Home వరంగల్ దసరా పండుగకు డబుల్ ధమాకా!

దసరా పండుగకు డబుల్ ధమాకా!

TRSగులాబీ నేతలకు కెసిఆర్ వరాలు, ఇక నామినేటెడ్, పార్టీ కమిటీలు, 15 నెలలుగా నేతల పడిగాపులు

మన తెలంగాణ/వరంగల్: తెలంగాణలో ఘనంగా నిర్వహించుకునే దసరా పండుగ సందర్భంగా గులాబీ నేతలకు డబుల్ ధమాకా లభించనున్నదా? 15 నెలలుగా నామినేటెడ్ పదవుల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్న నేతల పడిగాపులు నిజంగానే ఫలించనున్నాయా? ఆరునెలలుగా ఎదురుచూస్తున్న పార్టీ రాష్ట్ర, జిల్లా, గ్రేటర్ నూతన కార్యవర్గాల ఏర్పాటు పూర్తి కానున్నాయా? అంటే ఈ దఫా ఆశలు నెరవేరే అవకాశాలున్నట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా తెలంగాణ భవన్‌లో గురు వారం జరిగిన టిఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో ఈ మేరకు గులాబీ అధినేత, ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో జిల్లా టిఆర్‌ఎస్ నేతల లాబీయింగ్ పెరిగింది. గాఢ్‌ఫాదర్‌ల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభమయ్యాయి.

నష్ట నివారణ చర్యలు
తాజాగా సర్కార్‌పై పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను తగ్గించేం దుకు, విపక్షల విమర్శలను తిప్పికొట్టేందుకు పార్టీని పటిష్టం చేయడమే లక్షంగా టిఆర్‌ఎస్ యత్నిస్తోంది. ఇప్పటికే ఏర్పడిన నష్టాన్ని నివారించేందుకు ద్విముఖ వ్యూహంతో టిఆర్‌ఎస్ దసరా నేపథ్యంలో అడుగులు వేస్తోంది. సంక్షేమ కార్యక్రమాల ప్రచారం, పథకాల్లో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలకు హితోపదేశం చేసినట్లు సమాచారం. పార్టీతోపాటు ప్రజాప్రతి నిధుల్లో కొంత కదలిక తేవాలని భావించిన నేపథ్యంలోనే దసరా పండుగకు అటుఇటుగా నామినేటెడ్, పార్టీ పదవుల పంపిణీ పూర్తి చేయాలని సిఎం యోచించినట్లు చెబుతున్నారు. నామినేటెడ్, పార్టీ పదవుల ఎంపికలో జిల్లాకు చెందిన కడియం, చందూలాల్, ఎంపి సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించనున్నారు. ఇక ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరిన నాయకులు, పాత గులాబీలు కలిసికట్టుగా సాగాలని సిఎం చెప్పడంలో పార్టీలో అంతర్గతంగా నెలకొన్న గ్రూపులు కారణంగా చెబుతున్నారు. జిల్లాలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలు ఎవరికివారుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

నిరాశలో గులాబీలు
అధినేత కెసిఆర్ గత ఏడాది కాలంలో వివిధ సందర్భాల్లో ప్రకటనలు చేయడం ఆ తదుపరి ఆ ఊసే పట్టించుకోకపోవడంతో ఒక విధంగా జిల్లాలో క్రియాశీల నాయకత్వం నిరాశతో నీరుగారి పోయింది. ఇక ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ గూర్చి పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యమంలో భాగస్వామ్యమైన కేడర్‌కు, తాజాగా పార్టీలో చేరి పదవులు అనుభవిస్తున్న నాయకులకు మధ్య అంతర్గతంగా దూరం పెరిగింది. వారి అనుచరుల పెత్తనంతో వీరు మానసికంగా ఇబ్బందులపాలవుతున్నారు. ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన నాయకులు సైతం ఇప్పుడు పదవుల కోసం ఎదురుచూడాల్సి రావడంతో సంకట స్థితి ఏర్పడింది.

చాంతండంత జాబితా
నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న జాబితా చాంతడంత ఉంది. ప్రధా నంగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌లైన భూగర్భగనులు, వికలాంగులు, బిసి, మార్కెటింగ్ పాలకవర్గాలు, యూనివర్సీటీ పాలకవర్గాల్లో, అహార కమిటీలు, కుడా తదితర అనేక కమిటీల్లో అవకాశాలు ఆశిస్తున్న జాబితా చాలానే ఉంది. ఈ జాబితాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళ పల్లి రవిందర్‌రావు, పార్టీ జిల్లా ఇంచార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, నేతలు రాజయ్యయాదవ్, నాగుర్ల వెంకటేశ్వర్లు, గుడిమల్ల రవికుమార్, మర్రి యాదవరెడ్డి, కె. వాసుదేవరెడ్డి, ఇండ్ల నాగేశ్వర్‌రావు, జోరిక రమేష్, నయీముద్దీన్, భరత్‌కుమార్, మొలుగూరి, సహోదర్‌రెడ్డి, డాక్టర్ సుధాకర్‌రావు, అచ్చ విద్యాసాగర్, ద్వితీయ శ్రేణి నాయకులు, కొందరు విద్యార్ధి నాయకులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులున్నారు. 15 నెలలుగా అనేక మంది నాయకులు ఎక్కనిమెట్టు దిగని మెట్టులేదనే రీతిలో ముఖ్యమంత్రి కెసిఆర్ నుంచి టిఆర్‌ఎస్‌లో నిర్ణయాత్మకమైన పాత్ర వహించే నేతలు హరీష్‌రావు, కెటిఆర్, కవిత పాటు జిల్లాలో ఛక్రం తిప్పే మంత్రులు ఈటెల, కడియం, చందూలాల్, ఎంపీ వినోద్ తదితరుల తోపాటు మరి కొందరి నేతల ఆశీస్సులు పొందేందుకు ప్రయత్ని స్తూ వస్తున్నారు. తాజా ప్రకటనతో మరోసారి హైదరాబాద్‌కు పరుగులు తీస్తున్నారు.

జాప్యంచేస్తే కష్టాలు
టిఆర్‌ఎస్ ఐదేళ్ళ అధికారంలో ఇప్పటికే పావలా వంతు కాలం 15 నెలలు గడిచిపోయింది. పైగా త్వరలో వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలు ముందున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు సీజన్‌లలో కరువు పరిస్థి తులు నెలకొనడంతో పాటు రైతుల ఆత్మహత్యల పరంపర సర్కార్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రైతుల ఆత్మహత్యలు, లక్ష రుణమాఫీ లక్షంగా ప్రతిపక్షాలు ఒక్కటిగా టిఆర్‌ఎస్‌పై విమర్శలదాడిని ఎక్కుపెట్టడంమే కాకుండా ప్రజాక్షేత్రంలోకి రావడంతో ఒకింత ఇబ్బందికరంగా మారింది. దీన్ని రాజకీయంగా తిప్పికొట్టడంలో పార్టీ నేతలు ఆసక్తి కనబరచడంలేదు. ఈ స్థితిలో ఇంకా జాప్యం చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశముందంటున్నారు. ఈ నేపథ్యంలోనే నామినెటేడ్, పార్టీ కమిటీల ఏర్పాటుకు సిఎం చర్యలు తీసుకున్నట్లు భావి స్తున్నారు. ప్రధానంగా దశాబ్దన్నర తెలంగాణ ఉద్యమంలో అనేక ఆటు పోట్లు,అరెస్టులు, జైళ్ళు, ఆర్ధిక ఇబ్బందులు అనుభవించిన నాయ కులు పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే గంపెడాశలు పెట్టుకు న్నా రు.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో అవకాశం దక్కి పోటీచేసిన వారిలో మెజార్టీ నాయకులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అవకాశం లభించని అనేక మంది నాయకులు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. నామినేటెడ్ పదవులు రాని నాయకులకు పార్టీ రాష్ట్ర, జిల్లా, గ్రేటర్ కమిటీల్లో అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. ఏప్రిల్ 16న జిల్లా, గ్రేటర్ అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పటికీ ఐదు నెలలుగా పార్టీ కమిటీల ఊసేలేదు. మధ్యలో 51 మందితో కమిటీ ఎంపిక పూర్తిచేసినప్పటికీ చివరి నిమిషంలో బ్రేక్ పడింది. తాజాగా సిఎం ప్రకటనతో నూతన కార్యవర్గాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తారని భావిస్తున్నారు.