Tuesday, January 31, 2023

తప్పు డాక్టర్‌దేనా!

ఒకప్పుడు అరుదుగా జరిగిన సిజేరియన్(శస్త్ర చికిత్స ద్వారా పురుళ్లు పోయడం)లు ఇప్పుడు సర్వ సాధారణం అయ్యాయి. సమాజం ఒకరకంగా వాటికి అలవాటు పడిపోయింది. ఇందుకు కారణం ఏమిటి? బాధ్యులు ఎవరు అన్న ప్రశ్నలకు డా.కామేశ్వరి ఇలా చెప్తున్నారు.

గత 21 సంవత్సరాల నుంచి సిజేరియన్ల పరిస్థితి ఈవిధంగా ఉందని 2014 జాతీయ ఆరోగ్య గణాంకాలు తెలుపుతున్నాయి. 20 శాతం మంది ధనికుల్లో సిజేరియన్‌ల శాతం 10 నుంచి 30 కి పెరిగింది. అదే సమయంలో దేశంలో సరాసరిన సిజేరియన్ల శాతం 5 నుంచి 18కి పెరిగింది. అయితే పేదల్లో మాత్రం ఆశాతం 5 దగ్గరే ఆగిపోయింది. ఈ విషయాన్ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన హ్యూమన్ రైట్స్ ఇన్ చైల్డ్ బర్త్ ఇండియా కాన్ఫరెన్స్‌లో అంతర్జాతీయ పరిశోధకులు తెలిపారు.

- Advertisement -

Mother-Child

సాధారణ ప్రసవాలు ఎందుకు తగ్గిపోయాయి?
అప్పట్లో గర్భాన్ని కూడా ఒక సహజ ప్రక్రియలాగా చూసేవాళ్లు. గర్భిణిగా పూర్తి విశ్రాంతిలో ఉండాలని వాళ్లకి వాళ్లు అనుకుం టున్నారు. అందుకే గర్భందాల్చినప్పటి నుంచి విశ్రాంతి, విపరీతమైన తిండి అలవాటయ్యాయి. ఎప్పుడూ మనం చేసే కష్టానికి తిండికి సరిపోవాలి. ఇప్పుడు కూర్చుని చేసే పనులు ఎక్కువయ్యాయి. విపరీతంగా తియ్యటి పండ్లు, కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీములు,తెల్లన్నం తినడం వలన అబార్షన్ రిస్క్ పెరిగింది. పంటల్లో కిమిసంహారకాల వాడకం కూడా ఒక కారణమే. తొమ్మిదో నెల వచ్చిన మూడు వారాలకి తల కిందకి దిగాలి. థర్టీ సెవన్ బీట్స్ అంటాం. రెండు వారాల నుంచి మూడు వారాల మధ్యలో తల దిగుతుంది. దాన్ని ఎంగేజ్‌మెంట్ అంటాం. తల యోని నుంచి వస్తుంది. అలా కాకుండా ఒంగి పనిచేయకుండా, కష్టం చేయకుండా ఉన్నప్పుడు కూడా తల దిగదు.
ఫోర్‌సెప్స్‌తో తీయడాన్ని సాధారణ ప్రసవం అంటారా?
ప్రసవ వేదన అన్నది సహజ ప్రక్రియ. అయితే ప్రసవ వేదన తెలియకుండా ఉండటానికి మత్తు ఇస్తున్నారు. మామూలుగా అయితే ప్రసవ నొప్పిని వదల్చుకోడానికి ముక్కాలి. కాని నొప్పులు తెలియకుండా ఇంజెక్షన్ ఇస్తే గర్భిణికి నొప్పులు తెలియవు. బిడ్డ తల కిందకి వచ్చినప్పుడు ముక్కట్లేదు. అప్పుడు బిడ్డను కిందికి తొయ్యలేకపోవడం వలన అలాటి ప్రసవాలలో ఫోర్‌సెప్స్ వేయడం, కింద బాగా కట్ చేయడం చేస్తారు. అది సాధారణ ప్రసవం అని పేరు కాని అది కూడా కృతిమ ప్రసవమే. సాధారణ ప్రసవానికి 24 గంటలు సమయం పడుతుంది అని వేచి ఉండాలి. రెడీమేడ్ యుగంలో ఉన్నాం. ఆరోగ్యాన్ని కూడా అలా అనుకుంటున్నాం. డాక్టర్ కూడా తాను ఎవరికి చికిత్స చేస్తున్నారు, ఆమె మానసిక స్థితి ఏంటి? ఆమె నిజంగా సాధారణ ప్రసవానికి తయారుగా ఉందా అని డాక్టర్ చూడాలి.
గర్భిణులకు ఎదురయ్యే ప్రమాదాలకు డాక్టర్ ఎంతవరకు బాధ్యులు?
ఏ ప్రసవం అయినా 85 శాతం సాధారణంగానే జరగాలి. కేవలం 15 శాతం అసాధారణ ప్రసవాలు అవాలి వాస్తవానికి. అయితే అలా జరగడంలో డాక్టర్ పాత్ర 33 శాతం ఉంటుంది. కాని ఏదన్నా జరిగితే డాక్టర్‌దే తప్పని వాళ్లని కొడతారు. పాప కడుపులో చనిపోయి ఆలస్యంగా వస్తే డాక్టర్ చేతిలో కూడా ఉండదు. ఎందుకు, ఎక్కడ కాన్పు చేసుకోవాలో ప్రసవానికి ముందే ప్రణాళిక ఎందుకు వేసుకోలేదు? అప్పటికప్పుడు ఈ హాస్పటల్ ఆ హాస్పటల్ తిరుగుతామంటే అది ఎంత ప్రమాదం? చాలాసార్లు తల్లిప్రాణం, బిడ్డ ప్రాణం పోవడానికి రవాణాలో ఉన్న సమస్య. ఏది అసాధారణ ప్రసవం? ఏది సంక్లిష్టమైన కేసు? దానికి ఎంత రక్షణ వ్యవస్థ అవసరం? అన్నది గర్భ సంరక్షణ వ్యవస్థ మొత్తం బాధ్యత వహించాలి. ఆవిధంగా నాణ్యమైన వైద్య సేవ ల్లేవు. అంత నాణ్యత ఉన్న దగ్గర ఖర్చు కూడా పెరిగి పోతుంది. కొన్ని ఆరోగ్య కేంద్రాలు సాధారణ ప్రసవానికి, సిజేరియన్ కన్నా ఎక్కువ డబ్బు తీసుకుంటున్నారు. ఎందుకంటే సాధారణ ప్రసవంలో డాక్టర్‌కి పనెక్కువ. ప్రతి గంట పెషెంట్‌ని చూసుకోవాలి. సిజేరియన్‌కి డాక్టర్‌కి పని తక్కువ. వెంటనే చేసి వెళ్లిపోవచ్చు. చాలావరకు ఖరీదైన ఆరోగ్య కేంద్రాలు అన్నీ కూడా సాధారణ ప్రసవానికి, సిజేరియన్ దాదాపు ఒకే ఫీజు తీసుకుంటున్నారు. రెండు లక్షల దాకా డెలివరీ ఛార్జీలు తీసుకునే ఆసుపత్రులున్నాయి.
పురుడు పోయడానికి డాక్టర్ ఒక పేషెంటుకి ఎంత సమయం ఇవ్వాలి?
డాక్టర్ ఆర్థిక లావాదేవీలేమీ లేకుండా ఇతర విషయాలకు అతీతంగా వైద్యం చేయాలి. కాని డబ్బు ఉన్నా లేకపోయినా సమానంగా సేవ చేయగలిగేంతగా మన సమాజంలో డాక్టర్‌కి అంత అవకాశం ఉందా అన్నది పశ్న. వ్యాపార ధోరణి అనే అంశాన్ని పక్కన పెడితే అంత సమయం డాక్టర్ పేషెంట్‌కిస్తున్నారా అంటే లేదు. మొదటి కాన్పులో సాధారణ ప్రసవానికి, అయితే మాత్రం 24 గంటల పైన పడుతుంది. అదే సిజేరియన్ అయితే గంటలో అయిపోతుంది. సాధారణ ప్రసవం అన్నది సులువుగా అలా అంటే అయిపోయేది కాదు. దానికి చాలా పని ఉంది. దాన్ని స్వీకరించి గౌరవించి అందరూ ఒక నిబద్ధతతో చేసే సృష్టి.
డాక్టర్లు డబ్బు కోసమే సిజేరియన్ చేస్తారన్నది నిజమేనా?
కొన్ని ఎలక్టివ్ సి సెక్షన్‌లుంటాయి. పొత్తి కడుపు కింది భాగం చాలా చిన్నగా ఉండటం, తల దిగకపోవడం, పోలియో ఎఫెక్టెడ్ లింబ్స్ ఉండటం అలా ఏదన్నా ఉంటే ముందే సిజేరియన్ చేసేస్తాం. ఉమ్మనీరు బాగా తగ్గిపోయినా, మాయలో బ్లడ్ క్లాట్స్ పెరిగి బేబీ పెరుగుదల సరిగా లేకపోయినా సిజేరియన్ చెయ్యాలి. తల్లికి బిపి ఉండి ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటే సిజేరియన్ చేస్తాం. ఒక్కోసారి కాన్పు సమయంలో తేడాలు వస్తాయి. అప్పుడు మనకి తెలీదుగా. సాధారణ ప్రసవం అవుతుందనుకున్నాను. ఇంతసేపు నొప్పులు తీశాను. సిజేరియన్ ఎందుకయింది అంటే అది ఎవరు చెప్తారు? పరిస్థితి మారిపోవచ్చు. ఆక్స్‌పిటో పోస్టీరర్ అంటాం. మామూలుగా తల ముందుకు ఉంటుంది. అది వెనక ఉంటే ఒక్కొక్కసారి అంచనా తెలీదు. తల పైకున్నప్పుడు తెలీదు. వేళ్లు అందవు. అప్పుడు ఎలా తెలుస్తుంది. ఒకరకంగా డాక్టర్‌ని నిందించడం కాని వ్యవస్థను నిందించడం కాని తేలిక. ఎంతమంది భార్యకి పోషకాహారం ఇస్తున్నారు? బాగా రక్తహీనత ఉంటుంది. ఆ టైమ్‌లో రక్త ప్రసారంలో తేడా వచ్చినా. కొంచెం బ్లీడింగ్ అయినా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ చాలా ఉంటాయి. సామాజిక, సాంస్కృతిక కారణాలుంటాయి. మారుతున్న భావాలుంటాయి. ఎక్కువ డబ్బుండటం, దాని వలన పరిణామాలుంటాయి. జాతకాల మీద నమ్మకం. మంచి సమయంలో ప్రసవం అనే మూఢనమ్మకాలు. కొన్ని నొప్పులు తియ్యలేక. కొన్ని డాక్టర్‌కి అవగాహన లేక, కొన్ని ఆరోగ్య సంస్థల వ్యాపార ధోరణి, ఇలా వివిధ కారణాలున్నాయి. . తర్వాత పాత్ర డాక్టర్‌ది. అయితే డాక్టర్ కేస్‌ని వైద్య విలువల ప్రకారం చూస్తున్నారా లేదా అన్నది ముఖ్యం. క్లినికల్ గైడ్‌లైన్స్ ఉంటాయి మాకు. అవి అనుసరించాలి.
ప్రభుత్వ ఆసుపత్రుల కన్నా ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్‌లు ఎందుకు ఎక్కువ?
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏ డాక్టర్ వాళ్లకి పురుడు పోస్తారో తెలీదు. కాని ప్రభుత్వాసుపత్రుల్లో అలా కాదు.పేషెంట్‌తో డాక్టర్‌కి ఉండే నిబద్ధత వేరుగా ఉంటుంది. డాక్టర్‌కి, పేషెంట్‌కి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ప్రభుత్వాసుపత్రుల్లో తగినంత సిబ్బంది ఉంటారు. పీజీలు 24 గంటలూ పనిచేస్తారు. ప్రైవేట్‌లో అంత అవకాశం ఉండదు. కొన్ని ఆరోగ్య కేంద్రాలు ఆవిధంగా చేస్తున్నాయి. కాని చాలా ఖరీదు. 24 గంటలు గైనకాలజిస్టుని ఆందుబాటులో పెట్టుకోవాలంటే చాలా ఖరీదైన వ్యవహారం.
ఒకసారి సిజేరియన్ అయితే రెండో కాన్పులో కూడా సిజేరియన్ ఎందుకు అవుతుంది?
మొదటి కాన్పులో సిజేరియన్ అయితే రెండోది సాధారణ ప్రసవం చెయ్యడానికి ఎక్కువ మౌలిక సదుపాయాలు కావాలి. కార్పొరేట్ పక్కన పెడితే మధ్యస్థ, ఇంకా తక్కువ స్థాయి నర్సింగ్‌హోమ్‌లలో మౌలిక సదుపాయాలుండవు. కాబట్టి ఒకసారి సిసెక్షన్ చేసిన తర్వాత సాధారణ ప్రసవానికి ప్రయత్నించడం అనేది కొంచెం ఇబ్బందికరమైనదే. లోపల నుంచి కుట్టు తెగిపోవచ్చు. పరికరాలు సరైనవి ఉండి, ప్రోత్సాహం అందించే డాక్టర్ ఉండి, పేషెంట్ అనువుగా ఉంటే రెండవసారి డెలివరీ కూడా చక్కగా చేసుకోవచ్చు. ప్రసవ నొప్పులు తట్టుకోగలిగితే సాధారణ ప్రసవంతోనే తల్లి మరింత చురుగ్గా ఉండగలుగుతుంది. పొట్టంతా కోస్తే చర్మం, కొవ్వు, పేషియా వేరుచేసి కండ కోసి పెరిటోనిన్ కట్ చేయాలి. అంటే అంత పొరలు కోసుకుంటూ రావాలి. అది తప్పకుండా బాధాకరమైనదే. తల్లి, బిడ్డ ప్రాణాన్ని కాపాడటానికి సిజేరియన్ వద్దనట్లేదు కాని సిజేరియన్ పెరగడానికి పేషెంట్ ప్రవర్తనే కారణం. డాక్టర్, పేషెంట్ల మధ్య నమ్మకం లేదు. సాధారణంగా జరగాల్సిన ప్రసవ ప్రక్రియ ఎందుకు క్లిష్టతరం అయింది అనేది అందరూ ఆలోచించాలి.
సిజేరియన్లు తగ్గాలంటే?
ముందుగా అమ్మాయి మారాలి. వైద్యానికి విపరీతంగా భయపడటం మానాలి. ఓర్పు, నిదానం అవసరం. ఆరోగ్యకరమైన కాన్పు కావాలి అంటే గర్భం దాల్చడానికి ఆరు నెలల ముందు నుంచీ ఆహారంతో సహా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఆడవాళ్లు పొగ తాగడం, మద్యం సేవించడం లాటి సంస్కృతులన్నీ పెరిగాయి. అవి ఉండకూడదు. నేచురోపతిలో సులువుగా ప్రసవం అవడానికి చిట్కాలుంటాయి. గర్భిణి చిటికెన వేలు నొక్కితే ప్రసవ నొప్పులు కొంత వరకు ఉపశమనం ఉంటుంది. శ్వాస బాగా తీసుకోవడం లాటివి చేసుకుని గర్భిణినే తయారుగా ఉండాలి. నీటి లోపల ప్రసవాలు వచ్చాయి. సాంకేతికత ఆధారితమైన సహజ పద్ధతులు కొన్ని ఉన్నాయి. అవన్నీ మనం చెయ్యగలగాలి.
సాధారణ ప్రసవాలు పెరగాలంటే మధ్యంతర మార్గం ఏంటి?
గైనకాలజిస్టులు శాంతంగా వేచిఉండకపోవడం వలన సి సెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. మంత్రసాని వ్యవస్థ రావాలి. ప్రత్యేక శిక్షణ పొందిన మంత్రసానులు పేషెంట్‌కి, డాక్టర్‌కి మధ్య పాత్రను పోషిస్తే డాక్టర్, పేషెంట్‌కి అంత సమయం కేటాయించక్కరలేదు. యుకె అంతా మంత్రసానుల క్లినిక్‌లున్నాయి. మనదేశంలో ఇంకా అంతగా ప్రాచుర్యంలోకి కాలేదు. పైగా మంత్రసాని పురుడు పోస్తే ఖర్చు కూడా తగ్గుతుంది. మనకి ‘కమ్యూనిటీ బర్త్ అటెండెంట్ శిక్షణ’ ఉంది. ఆసుపత్రిలోనే మంత్రసానులు కూడా ఉంటారు. వీలయినంత వరకు సాధారణ ప్రసవాలు చేస్తారు. కాన్పు క్లిష్టం అయితే డాక్టర్ సిజేరియన్ చేస్తారు. మన ప్రభుత్వ ఆసుపత్రులను కూడా బలోపేతం చెయ్యాల్సిన అవసరం ఉంది. అప్పుడు చాలావరకు ప్రసవాలపై వ్యాపార ధోరణి తగ్గుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles