Home ఎడిటోరియల్ మంచు కరగలేదు!

మంచు కరగలేదు!

Article about Modi china tour

హెల్సెంకిలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముఖాముఖీ సమావేశం, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం ఇల్ అన్‌తో సింగపూర్ సమావేశంలాగా ప్రపంచ వ్యాప్త ఆసక్తిని రేకెత్తించలేదు. రెండు అతిపెద్ద అణ్వస్త్ర రాజ్యాల అధినేతల చర్చలకు ఫలితాలాశించే తక్షణ ఎజండా లేకపోవటం, ఇరుదేశాల సంబంధాలు పూర్తిగా బెడిసి ఉండటం ఇందుకు కారణంగా భావించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో అధినేతల స్థాయిలో ముఖాముఖీ చర్చలే చరిత్రాత్మక ఘటన. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక జోక్యం, క్రిమియాను స్వాధీనం చేసుకోవటం, సిరియాలో అస్సాద్ ప్రభుత్వానికి అండగా నిలబడటం అమెరికాకు ఆగ్రహ కారణం. అంతేగాక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు వ్యతిరేకంగా రష్యా జోక్యం చేసుకుని ట్రంప్ విజయానికి పరోక్షంగా తోడ్పడిందన్న ఆరోపణ పుతిన్‌పై ఉంది. దీనిపై అమెరికాలో జరుగుతున్న దర్యాప్తు ట్రంప్‌కు తలనొప్పిగా మారింది. ఉక్రెయిన్, క్రిమియా చర్యలకుగాను రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆర్థిక ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ పుతిన్ రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షునిగా అతిపెద్ద మెజారిటీతో ఎన్నికైనారు.
ట్రంప్ రష్యాను విరోధిగా చూస్తున్నప్పటికీ, ఆర్థిక, దౌత్య ప్రత్యర్థులుగా తాను చూస్తున్న చైనా, ఇ.యులతో సమానంగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన జి.7సమావేశం సందర్భంలో రష్యాను ఈ గ్రూపులో చేర్చుకోవాలని ట్రంప్ ప్రతిపాదించారు. లోగడ రష్యాను చేర్చుకుని జి8గా మారిన పారిశ్రామిక దేశాల గ్రూపు నుంచి క్రిమియా ఉదంతం తదుపరి తొలగించారు. ఉక్రెయిన్‌తో సంఘర్షణ దరిమిలా, తమ దేశ రక్షణకు కీలకమైన క్రిమియాను రష్యా తనలో కలుపుకుంది. ప్రజలు హర్షించారు. అక్కడ రష్యన్‌లు అత్యధిక మెజారిటీ. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే రష్యాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటామని చెప్పారు. అయితే ఎన్నికల్లో రష్యా జోక్యం గూర్చిన సిఐఎ ఫిర్యాదు ఆ అవకాశానికి ప్రతిబంధకమైంది.
తనకు పూర్వ అధ్యక్షుల బుద్ధిహీనతవల్లనే రష్యాతో సంబంధాలు అధమస్థాయికి చేరాయిని స్వయంగా వ్యాఖ్యానించిన ట్రంప్, రష్యా నేతతో వ్యక్తిగత సంబంధం ఏర్పరుచుకోవాలని కోరుకున్నారు. ట్రంప్ దౌత్యంలో ‘వ్యక్తిగత సంబంధం’ ఏర్పరుచుకోవటమన్నది విలక్షణం. చైనా, ఉత్తర కొరియా అధ్యక్షులతో ముఖాముఖీ సమావేశాల్లోనూ ఈ వైఖరి స్పష్టమైంది. అయితే హెల్సెంకిలో ఏం జరిగింది? పుతిన్‌తో తన చర్చలను ‘శుభారంభం’గా ట్రంప్ అమెరికా అధ్యక్షునితో చర్చలు “ఫలప్రదమైనాయి, ప్రయోజనకరం” అని పుతిన్ వ్యాఖ్యానించారు. అమెరికా రష్యా సంబంధాల్లో ప్రస్తుతాన్ని కష్టకాలంగా పేర్కొన్న పుతిన్, ఈ సమ్మిట్ “విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవాలన్న మా ఆకాంక్షను ప్రతిబింబించింది” అన్నారు.
అయితే అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికాకు పోటీగా ఉన్న రష్యాను దెబ్బతీసి లొంగదీసుకోవాలనే శక్తులు అమెరికన్ ఎష్లాబ్లిష్‌మెంట్‌లో బలంగా ఉన్నాయి. సైనికంగా రష్యా, వాణిజ్యంలో చైనాలను విరోధులుగా వారు చూస్తున్నారు. సోవియట్ యూనియన్ విచ్ఛిత్తితో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయి రెండున్నర దశాబ్దాలు దాటినా రష్యాను లొంగదీసుకోవటం సాధ్యం కాలేదు. కాదు కూడా. అందువల్ల వాస్తవ పరిస్థితులను గమనంలో ఉంచుకుని ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవటం, అంతర్జాతీయ సమస్యల్లో సంప్రదింపుల ధోరణి అనుసరించటం ఆవశ్యకం. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇబ్బందికరంగా తయారైన ‘అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం’ సమస్యను ఒక కొలిక్కి తేవటం అవసరం. ట్రంప్ ఆ విషయాన్ని ప్రస్తావించగా, ఆ ఆరోపణను ‘చెత్త’గా పుతిన్ కొట్టిపారేశాడు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్ ముల్లర్‌నుద్దేశించి, ‘అనుమానితులను ఇంటరాగేట్ చేయాలనుకుంటే అభ్యర్థన పంపవచ్చు’ అన్నారు. సిఐఎ అధిపతి తన దృష్టికి తెచ్చిన ‘జోక్యం’ ఆరోపణను తాను నమ్మలేదని ట్రంప్ చెప్పారు. కాబట్టి సంబంధాల మెరుగుదలలో ఆ సమస్య ప్రతిబంధకంకాకూడదని వారు భావించినట్లు అర్థమవుతున్నది.
ట్రంప్, పుతిన్ వాణిజ్య యుద్ధం, టెర్రరిజం, సైబర్ నేరాలు సహా అన్ని అంశాలను చర్చించారు. అయితే ఇరుదేశాల మధ్య మంచు కరగలేదు. ఇటువంటి ప్రయత్నాలు మరెన్నో అవసరం.