Home అంతర్జాతీయ వార్తలు కిమ్‌తో వచ్చే నెలలో ట్రంప్ భేటీ

కిమ్‌తో వచ్చే నెలలో ట్రంప్ భేటీ

Trump, Kim Jong-un to Hold Second Summit Meet

 

కీలక అంశాలు చర్చకు

వాషింగ్టన్ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో తిరిగి సమావేశం అవుతారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వర్గాలు శనివారం తెలిపాయి. కిమ్ ఇంతకు ముందు మాటిచ్చినట్లుగా అణ్వాయుధాలను నిర్మూలించుకోవల్సి ఉంది. శక్తివంతమైన క్షిపణి కార్యక్రమాలను విరమించుకోవల్సి ఉంది. ఈ దిశలో ఉత్తర కొరియా అధినేతకు ట్రంప్ తమ వాదన విన్పిస్తారని వెల్లడించారు. గత ఏడిది జూన్ 12 వ తేదీన ఇరువురు నేతలు సింగపూర్‌లో తొలిసారిగా శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అణ్వాయుధ నిర్మూలన, ఆంక్షల ఎత్తివేత దిశలో ఇది చారిత్రక భేటీగా నిలిచింది. అయితే సింగపూర్ సమ్మిట్ తరువాత అనుకున్న స్థాయిలో ఉత్తర కొరియా తన మాటను నిలబెట్టుకోవడం లేదని అమెరికా అధ్యక్షులు అసంతృప్తితో ఉన్నారు. దీనికి అనుగుణంగానే ఆంక్షలలో పట్టు సడలింపులకు దిగకుండా ఉన్నారు. ఈ దశలో ఇరువురు నేతల మధ్య తదుపరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఫిబ్రవరి చివరిలో తిరిగి జరిగే భేటీ ఎక్కడుంటుందనేది ఇంకా గుర్తించలేదని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.

షట్‌డౌన్‌పై నేడు ట్రంప్ కీలక ప్రకటన
అమెరికాలో నెలకొన్న షట్‌డౌన్, సంబంధిత సరిహద్దు అంశాలపై దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన వెలువరించనున్నారు. ఈ రెండు సంక్లిష్ట అంశాలపై తాను అమెరికన్లకు వివరణ ఇచ్చుకుంటానని ట్రంప్ శనివారం వెల్లడించారు. భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ట్రంప్ ప్రకటన వెలువడనుంది. మెక్సికో సరిహద్దుల మూసివేతకు ఉద్ధేశించిన భారీ స్థాయి గోడ నిర్మాణానికి ట్రంప్ అమెరికా కాంగ్రెస్ నుంచి నిధులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇందుకు ప్రతిపక్షాలు సమ్మతించకపోవడంతో అప్పటి నుంచి దేశంలో పాక్షిక ఆర్థిక ప్రతిష్టంభన నెలకొంది. పలు కీలక విభాగాలకు వేతనాలు నిలిచిపొయ్యాయి. ఈ దశలో ఈ సుదీర్ఘ షట్‌డౌన్‌పై తాను కీలక ప్రకటన వెలువరిస్తానని ట్రంప్ చెప్పడం కీలకంగా మారింది. తన కీలక ప్రకటనను వైట్‌హౌస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తారని కూడా ట్రంప్ వివరించారు. దాదాపుగా నాలుగు వారాలుగా దేశంలోని వివిధ కీలక విభాగాల అధినేతలు, ప్రతిపక్ష డెమొక్రట్లతో పలువురు సెనెటర్లతో అనేక దఫాలుగా షట్‌డౌన్ ముగింపునకు సంప్రదింపులు సాగిస్తున్నారు. అయితే సవ్యమైన పరిష్కారం మాట అటుంచితే, అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి సంఘర్షణనే వ్యక్తం అవుతూ వస్తోంది. కాంక్రీట్ వాల్ నిర్మాణమే దేశానికి రక్షణ అని ట్రంప్ చెపుతున్నారు. అక్రమ వలసదార్లను, డ్రగ్స్ స్మగ్లర్లను అరికట్టేందుకు ఇదే మార్గం అని తేల్చిచెప్పారు. అయితే ఇంతటి భారీ స్థాయి నిధుల మంజూరి అవసరం లేదని, కేవలం సరిహద్దుల మూసివేతతో సరిపోతుందని , కంచెతో పొయ్యేదానికి కాంక్రీట్ వాల్ ఎందుకు అని ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఈ దశలో ట్రంప్ ఈ కీలక పరిణామంపై ఎటువంటి స్పందనకు దిగుతారు? ఆయన ప్రకటన సమస్యను జటిలం చేస్తుందా? లేక పరిష్కరిస్తుందా? అనేది కీలకంగా మారింది.

Trump, Kim Jong-un to Hold Second Summit Meeting Next Month