటాషియం రక్తపోటును, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలో విషపదార్థాలను తొలగిస్తుంది. చిన్నపాటి కాలిన గాయాలను తగ్గించే గుణం ఈ పండుకు ఉంది. తాహతును బట్టి యాపిల్, బత్తాయిలాంటివి కూడా వాయనంగా ఇస్తుంటారు. పండ్లు తినడం అనేది ఏ కాలంలోనైనా మంచిది. అందుకే పండు ఇవ్వడం ఆనవాయితి.
పసుపు:
వర్షాకాలంలో జలుబు, దగ్గులాంటి రోగాలు తొందరగా వస్తుంటాయి. అందుకనే కాళ్లకు పసుపు రాసుకుంటారు. పసుపు యాంటిబయాటిక్. సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. చాలా రోగాలను పసుపు అడ్డుకుంటుంది. వర్షాకాలంలో కాళ్లపగుళ్లు వస్తుంటాయి. వీటిని పోగొడుతుంది పసుపు.