Home హైదరాబాద్ రెచ్చిపోతున్న గ్రామ సింహాలు

రెచ్చిపోతున్న గ్రామ సింహాలు

  • రోడ్లపైకి రావడానికి జంకుతున్న ప్రజలు
  • కుక్కలను తరలించడంతో నిర్లక్షంగా వ్యవహరిస్తున్న డాగ్‌స్వాడ్ బృందాలు

Dogs-Hyderabad

సిటీబ్యూరో : వీధికుక్కలు రెచ్చిపోతూ దారిన వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయి. వేసవికాలం ప్రారంభంలో ఎండవేడికి కుక్కలు పిచ్చిపట్టినట్లు రోడ్లపై తిరుగుతూ నడుచుకుంటూ వెళ్లుతున్నవారిపై దాడులు చేసి కరుస్తున్నాయి. కుక్కలు ముకుమ్మడిగా పాదచారులపై దాడులు చేస్తూ కండలు పీకివేస్తూ తీవ్రంగా గాయపరుస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. నగరం, శివారు ప్రాంతాలలో బస్తీలు, కాలనీల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తుండంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా కుక్కలు రోడ్లపై తిరుగుతూ వచ్చిపోయే వారిపై దాడులు చేస్తున్నాయి. కుక్కల దాడితో తీవ్రగాయాలై పలువురు ఆసుపత్రులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి కుక్కకాటుకు గురై ప్రతి రోజు 40 నుంచి 50మంది బాధితులు చికిత్స నిమిత్తం వస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా కుక్కలు రెచ్చిపోయి దాడులు చేస్తూ కరుస్తుంటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొంతకాలం క్రితం మల్కాజిగిరి ప్రాంతంలో ఇంటి ముందు అరుగుపై పడుకున్న వ్యక్తిపై కుక్కలు దాడి చేసి అతనిని తీవ్రంగా గాయపరిచాయి. తాజాగా అంబర్‌పేటలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్కులు దాడి చేసి కరిచాయి. ఈ సంఘటనలో వారికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే కుక్కలు విచ్ఛలవిడిగా సంచరిస్తూ దాడులు చేస్తున్న వాటిని పట్టుకుని తరలించడంతో జిహెచ్‌ఎంసి డాగ్‌స్వాడ్ బృందాలు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నా యనే ఆరోపణలు వస్తున్నాయి. బస్తీలు, కాలనీల్లో పెరిగిపోతున్న కుక్కలను తరలించాలని పలుమార్లు డాగ్‌స్వాడ్ బృందాలకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
కుక్కలతో జాగ్రత్త : వేసవికాలం కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు పేర్కొంటున్నారు. వేసవి ఎండకు దాహం కారణంగా కుక్కలు కోపంగా ఉంటాయన్నారు. సమయానికి ఆహారం, నీరు తీసుకోకపోవడం, కుక్కలకు చెమట గ్రంధులు లేకపోవడంతో కోపంగా ఉంటాయన్నారు. ఆ సమయంలో ఎవరైనా వాటి దగ్గరకు వస్తే కరుస్తాయని వైద్యులు తెలిపారు. కుక్క కరిస్తే దాని నోట్లోని లాలాజలం కాటు ద్వారా రక్తంలో కలుస్తోందని వైద్యులు తెలిపారు. దీంతో రెబీస్ వచ్చే అవకాశం ఉందన్నారు. కుక్క కరిస్తే కరిచినచోట సబ్బుతో శుభ్రంగా కడుగాలన్నారు. సమీపంలోని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి ప్రథమ చికిత్స చేయించాలన్నారు. అనంతరం కుక్కకాటుకు గురైన వారు తప్పనిసరిగా టీకాలు, వ్యాక్సినేషన్‌ను తప్పనిసరిగా చేయించాలని వైద్యులు పేర్కొన్నారు.