Friday, April 19, 2024

ట్రంప్‌కు శాంతి పురస్కారమా?

- Advertisement -
- Advertisement -

Donald Trump

ఇటీవల న్యూస్ పేపర్లలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ పేరును నోబుల్ శాంతి పురస్కారానికి నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ ప్రతిపాదించినట్లు చదివిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. దేశాల మధ్య సోదర భావం కోసం, యుద్ధ వాతావరణాన్ని తగ్గిస్తూ సైన్యాలను ఉపసంహరించుకోవడం కోసం కృషి చేసిన వారితో పాటు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే వారికీ ఇచ్చే నోబుల్ శాంతి బహుమతి రెండు అమెరికా మిత్ర దేశాలమధ్య అదే అమెరికా అధ్యక్షుడు సంధి కుదిర్చినందుకు నోబుల్ శాంతి బహుమతికి ఎన్నికైన నాటి నుండి వివాదాస్పద వ్యక్తి, యుద్ధ్డ పిపాసి అయిన ట్రంప్ నామినేట్ కావడం ఒకింత ఆందోళన కలిగిస్తుంది.
2017 లో తన మొదటి బడ్జెట్ ప్రసంగంలో రక్షణ శాఖకు 10% నిధుల పెంపుతో ( 54 బిలియన్ డాలర్ల )పాటు అదనంగా 30 బిలియన్ డాలర్ల కావాలని కాంగ్రెస్‌ను అభ్యర్ధించడంతో తాను సైన్యంపై ఆధారపడి పాలించనునట్లు చెప్పకనే చెప్పాడు. బరాక్ ఒబామా కాలంలో అమెరికా చేసుకున్న 12 దేశాల ఆసియా కేంద్రీకృత వాణిజ్య ఒప్పందం ట్రాన్స్- ఫసిపిక్ నుంచి ఈయన కాలంలో అమెరికా వైదొలగింది. 2017లో ఆరు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులను 90 రోజులు అమెరికాకు రాకుండా నిషేధించాడు. 2017లో జెరూసలేంను ఇజ్రాయిల్ రాజధానిగా గుర్తించి టెల్‌అవివ్ నుంచి తన రాయబార కార్యాలయాన్ని తరలించే ప్రయత్నం చేశాడు. ఒబామా చర్చల వల్ల కుదిరిన 195 దేశాల అంతర్జాతీయ మైలురాయి వంటి ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతానని 2017 లో ప్రకటించాడు.
ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని పిలువబడే జాయింట్ కాంప్రహెన్సి ప్లాన్ ఆఫ్ యాక్షన్ 2015 నుండి అమెరికాను ఏకపక్షంగా ఉపసంహరించుకోవాలని 2018లో ట్రంప్ తీసుకున్న నిర్ణయం మధ్యప్రాచ్యం అంతటా గందరగోళాన్ని సృష్టించింది. జనరల్ ఖాసేమ్ సోలైమానిని హత్య చేయడం ద్వారా ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరిగాయి. ట్రంఫ్ 2018 జూన్‌లో ఉత్తర కొరియా నాయకులు కిమ్- జోంగ్-ఉన్‌తో సింగపూర్‌లో సమావేశమై దక్షిణకొరియాతో సైనిక సంధి చేసుకోవడంతో పాటు, ఉత్తర కొరియాకు రాయితీలు ప్రకటించి ప్రపంచాన్ని, దక్షిణ కొరియాను, పెంటగాన్ని ఆశ్చర్యపరచారు. కొరియా ద్వీపకల్పం అణ్వాయుద్ధీకరణపై చర్చలు 2019 లో విఫలమైనాయి.
యుఎస్, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణ నిధుల కోసం ట్రంఫ్ చేసిన డిమాండు ఫలితంగా నెల రోజుల పాటు ప్రభుత్వం స్తంభించిపోయింది. దీనితో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించాడు. ఆ సందర్భంగానే నిధుల కోసం వీటో అధికారాన్ని ఉపయోగించాడు. తన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్‌పై దర్యాప్తు ప్రారంభించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడుపై ఒత్తిడి చేసి అతను ఒప్పుకోకపోయేసరికి రష్యన్ అనుకూల వేర్పాటువాదులపై కొనసాగిస్తున్న యుద్ధం కోసం కాంగ్రెస్ ఆమోదం పొందిన 400 బిలియన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేయాలని ఆదేశించాడు. దీనిపై ప్రతినిధుల సభ 2019 సెప్టెంబర్‌లో నేర విచారణ చేసింది. డిసెంబర్ లో ట్రంప్ అభిశంసనను ఎదుర్కొన్నారు. అమెరికా అధ్యక్షుని చరిత్రలోనే అభిశంసనను ఎదుర్కొన్న మూడవ అధ్యక్షుడు ట్రంఫ్. ఉటా కు చెందిన మిట్ రోమ్నీ ట్రంప్‌ను దోషిగా నిర్ధారించడానికి ఓటు వేయడం ద్వారా చరిత్ర సృష్టించాడు. ఒక సెనెటర్ తన సొంత పార్టీకి చెందిన అధ్యక్షున్ని శిక్షించాలని ఓటు వేయడం అమెరికా చరిత్రలో మొదటి సంఘటన. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఎన్నికల బృందం రష్యా ఏజెంట్లతో కుమ్మక్కయిందనే ఆరోపణల మధ్య జాతీయ భద్రత సలహాదారుడు మైఖేల్ ప్లీన్‌ను తొలగించారు. శాంతి ఒప్పందంలోని నిబంధనలను తాలిబాన్లు అంగీకరిస్తే 14 నెలల్లో ఆఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకుంటామని, బదులుగా అమెరికా, మిత్రదేశాలపై ఉగ్రవాదులు ఆఫ్ఘాన్ గడ్డ నుంచి దాడులు జరపకుండా చూడాలని ప్రజల చేత ఎన్నికైన ఆఫ్ఘాన్ ప్రభుత్వాన్ని కాదని ఉగ్రవాద తాలిబాన్స్‌తో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇజ్రాయిల్ విషయంలో మానవ హక్కుల మండలి నుంచి అమెరికా వైదొలుగుతుందని 2018లో ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రకటించారు.
2018లో నాప్టాల్ స్థానంలో యుఎస్, ఎంసిఎ ఒప్పందం చేసుకున్నారు. 2019 మే నెలలో రెండు వందల బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై సుంకాలు పెంచారు. దీనితో చైనా కూడా సుంకాలను పెంచింది. ఈ సంఘటన రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీసింది. చైనాలోని అన్ని అమెరికా ప్రైవేట్ కంపెనీలను చైనాను వదలి బయటకు రావాలని ఆదేశించాడు. కుర్దిష్ నియంత్రణలో ఉన్న ప్రాంతం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవడంతో టర్కీ సిరియాపై దాడి చేసింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రజలపై సారిన్ రసాయన ఆయుధాన్ని ఉపయోగించారని ప్రతీకారంగా క్రూయి జ్ క్షిపణి దాడులకు ట్రంప్ అవకాశం ఇచ్చారు. ఉత్తర సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకునందువల్ల రష్యా, ఇరాన్, సిరియా ఒప్పందానికి వచ్చి అమెరికా వ్యతిరేక కూటమి గా మారింది. 2019 అక్టోబర్‌లో ట్రంప్ టర్కీ అధ్యక్షుడుతో మాట్లాడిన తరువాతనే టర్కీ సిరియాపై దాడి చేసిందని వైట్ హౌజ్ కూడా అంగీకరించింది.
కోవిడ్- 19 ఘోరంగా వ్యాప్తి చెంది 63 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక లక్షా 90 వేల మంది చనిపోయారు. 1945 నుంచి యుద్ధంలో మరణించిన అమెరికా సైనికులకంటే ఈ సంఖ్య ఎక్కువ. వైరస్ పట్ల ట్రంప్ అనాలోచిత విధానం, విజ్ఞాన శాస్త్రాన్ని తిరస్కరించే ధోరణి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. 2020లో డబ్ల్యు.హెచ్.ఒకు నిధులు నిలిపివేసి, డబ్ల్యుహెచ్‌ఒ నుంచి అమెరికా బయటకు వెళ్తున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. ట్రంప్ కాలంలో జార్జి ఫాయిడ్ మరణం ( మే 25న ) శ్వేతా జాతి పోలీస్ అధికారి మైఖేల్ చౌ విన్, జాత్యహంకారంతో పోలీస్‌లకు జవాబుదారీతనం లేకపోవడంతో చేసిన నరహత్య. దీనికి వ్యతిరేకంగా 75కు పైగా ప్రాంతాల్లో, ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. ఇంత పెద్ద ఎత్తున నిరసనలు రావడానికి కారణం, అక్కడి పోలీస్ వ్యవస్థపై, న్యాయ వ్యవస్థపై నమ్మకం లేకపోవడమే.
మే 26న శాంతియుతంగా ప్రారంభమైన నిరసన దేశ వ్యాప్తంగా హింసాయుతంగా మారడంతో రెండు రోజుల తర్వాత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. శాంతియుత నిరసనలు హింసాయుతం కావడంతో మే 29న ట్రంప్ జాత్యహంకారంతో ‘దోపిడీ ప్రారంభం అయితే షూటింగ్ ప్రారంభం’ అవుతుంది అని రెచ్చ కొట్టడంతో నిరసనలు మరింతగా ఊపందుకున్నాయి. ట్రంప్ అధ్యక్ష భవనం కింద బంకర్లలోకి వెళ్లిపోవలసి వచ్చింది. జూన్ 1న ట్రంప్ 1870 నాటి తిరుగుబాటు వ్యతిరేక చట్టం ద్వారా మిలిటరీని మోహరిస్తాం అని బెదిరించడంతో నిరసనలు ప్రపంచ వ్యాప్తం అయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, క్లింటన్, జార్జిబుష్‌లు స్పందిస్తూ మన విషాద వైఫల్యాలను పరిశీలించాల్సిన సమయమిది అని పరోక్షంగా సూచించిన ట్రంప్‌కు బోధపడలేదు. 2018 వెరైటీ ఆఫ్ యాన్యువల్ డెమొక్రాటిక్ రిపోర్ట్ ట్రంప్ పరిపాలన ప్రారంభించినప్పటి నుండి ప్రజాస్వామ్యానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని పేర్కొంది. 2019 జనవరిలో ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ అంచనా ప్రకారం ఇరాన్ అణ్వాయుధాలను అనుసరించలేదని, ఉత్తర కొరియా తన అణ్వాయుధ సామగ్రిని వదులుకునే అవకాశం లేదని ట్రంప్ వాదనలకు వ్యతిరేకంగా పేర్కొంది.
2020 జనవరిలో ఫ్యూరీ సెర్చ్ సెంటర్ 32 దేశాల సర్వే ఫలితాలు విడుదల చేసింది. దీని ప్రకారం 64 శాతం మంది ప్రపంచ వ్యవహారాల్లో ట్రంప్ సరైన నాయకత్వం చేయగలడనే నమ్మకం లేదని చెప్పారు. అతనిపై 29 శాతం మంది మాత్రమే విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నియంత్రణలో ట్రంప్ వైఖరి ప్రపంచ నాయకత్వంలో శూన్యాన్ని సృష్టించింది. అక్రమ సరిహద్దు క్రాసింగ్‌లపై ట్రంప్ పాలన జీరోటాలరెన్స్ విధానం కనీసం 5,500 కుటుంబాల నుంచి వారి పిల్లలను వేరు చేయడానికి దారితీసింది. ఈ విషయం మానవ హక్కుల ఉల్లంఘనగా, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లుగా ఐక్యరాజ్య సమితి ఆరోపించింది. వలస వచ్చిన పిల్లలపై అమెరికా ప్రభుత్వం వ్యవహరించిన తీరు, మెక్సికో నుండి సరిహద్దు దాటినా తరువాత నిర్బంధ సదుపాయాల్లో వారు ఎదుర్కొన్న పరిస్థితుల పట్ల తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ మిచెల్ బాచేలెట్ పేర్కొ నారు. ట్రంప్ కాలంలో అమెరికా నాటోకి మధ్య విభేదాలు, అమెరికా యూరోపియన్ యూనియన్‌కు మధ్య విభేదాలు, అమెరికా రష్యాకు మధ్య విభేదాలు, అమెరికా చైనాకు మధ్య విభేదాలు, అమెరికా ఇరాన్‌కు మధ్య విభేదాలు చివరికి మిత్ర దేశమైన భారత్ దేశాన్ని కూడా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఇవ్వకపోతే ప్రతీకారం తీసుకుంటానన్నాడు. ఇటువంటి వివాదాస్పద వ్యక్తికీ, యుద్ధ పిపాసికి, జాత్యహంకార వ్యక్తికి నోబుల్ శాంతి బహుమతి ఇచ్చి ప్రపంచ శాంతి దూతగా సత్కరిద్దామా?

                                                                                        జుర్రు నారాయణ, 9494019270

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News