Home జాతీయ వార్తలు సోషల్ మీడియాలో చెడుపై ప్రచారం చేయొద్దు

సోషల్ మీడియాలో చెడుపై ప్రచారం చేయొద్దు

ప్రజలకు ప్రధాని మోడీ హితవు 

TRS MPs meets PM Narendra Modi in Delhi

న్యూఢిల్లీ : మాలిన్య వ్యాప్తికి సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకోరాదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా ద్వారా కించపర్చుకునే చర్యలకు దిగడం సభ్య సమాజ లక్షణం అన్పించుకోదని స్పష్టం చేశారు. ఈ మాలిన్యం లేదా వ్యాప్తి చెందే చెత్త అనేది సిద్ధాంతపరమైన అంశంగా ఉండదని, ఇది నిజానికి సముచిత సమాజానికి అవలక్షణం అవుతుందని హెచ్చరించారు. తమ లోక్‌సభ నియోజకవర్గం వారణాసికి చెందిన బిజెపి కార్యకర్తలు, వాలంటీర్లతో ప్రధాని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సోషల్ మీడియాను దుర్వినియోగపర్చడం వల్ల దెబ్బతినేది సమాజమే అని హెచ్చరించారు.

ఇటీవలి కాలంలో చివరికి గల్లీల్లో రెండు కుటుంబాల మధ్య కొట్లాటలు కూడా జాతీయ స్థాయి వార్తలు అవుతున్నాయని, ఇదేం పద్ధతి అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం పట్ల సదభిప్రాయం కల్గించే వార్తలను ప్రచారం చేసే వాతావరణం ఏర్పడాల్సి ఉందని, ఇటువంటి సమాచార పంపిణీతోనే సమాజం మరింత పటిష్టం అవుతుందని తెలిపారు. ప్రజలు అప్పుడప్పుడు తమ మర్యాదల పరిధిని అతిక్రమిస్తుంటారు. ప్రత్యేకించి నెటిజన్లు ఈ ధోరణిలో పడి పోతున్నారు. వారు ఏదో తప్పుడు సమాచారం వింటారు. అసత్యాన్ని సత్యంగా భ్రమిస్తారు. అంతేకాకుండా దానిని ఇతరులకు పంపిస్తుంటారు. కేవలం తాము తమకు తెలిసింది పంపించామనే అనుకుంటారు కానీ ఒక తప్పుడు వార్త ప్రచారం జరిగి సమాజానికి ఎంత నష్టం జరుగుతున్నదనేదానిని గ్రహించడం లేదని ప్రధాని తెలిపారు. కొందరు సభ్య సమాజంలో తావులేని పదాలను వాడుతుంటారు. ఇటువంటివారు మహిళల గురించి ఇష్టంవచ్చినట్లుగా మాట్లాడటం అలవాటు చేసుకుని సామాజిక మాధ్యమం ద్వారా దానిని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ద్వారా జరుగుతున్నది రాజకీయ లేదా సిద్ధాంతపరమైన అతిక్రమణ కాదని, ఇది మొత్తం 125 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన అంశం.. ఈ విషయంలో అంతా బాధ్యతాయుతంగా ఉండాలని పిలుపు నిచ్చారు. సోషల్ మీడియా ద్వారా చెత్తాచెదారపు రాతలను వ్యాప్తి చేయకుండా అంతా తగు రీతిలో వ్యవహరించాల్సి ఉందన్నారు. తాము తరచూ పేర్కొనే స్వచ్ఛ్ అభియాన్ అనేది కేవలం పారిశుభ్రతకు సంబంధించిన విషయం కాదని, ఇది మానసిక స్వచ్ఛతకు సంబంధించిన విషయం అని తెలిపారు.

ప్రజలు వాట్సాప్‌లు, ఇతర సామాజిక మాధ్యమాలతో చెడును, విద్వేషాన్ని ప్రచారం చేయడం మానుకోవాలని, మంచి అంశాలను, స్ఫూర్తిని అందించే విషయాలను ఎంతగా అయి నా వ్యాప్తి చేసుకోవచ్చునని కోరారు. దేశంలో ఇప్పుడు ప్రతి గ్రామానికి విద్యుత్ ఉంది. స్కూళ్లు, మరుగుదొడ్లు ఉన్నాయి.  భారతదేశంలో అత్యధిక స్థాయిలో మొబైల్ ఫోన్లు తయారవుతున్నాయి. దేశం త్వరితగతిన ఆర్థిక వృద్ధి చెందుతోంది. పౌర విమానయాన రంగంలో దూసుకుపోతోంది. అత్యధిక ప్రజలు విమానాలలో పయనిస్తున్నారు. ఎసి రైళ్లల్లో సాగుతున్నారని ప్రధాని తెలిపారు. ఇటువంటి ప్రగతి పరిణామాలతో ప్రతి భారతీయుడు గర్వపడాల్సి ఉందన్నారు.