Home ఎడిటోరియల్ చైనాతో యుద్ధం వస్తుందా?

చైనాతో యుద్ధం వస్తుందా?

China-vs-India

భారతదేశాన్ని రెచ్చగొట్టే అవసరం ఇప్పుడు చైనాకు ఏముంది? చైనా తన ఆర్ధికవ్యవస్థ చక్కబెట్టుకునే పని లో ఉంది. పారిశ్రామిక రంగానికి ఊపిరూదే పనిలో ఉంది. ప్రపంచ ఉత్పత్తి కర్మాగారంగా మారిన చైనాలో పరిశ్రమలకు ఇప్పుడు ఆర్డర్లు కరువయ్యాయి. మరోవైపు చైనా మిలిటరీ వద్ద ఖర్చుపెట్టడానికి అవసరమైన నిధులు ఉన్నాయి. దేశంలోని పారిశ్రామిక రంగానికి ఆక్సిజన్‌గా మిలిటరీ నిధులు ఉపయోగించాలని చైనా ఆలోచించి ఉండవచ్చు. చైనాలో పలుకుబడి ఉన్న ఒక అతిపెద్ద నిర్మాణ సంస్థ మిలిటరీ కమాండ్‌కు ఈ రోడ్డు ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది.
ఈ రోడ్డు మిలిటరీ ప్రయోజనాల కోసం కాకపోవచ్చు. స్ట్రాటజిక్ ఎఫయిర్స్ (వ్యూహాత్మక వ్యవహారం) నిపుణుడు, భారతీయ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజరీ బోర్డు మాజీ సభ్యుడు డా. మనోజ్ జోషి ఈ విషయమై చెప్పిన మాటలు గమనార్హమైనవి. డోక్లామ్ పీఠభూమి భారతదేశానికి కీలక మైన సిలిగురి కారిడార్‌కు దగ్గరగా ఉంది కాబట్టి మనకు సైనికంగా ప్రమాదకరమని చాలామంది భావిస్తున్నారు. కాని సిక్కింలో భారతసైనిక బలగాలు చాలా బలంగా ఉన్నాయని ఆయన అన్నారు. సిలిగురి కారిడార్‌లోనూ మన రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉందన్నారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల మహా అయితే 15 నుంచి 20 కిలోమీటర్ల తేడా వస్తుందని అది పెద్ద విషయం కానే కాదని, అంతేకాదు, సిలిగురి కారిడార్‌కు ప్రమాదమని మనం భావిస్తే, చైనా కూడా తమ చుంబీ లోయకు ప్రమాదమని భావించే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే చుంబీ లోయకు ఒకవైపు భారత సైన్యం చాలా బలంగా ఉంది. కాబట్టి చైనా రోడ్డు నిర్మాణం మిలిటరీ ప్రయోజనాల కోసమని భయపడే పరిస్థితి లేదు. నాథులా పాస్ ద్వారా మనం కూడా చైనాతో వ్యాపారం చేస్తున్నాం. చైనా తీసుకునే చాలా నిర్ణయాల్లో మిలిటరీ ప్రమేయం కన్నా ప్రస్తుతం అక్కడి పారిశ్రామిక వర్గాల ప్రయో జనాలు ముఖ్యంగా ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. చైనా మాజీ ప్రధాని కుటుంబానికి చెందిన ఒక కంపెనీ కోసం త్రీ గార్జెస్ ప్రాజెక్టు చేపట్టారు. బ్రహ్మపుత్రపై 40వేల మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు కూడా ఈ కంపెనీదే.
కాబట్టి ఈ రోడ్డు నిర్మాణానికి కారణాలేమిటో ముందు గా తెలుసుకోవలసివుంది. ఈ రోడ్డు ద్వారా చైనా ఏం చేయా లను కుంటుందో కూడా తెలుసుకోవలసింది. నాథులా పాస్ నుంచి వ్యాపారాన్ని పక్కన పెట్టండి. ఈ హిమాలయ ప్రాంతంలో రోడ్డు ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఒక బ్రిడ్జి క్రింద భారత బలగాలు బాంబు పేల్చినా చాలు సంవత్స రం పాటు రోడ్డు మూతపడుతుంది. హిమాలయాల్లో రోడ్లను మూయించడం భారతసైన్యానికి అంతకష్టమా? ఈ వాస్తవాలు చైనాకు తెలియనివి కావు. కాబట్టి చైనా మిలిటరీ ప్రయోజనాల కోసం రోడ్డు వేస్తున్నదని కంగారు పడిపోయే పరిస్థితేం లేదు. చైనా అక్కడికి ట్యాంకులను రవాణా చేయ డానికే ఈ రోడ్డు వేస్తుందని భయపడే పరిస్థితి కూడా లేదు. పైగా చైనా ఇప్పట్లో ఏ యుద్ధాన్నీ కోరుకోదు. మందగిస్తున్న ఆర్ధికవ్యవస్థను నిలబెట్టే ప్రయత్నంలో ఉంది. నిజానికి మనం కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నాం.
గత మూడేళ్ళుగా భారత ప్రభుత్వ విధానాల వల్ల చైనా భారత సంబంధాలు దిగజారాయి కాబట్టి, ఈ రోడ్డు నిర్మాణం వెనుక మిలిటరీ ప్రయోజనాలు కూడా ఉండి ఉండవచ్చని భావించినా, చైనా ఈ రోడ్డు వల్ల మహా అయితే భారతదేశాన్ని రెచ్చగొట్టి, భారత ప్రభుత్వం తప్పటడుగు వేసేలా చేయాలని కూడా భావించి ఉండవచ్చు. కాని ఆ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత. మన తప్పటడుగు వల్ల భారతదేశంతో భూటాన్‌కు ఉన్న సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. భారత విధానాన్ని సమర్ధిస్తూ ఇప్పటి వరకు భూటాన్ స్పష్టంగా ప్రకటన చేయలేదన్నది గమనార్హం.
కాని, దురదృష్టవశాత్తు డిమానిటైజేషన్(పెద్ద నోట్ల రద్దు) విషయంలో ఎలాంటి తొందరపాటు ప్రదర్శించారో అలాంటి తొందరపాటే ఇప్పుడు మోడీగారిలో కనిపిస్తున్నది. భూటాన్ ఒక సార్వభౌమాధికార దేశం. సైనిక సహాయం కావాలని ఆ దేశం స్పష్టంగా కోరకపోతే ఆ దేశ సరిహద్దుల్లోకి మన సైన్యం ప్రవేశించడం అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠను దిగజారుస్తుంది. భారతదేశంతో ఎంత సన్నిహితమైన సంబంధాలున్నప్పటికీ, భూటాన్, ఇండియాల మధ్య సైనిక ఒప్పందాలున్నప్పటికీ, డోక్లామ్ ప్రాంతంలో చైనాను వెనక్కి నెట్టడానికి సహాయం చేయమని భూటాన్ కోరకుండా ఈ ఊబిలో అడుగుపెట్టడం సరయిన నిర్ణయం కాదు. ఆ విధంగా భూటాన్ ప్రభుత్వం భారతదేశాన్ని అభ్యర్థించినట్లు ఇంతవరకు తెలియరాలేదు. భూటాన్ కూడా స్పష్టత ఇవ్వ లేదు. ఈ విషయంలో అది మౌనంగా ఉంది. ఒక చిన్న దేశం గా భూటాన్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. భూటాన్‌కు, చైనాకు మధ్య నాలుగు సరిహద్దు వివాదాల్లో డోక్లామ్ ఒకటని అక్కడి అధికారిక మీడియా తెలిపింది. అంటే అర్ధమేమిటి? అన్ని వివాదాల్లోను భారతదేశం సహాయం చేయడం సాధ్య మా అని ప్రశ్నించినట్లనిపిస్తోంది. కాబట్టి ఈ వ్యవహారాన్ని చైనా, భూటాన్ దేశాలు తేల్చుకోడానికి వదిలేయడమే ఉత్తమం.
భూటాన్ అతి చిన్న దేశం. కాబట్టి తనకు పొరుగున ఉన్న ఈ రెండు పెద్దదేశాలతోను సయోథ్యను కాపాడుకునే ప్రయత్నమే చేస్తుంది. కాని మనం తొందరపాటుతో, భూటాన్ అభ్యర్ధన లేకపోయినా మన సైన్యాన్ని సరిహద్దు దాటించి భూటాన్‌లోకి పంపడం వల్ల ఇప్పుడు భూటాన్ ఇబ్బందికర మైన పరిస్థితిలో పడిపోయింది.
ఈ మొత్తం వివాదంలో చైనా నుంచి తీవ్రమైన వ్యాఖ్యలు వస్తున్నప్పటికీ, డోక్లామ్ పీఠభూమి తమదే అని చెబుతూ చట్టబద్దమైన ఆధారాలు చూపించడం పట్ల చైనా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నది. 1890 కాలం నాటి ఒప్పందాన్ని అందుకు సాక్ష్యంగా చూపిస్తోంది. బలప్రయోగంతో తన మాట నెగ్గించుకోవాలని భావించే చైనా ఇలా వ్యవహరించడం కాస్త విచిత్రమే. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇక్కడ మూడు దేశాల మధ్య వివాదం లేదు. నిజానికి వివాదం చైనా భూటాన్‌ల మధ్య ఉంది. అది అంతర్జాతీయ సరిహద్దు కాబట్టి భారత్-చైనాల సరిహద్దు విషయంలో వివాదం లేదు. అంతర్జాతీయ సరిహద్దును దాటడం అనేది చాలా తీవ్రమైన విషయం. పాకిస్థాన్ కూడా నియంత్రణ రేఖ వద్ద మాత్రమే సాహసాలు చేస్తుంది కాని అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాదు. కాబట్టి భూటాన్ సరిహద్దుల్లోకి వెళ్ళి చైనాను అడ్డు కోవడం అంటే చైనా, భూటాన్ దేశాల మధ్య వివాదంలో తల దూర్చడం అవుతోంది. ఇదో ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ విషయమై అంతర్జాతీయ మద్దతు ఎంతవరకు లభిస్తుందో చెప్పలేము. నిజం చెప్పాలంటే ఈ పరిస్థితి నుంచి బయటపడ డానికి ఇప్పుడు ప్రయత్నించాలి. డోక్లామ్ పీఠభూమిలో చైనా రోడ్డు నిర్మాణం అన్నది ఇప్పుడు కొత్తకాదు. జరుగుతూ వచ్చిందే. డోక్లామ్ నుంచి భారతదళాలు వైదొలగాలని లేక పోతే చైనా సాయుధ చర్యలు తీసుకుంటుందన్న హెచ్చరిక లు కూడా వస్తున్నాయి. ఇదంతా జరుగుతున్నది భూటాన్ భూ భాగంలో.
చాలామంది భారత విశ్లేషకులు ఈ పరిస్థితి యుద్ధానికి దారితీసే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. నిజానికి 1962 కు ముందు కూడా మనం ఇలాగే భావించాం. కాని భారతదేశం ఇలాంటి పరిస్థితిలో ఇరుక్కున్న తర్వాత చైనా దొరికిన అవకాశాన్ని వదిలేస్తుందా? ఆసియాలో బలమైన దేశంగా ఎదుగుతున్న భారతదేశంపై పైచేయి సాధించే అవకాశాన్ని వదులుకుంటుందా? భారతదేశానికి పాఠం నేర్పాలన్న వాదనలు చైనా మీడియాలో కనబడుతున్నాయి. మరోవైపు భారతదేశంలో చైనా రాయబారి లూ జూయీ యుద్ధం జరిగే అవకాశం గురించిన ప్రశ్నకు స్పష్టంగా జవాబీయలేదు. భారతదళాలు వెనక్కి మరలాలని మాత్రమే అన్నాడు. అప్పుడే భారత-చైనాల మధ్య అర్థవంతమైన చర్చలు జరుగుతాయని చెప్పాడు.
ఈ పరిస్థితిలో మన వద్ద ఉన్న అవకాశాలేమిటన్నది పరిశీలించాలి. డోక్లామ్ పీఠభూమి తమదే అని చెప్పడానికి చైనా 1890 నాటి ఒప్పందాన్ని చూపిస్తోంది. కాని ఇక్కడే చైనా ఒక పొరబాటు కూడా చేస్తోంది. 1962 యుద్ధానికి ముందు చైనా తిరస్కరించిన రెండు ఒప్పందాలను కూడా ఈ క్రమంలో ఒప్పుకుంటున్నట్లే అవుతుంది. ఇందులో మొదటిది వలసపాలకులు గతంలో నిర్ణయించిన సరిహద్దుల విషయం లో మళ్ళీ చర్చలు, రెండవది సరిహద్దులను నదీ పరివాహక సూత్రం (వాటర్ షెడ్ ప్రిన్సిపల్) ప్రకారం నిర్ణయించు కోవా లన్నది. ఈ సూత్రం ప్రకారం మయన్మార్ తదితర దేశాలతో సరిహద్దులను నిర్ధారించుకున్న చైనా భారతదేశం విషయానికి వచ్చేసరికి, భారతదేశం మక్ మోహన్ రేఖకు చేసిన సవరణ ను గుర్తించడానికి నిరాకరించింది. వాటర్ షెడ్ ప్రిన్సిపల్ ప్రకారం భూటాన్ ట్రయ్ జంక్షన్‌ను నిర్ధారించ వలసిన మక్ మోహన్ ఆరు కిలోమీటర్ల తేడాతో సూచించారు. ఇది పొర బాటున జరిగింది. కాని అప్పటి నుంచి ఆ వివాదం అలాగే ఉంది. నిజానికి 1962 యుద్ధం కూడా సమాచార లోపం వల్లనే జరిగిందని హెండర్స్ సన్ బ్రూక్స్ నివేదిక తెలుపుతోంది.
ప్రస్తుతం చైనా డోక్లామ్ పీఠభూమి విషయంలో ఈ పత్రాలపైనే ఆధారపడుతుంది కాబట్టి, హిమాలయాల్లో సరి హద్దుల నిర్ణయానికి వాటర్ షెడ్ సూత్రానికి కట్టుబడే పరిస్థితి లో ఇప్పుడు చైనా ఉంది కాబట్టి, హిమాలయాల పొడుగున చైనాతో సరిహద్దు వివాదాలన్నింటినీ పరిష్కరించుకునే అవకాశం ఇది. ఈ పరిష్కారం కోసం భూటాన్ నుంచి వైదొల గడం సముచితమైన నిర్ణయంగా మారుతుంది. దీనివల్ల అరుణాచల్‌ప్రదేశ్‌లో భారతదేశం కోరిన ప్రకారం సరిహద్దు సమస్య పరిష్కారం కావచ్చు. సరయిన చాకచక్యంతో వ్యవహరిస్తే ఇది సాధ్యమే.

(వైర్ వెబ్ పత్రికలో ప్రేమ్ శంకర్ ఝా రాసిన వ్యాసం ఆధారంగా)