Friday, April 19, 2024

పంద్రాగస్టులోగా ఇళ్ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: డబుల్ ఇళ్లను పూర్తి చేయడంలోనూ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలోనూ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారిస్తోంది. లక్షల దరఖాస్తులను వడబోసి దారిద్య్ర రేఖకు దిగువన ఉండి తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి అద్దె భవనాల్లో నివసిస్తున్న వారిని అర్హులుగా గుర్తించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు పెండింగ్ లో ఉన్న రెండు పడకల ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు యుద్ధప్రాతిపదికనచర్యలుచేపట్టాలని ప్రభు త్వం అధికారులకు నిర్ధేశించింది.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు రెండు పడకల ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఉచితంగా ఇచ్చేందుకు బృహత్తర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.అందులో భాగంగా డబుల్ ఇళ్ల నిర్మాణంతో పాటు అక్కడి మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు పూర్తయ్యేలా మంత్రి వేముల, సిఎస్ సోమేష్‌కుమార్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా, మంచినీటి సదుపాయం, డ్రైనేజీ నిర్మాణః, రహదారుల ఏర్పాటు తదితర సదుపాయాలను వెంటనే పూర్తి చేసేలా వారు అధికారులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు.

2.91 లక్షల ఇళ్లు….రూ.18 వేల కోట్ల నిధులు

రాష్ట్రంలో 2.91 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ.18 వేల కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో ఈ ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి దశకు చేరుకున్నాయి. వాటిలో మౌలిక సదుపాయాలు రోడ్డు, విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు పూర్తి చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.

గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి

అర్హుల ఎంపికకు సంబంధించి ముందుగా గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్లకు పంపించాలని ప్రభుత్వం సూచించింది. అనంతరం క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను కలెక్టర్లకు పంపించాలలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం ఆ జాబితాను కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తే క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితాను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కట్టిన ఇళ్ల కంటే అర్హులైన లబ్ధిదారులు ఎక్కువ ఉంటే లక్కీ డీప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి మిగిలిన వారి జాబితాను వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచాలని అధికారులు భావిస్తున్నారు.

జనవరి 15వ తేదీలోగా పనులు పూర్తి

2023 జనవరి 15వ తేదీ డబుల్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, మౌలిక సదుపాయాల కల్పనకు లబ్ధిదారులను ఎంపిక చేసి అప్పగించే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆయా జిల్లాలో లక్ష్యంగా పెట్టుకున్న రెండుపడకల ఇళ్ల నిర్మాణ పనుల్లో ఇప్పటికే టెండర్ పూర్తయి నిర్మాణ దశలో ఉన్న వాటిని జనవరి 15వ తేదీలోగా పూర్తి చేసేందుకు ఒక నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించారు. నిర్మాణం చివరిదశలో ఉన్నవాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మౌలిక సదుపాయాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. కలెక్టర్లు సైతం ప్రతివారం ఈ ఇళ్ల నిర్మాణం సమీక్ష నిర్వహించడంతో పాటు లబ్ధిదారుల ఎంపికలో చేపట్టాల్సిన ప్రక్రియ గురించి అధికారులతో సమీక్ష జరుపుతున్నారు.

560 చదరపు అడుగుల వైశాల్యంలో…

డబుల్ ఇళ్ల నిర్మాణాన్ని 560 చదరపు అడుగుల వైశాల్యంలో విశాలమైన రెండు పడక గదులు, ఒక వంట గది, ఒక హాల్ తో పాటు రెండుబాత్ రూంలతో ప్రభుత్వం ఉత్తమ ప్రమాణాలతో నిర్మించింది. ఇళ్లు లేని నిరుపేదల మీద ఒక్క పైసా కూడా భారం మోపకుండా ఉచితంగా ఇంటిని అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన ఓ బృహత్తర పథకం ఇది. రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 2,91,057 గృహాలను మంజూరు చేయగా అందులో లక్షకు పైగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు కొన్ని చోట్ల లబ్ధిదారులకు సైతం వాటిని అందచేశారు.

హడ్కో అవార్డు

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల డిజైన్, లే-ఔట్లతో పాటు ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు ఆన్‌లైన్ ప్రాజెక్ట్ మానిటరింగ్ సిస్టం (Online Project Monitoring System) (OPMS)కు జాతీయ స్థాయిలో ఇటీవల హడ్కో (HUDCO) అవార్డులు వరించాయి. ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను జాతీయస్థాయి, ఇతర రాష్ట్రాల అధికారులు సందర్శించి ప్రశంసించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News