Home జాతీయ వార్తలు సిగ్గుతో చావండి..ప్రతిపక్షాలకు మోడీ సలహా

సిగ్గుతో చావండి..ప్రతిపక్షాలకు మోడీ సలహా

 

అకోలా(మహారాష్ట్ర):జమ్మూ కశ్మీరులో 370 అధికరణాన్ని రద్దు చేయడంపై ప్రతిపక్షాలు చేస్తున్న యాగీపై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. డూబ్ మరో(సిగ్గుతో చావండి) అంటూ హిందీలో ఆయన ఎదురుదాడి చేశారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటున్న ప్రధాని మోడీ కాంగ్రెస్, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌పై విరుచుకుపడ్డారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే బిజెపి ఆర్టికల్ 370 రద్దుపై డపాలు కొట్టుకుంటూ బిజెపి ప్రచారం సాగిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్రకు, ఆర్టికల్ 370కి సంబంధం ఏమిటని సిగ్గుమాలిన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని, జమ్మూ కశ్మీరు కోసం సర్వస్వం త్యాగం చేసిన మహారాష్ట్ర పిల్లలను చూసి గర్విస్తున్నామని మోడీ అన్నారు. కాని, కుటుంబ రాజకీయాలలో కూరుకుపోయిన ఈ వ్యక్తులు తమ రాజకీయ లబ్ధి కోసం మహారాష్ట్రకు, కశ్మీరుకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. సిగ్గుతో చావండి అంటూ ఆయన ప్రతిపక్షాల నాయకులను ఎద్దేవా చేశారు. ఛత్రపతి శివాజీ పుట్టిన ఈ గడ్డ మీద కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా మాట్లాడడం తనను దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ఆయన అన్నారు. మహారాష్ట్రకు, జమ్మూ కశ్మీరుకు సంబంధం లేదని అంటున్న వారి సిగ్గుమాలినతనాన్ని మీరే చూడండని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 21న జరగనున్నది. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడనున్నాయి.

 

Doob Maro, Says PM to Opposition, PM Modi lashes at Congress and NCP chief Sharad Pawar for asking what is the connection between Article 370 and Maharastra