Wednesday, April 17, 2024

కిషన్ రెడ్డి పిఎ పేరుతో చెలామణి.. వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిఎనని చెప్పి మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని ఇందిరానగర్‌కు చెందిన ప్రదీప్ గతంలో బిజేపిలో పనిచేశాడు. గత కొంతకాలం నుంచి తాను కేంద్రమంత్రి పిఎ నంటూ బస్తీలో హడావుడి సృష్టించేవాడు. స్థానిక కాలనీకి చెందిన మహిళకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి రూ.5లక్షలు తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత బండ్లగూడకు తీసుకువెళ్లి కొన్ని ఇళ్లను చూపించాడు. డబ్బులు తీసుకుని చాలా రోజులవుతున్నా ఇప్పటి వరకు ఇంటికి సంబంధించిన మంజూరు లెటర్ రాకపోవడంతో ప్రదీప్‌పై మహిళ ఒత్తిడి చేసింది.

దీంతో నిందితుడు జిహెచ్‌ఎంసి కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరైనట్లు లెటర్ ఇచ్చాడు. కొద్ది రోజుల తర్వాత నకిలీ లెటర్ ఇచ్చినట్లు బాధిత మహిళ గుర్తించింది. వెంటనే గత నెల 10వ తేదీన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వద్ద పిఎగా పనిచేయడం లేదని తెలుసుకున్నారు. పిఎనంటూ పలువురి వద్ద డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ప్రదీప్ బస్తీకి చెందిన 20మంది మహిళలకు డబుల్ బెడ్ రూములు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గతంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళ వద్ద డబ్బులు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Double bedroom Scheme cheater arrested by Police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News