Friday, April 19, 2024

‘డబుల్ ఇళ్ల’ పేరిట భారీ మోసం

- Advertisement -
- Advertisement -

double bedroom fraud in telangana

హైదరాబాద్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన నిందితున్ని నగరంలోని మాదాపూర్ ఎస్‌ఓటి, కెపిహెచ్‌బి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 8లక్షల నగదు, కారు, ల్యాప్‌టాప్, ప్రింటర్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడివరం మండలం, నడిమిలంక గ్రామానికి చెందిన గుత్తుల ప్రశాంత్ నగరంలోని కూకట్‌పల్లి ఎంఐజిలో ఉంటూ విజన్ వన్ టివి చానల్‌ను స్థానికంగా నిర్వహిస్తూ దానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. తనకు రాజకీయ నాయకులతో పరిచయం ఉందని, డబుల్ బెడ్ రూము ఇళ్లు ఇప్పిస్తానని చెప్పడంతో చాలా మంది అమాయకులు నమ్మారు.

నిజాంపేట, కైతలాపూర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూముల ఇళ్లలో ఇప్పిస్తానని వారికి చెప్పాడు. వారి వద్ద నుంచి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు, ఫొటోలు తీసుకున్నాడు. ఒక్కొక్కరి వద్ద రూ. 1,55,000- నుంచి రూ. 1,70,000 వసూలు చేశాడు. ఇలా 40మంది నుంచి దాదాపు 70లక్షల వరకు వసూలు చేశాడు. పదిరోజుల తర్వాత తాను తయారు చేసిన నకిలీ అలార్ట్‌మెంట్ ఆర్డర్లను బాధితులకు అందజేశారు. మియాపూర్, కూకట్‌పల్లి, బాచుపల్లి, కెపిహెచ్‌బి తదితర ప్రాంతాలకు చెందిన పలువురు మోస పోయారు. గతంలో కూడా ప్రశాంత్ తాను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎస్సైగా పనిచేస్తున్నానని చెప్పి నకిలీ ఐడి కార్డును తయారు చేసుకుని టోల్‌గేట్ వద్ద డబ్బులు కట్టకుండా వాహనంలో తిరుగుతున్నాడు. విజయవాడ, భవానీపురం పోలీసులు ప్రశాంత్ అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అభినందించారు. పోలీసులకు అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News