Thursday, April 25, 2024

మళ్లీ ఉధృతంగా వీయాలి

- Advertisement -
- Advertisement -

Dr GV Ratnakar poetry Galivana

 

‘In practice, intersectionality functions as kind of caste system, in which people are judged according to how much their particular caste has suffered throughout history ‘
-Arundhati Roy

తెలుగు సాహిత్యంలో దళిత సాహిత్యం గురించి ఆలోచించినపుడు, అక్కడక్కడా చెదురు మదురుగా వచ్చినా, కారంచేడు ఘటన తర్వాతే దళిత సాహిత్యం ఒక స్పష్టమైన రూపు తీసుకున్నదని చెప్పాలి. ప్రభుత్వానికి, అక్కడి అగ్రవర్ణ భూస్వాములకి వ్యతిరేకంగా దళితోద్యమం నిర్మితమయింది. ఆ స్ఫూర్తిని అందుకున్న దళిత సాహిత్యకారులు ఉధృతంగా సృజన చేశారు. దళిత తాత్విక సాహిత్య సిద్ధాంతాలకు ఊపిరి పోశారు. ఆ తర్వాత దళితుల మీద చుండూరు, పదిరి కుప్పం, ప్యాపిలి మొదలైన ఎన్నో చోట్ల జరిగిన దాడులకు ముఖ్యంగా కవిత్వంలో నిరసన, తిరుగుబాటు, ప్రతిఘటన చూయించారు.

ప్రతి కాలం అవసరాలకు తగ్గట్టుగా వనరులను సృష్టించుకుంటుంది. అలానే దళిత ఉద్యమం తన అవసరాలకు తగ్గ కవులు, కథకులు, గాయకులు, ఉద్యమకారులను తయారు చేసుకుంది. దళిత ఉద్యమ అవసరాలకు అనుగుణంగా అలా పుట్టుకొచ్చిన మేలిమి కవులు కథకులు చాలా మంది తెలుగు సాహిత్యం అంతకు ముందు ఎరగని వస్తువులతోటి, వాడ భాషతోటి, విభిన్న శైలులతో ఒక ప్రభంజనంలా దూసుకొచ్చారు. అందులో శివసాగర్, జి.కళ్యాణ రావు, కత్తి పద్మారావు, మద్దూరి నగేష్ బాబు, పైడి తెరేష్ బాబు, కలేకూరి ప్రసాద్, నాగప్ప గారి సుందర్రాజు, శంబుక, కొలకలూరి ఇనాక్, చిలుకూరి దేవపుత్ర, స్వామి, వి.ఆర్. రాసాని, డా.వి.చంద్రశేఖర రావు, గుంటూరు లక్ష్మీ నరసయ్య, పగడాల నాగేందర్, కోయి కోటేశ్వరరావు, డా.జి.వి. రత్నాకర్, సతీష్ చందర్, శిఖామణి ,తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ తదితరులు ఎంతో మంది వున్నారు.

దళిత దృక్కోణం నుంచి తెలుగు సాహిత్యాన్ని నిప్పురవ్వల్లా మండించారు. గద్దర్, వంగపండు, నిసార్, విమలక్క తదితరులు తమ పాటలతో ఆంధ్రప్రదేశ్‌ను హోరెత్తించారు. అయితే ఈ ప్రకంపనలు భారతదేశంలో ముందే మొదలయినయి. మరాఠీ దళిత పాంథర్స్ దేశంలో ఒక కదలిక తెచ్చారు. అనేక మంది కవులు వివక్షకి, అంటరానితనానికి వ్యతిరేకంగా గొంతెత్తారు.
అలాంటి స్వరాలను రికార్డు చేసింది డా.జి.వి.రత్నాకర్ 13 భాషల తెలుగు అనువాద కవిత్వం ‘గాలివాన’. ఇందులో 11 భారతీయ భాషలు కాగా, ఒకటి బంగ్లా, మరొకటి ఇంగ్లీష్.
అప్పటిదాకా తాము మోసపోతున్నామని, అది ఈ దేశంలో అమలయ్యే పుక్కిటి పురాణాల, శాస్త్రాల వలనే అనే ఒక చైతన్యం పొడచూపితే ఒక తిరస్కారంతో అది వ్యక్తమవుతుంది.
‘అదో కాలం చెల్లిన స్మృతి / కొంతమంది పుక్కిటి పురాణం /
దాన్ని మేం ఒప్పుకోం/ అది మమ్మల్ని మోసగించింది.’
డా. నామ్ దేవ్ ( హిందీ )

ఈ స్పృహ నుండి ఈ భూమిక నుండి దళిత ప్రతిఘటన మొదలవుతుంది. అది ఇంకా విస్తరించింది.
‘ప్రతి చోటా అవమానం/ అన్యాయం అత్యాచారం హింస/ దళితుల సామూహిక ఊచకోత/ కాలుతున్న గుడిసెలు పల్లెలు/ దోచబడుతున్న సంపద/ సామూహిక అత్యాచారాలు/ కళ్లలో వేడి శూలాలు/ చెవుల్లో మండే సీసం/ నోరులేని పీడిత ప్రజలు /
శతాబ్దాలుగా వేదనని అనుభవిస్తున్నారు’
సుశీలా టాక్ భౌరే ( హిందీ )
‘పిడికెడు మెతుకులు/ దోసెడు నీళ్లు,ఆరడుగుల నేల / అడిగిన నేరానికి / బతుకులు బజారు పాలౌతున్నాయి’ నామ్ దేవ్ ఢసాల్ ( మరాఠీ )
తమ మీద హిందూ అగ్రవర్ణాలు ఆధిపత్యం చెలాయించడానికి హిందూ ధర్మశాస్త్రాలు, మతం కారణం అని తెలుసుకున్న తర్వాత, దాని నుంచి బయటపడి, ఆ పురాణాల ఔచిత్యాన్ని ప్రశ్నించే తెలివి తెచ్చుకుంటారు. ఆ మూలాలు ధ్వంసంలోనే
తమ విముక్తి, వికాసం వుందని గ్రహించారు. అందుకే వాటి విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు.
‘నువ్వు రోజూ దేవుని పేరుతో / పంచభక్ష్య పరమాన్న మౌతున్నావు/ మేము మా వారసత్వం/ తుంగభద్ర కాల్వల్లో తొక్కివేయబడుతుంది.

నువ్వు నైవేద్యంగా హుండీలో/ బంగారు కిరీటాలు పొందుతున్నావు / మా శవాలు ఇసుకలో తొక్కబడిన/ కారంచేడు లౌతున్నాయి’ — ప్రొ. అరుణ్ కాంబ్లే ( మరాఠీ )
‘నువ్వు చెప్పావు / బ్రహ్మ పాదాల నుండి శూద్రుడు/ తల నుండి బ్రాహ్మణుడు పుట్టారని/ అతడు తిరిగి నిన్ను అడగలేదు /
మరి బ్రహ్మ ఎక్కడనుండి పుట్టారని’ –
ఓం ప్రకాష్ వాల్మీకి (హిందీ )

ఈ ఎరుక, ఈ తెలివిడి వచ్చిన తర్వాత పొరలు పొరలుగా దేశంలో వేళ్లూనుకున్న హిందూమత ఆధిపత్య ధర్మశాస్త్రాల చెర నుండి, ఆర్థిక దోపిడీ నుండి విముక్తి పొందాలని, తమ సొంత అస్తిత్వం కోసం పోరాడాలని అనిపిస్తుంది. ఏది అవసరమయినదో తెలుస్తుంది.
‘కాల గమనంలో / తెలివితో జ్ఞానంతో / సందర్భాలు మారుతుంటాయి / కానీ ఈ అజ్ఞానపు శిష్యులు / ఎప్పుడు తెలుసుకుంటారో / భక్తి కన్నా మిన్న జ్ఞానం/ మూఢభక్తి కన్నా మిన్న చైతన్యం/ మందిరాలు మనకొద్దు/ విద్యాలయాల తలపులు తెరిపించండి’
సుశీలా టాక్ భౌరే ( హిందీ )

తిరుగుబాటు విప్లవానికి దారి తీయడం ఎంతోసేపు పట్టదు. పిడికిళ్లు ఆయుధాలై కదం తొక్కడం చూడండి.
‘వాళ్లు గొంతు గర్జిస్తే / వీళ్ల గొంతుకి వెలక్కాయ అడ్డం పడింది/
వాళ్ల అరుపు వినగానే వీళ్ల నోరెండిపోయింది/ విప్లవాల గాలివానలో నా జనం చేయి చేయి కలిపారు.
తిరుగుబాటు సముద్రంలో కలిసి / వేల నదులు పొంగి పల్లవించాయి’ -ప్రొ. సిద్ధలింగయ్య ( కన్నడం )
ఇది ఈ విప్లవ ధోరణి అంత త్వరగా అలవడలేదు భారతదేశ పీడిత ప్రజలకి. అంబేడ్కర్ మార్గం చూయించాడు. తన అవిశ్రాంత రచనల ద్వారా దేశంలోని అసంఖ్యాక బడుగు వర్గాలకి మార్గ నిర్దేశం చేసాడు. దేశంలో కుల మతాలు అంతరించాలంటే వాళ్ల మెదళ్లలో తిష్ట వేసుకున్న మతం, అది నేర్పిన మూఢత్వం పోవాలంటారు.‘ All the same it must be recognized that the Hindus observe caste not because they are inhuman or wrong headed. They observed caste because they are deeply religious’ అని అందుకే డా. అంబేడ్కర్ అన్నారు. ఇది ఒక్క హిందువులకే కాదు అన్ని మతాలకు వర్తిస్తుంది.

అంబేడ్కర్ దళితుల విముక్తికి అపార కృషి చేశారు. రాజ్యాంగంలో దళితుల రక్షణకు, ఉన్నతికి, ఆత్మ గౌరవానికి సంబంధించిన ప్రకరణాలు పొందు పరిచారు. అంతకు ముందు లేని ఎన్నో హక్కులు, చట్టాలు కల్పించారు. ఈ స్ఫూర్తితో చదువుల వెలుగులోకి ఎన్నో శ్రామిక కులాలు వచ్చాయి. బడి మెట్లు, కాలేజీల ప్రాంగణాల, విశ్వవిద్యాలయాలలోకి అడుగులు వేయగలిగారు. అంబేడ్కర్‌ని స్మరించుకుంటూ ఆయన కృషిని తలచుకుంటూ రాసిన చాలా కవితలు ఇందులో వున్నాయి.
అంబేడ్కర్ సూచించిన బుద్ధు,- ఫూలే – బోధనల సారాంశం సమీకరించు- బోధించు- పోరాడు తాత్విక భూమిక ఆధారంగానే ఈనాడు దళిత వర్గాలు ముందుకు వెళుతున్నాయి. విద్య అన్ని అవకారాలను దూరం చేస్తుందనీ, ఆత్మగౌరవం మనలని పోరాట దిశగా మలుపుతుందని ఆయన నమ్మారు. ఒక గౌరవ ప్రదమయిన జీవితం కోసం, ముందు తరాల భవిష్యత్తు కోసం ఆయన శ్రమించారు.

దీనిని అందిపుచ్చుకున్న చదువుకున్న కవులు తిరగబడ్డారు. లాటిన్ అమెరికన్ బ్లాక్ పాంథర్స్ లాగా భారతదేశంలో కూడా 1972 ప్రాంతంలో దళిత్ పాంథర్స్ మూవ్‌మెంట్ ప్రారంభమైంది. అది మెల్లగా విస్తరించి ప్రాంతాలకు అనుగుణంగా మారుతూ కర్ణాటకలో దళిత్ సంఘర్ష సమితిగా సిద్ధలింగయ్య తదితరుల ఆధ్వర్యంలో ఆవిర్భవించింది. 1985 కారంచేడు సంఘటనతో ఆంధ్రాలో కూడా దళితుల తిరుగుబాటు ఒక ఉద్యమ రూపం దాల్చింది. అది మొదలుకొని 2000 సంవత్సరం దాకా ప్రభావవంతంగా సాగింది.

ఆ కృషిలో భాగం గానే డా.జి.వి.రత్నాకర్ ‘గాలివాన’ అనువాద కవితల పుస్తకం తెచ్చారు. దీనిలో హిందీ, గుజరాతీ, అస్సామీ, కన్నడం, మలయాళం, ఉర్దూ, మరాఠీ, తమిళం, ఒరియా, పంజాబీ, భోజ్పురి భారతీయ భాషలు, బంగ్లా, ఇంగ్లీషు లాంటి అన్య దేశాల భాషల తెలుగు అనువాద కవిత్వం వుంది.

ఈ కవిత్వం చదివితే ఇదేమీ వేరే భాషల, ప్రాంతాల, వ్యక్తుల జీవితాల వ్యథలు కావు. అచ్చంగా ఇవి మన జీవితాలే అనిపిస్తాయి. ఎక్కడకి పోయినా కళ్లపడే అమానుషత్వం కులమే అనిపిస్తుంది. ‘రాష్ట్రపతి భవనంలో పంది’ లాంటి వ్యక్తీకరణలు మన ధిక్కారకవి మద్దూరి నగేష్ బాబుని జ్ఞాపకం చేస్తాయి. ఇతర ప్రాంతాల దళిత వ్యక్తీకరణల కోసం మనం ఈ పుస్తకం చదవాల్సిందే. కవిత్వం పాలు తక్కువగా వున్నా, ఆవేశ అభివ్యక్తి పాలు ఎక్కువ వుంది.

ఈ పుస్తకానికి తుల్లిమల్లి విల్సన్ సుధాకర్, డా.ఖాజా, నేతల ప్రతాప్ కుమార్ లాంటి దళిత కవులు ఆప్తవాక్యాలు కురిపించారు. ముందు మాటలలో ప్రొ. గుజ్జరమూడి కృపాచారి మరాఠీ దళిత్ పాంథర్స్ స్థాపించిన నామ్ దేవ్ ఢసాల్ గురించిన సమాచారం, చరిత్ర ఇచ్చారు. డా.ఎన్.గోపి ఇలాంటి ప్రయత్నాలు విశ్వవిద్యాలయాలలో మరింత జరగాలని ఆకాంక్షిస్తూ..‘రత్నాకర్‌కు ఒక జీవన దృక్పథం ఉండడం వల్ల కూడా ఈ అనువదాలు శ్రద్ధా పరిపుష్టంగా కుడా కుదిరాయి’ అని కితాబిచ్చారు.

అనువాదాల విషయంలో అదీ హిందీ నుంచి తెలుగు చేయడం, తెలుగు నుంచి హిందీ చేయడం డా.జి.వి.రత్నాకర్ కు ఇరవై యేళ్ల సుదీర్ఘ అనుభవం వుంది.’ అనువాదం ఒక త్యాగం’ అన్నారు గోపి. నిజమే అలాంటి త్యాగాన్ని ఇన్నేళ్లుగా ఏ పటాటోపం లేకుండా నిశ్శబ్దంగా చేసుకుపోతున్నారు రత్నాకర్. దళిత జీవన స్థితిగతులపై వీచిన ఈ గాలివాన తన గుర్తులు వదిలి వెళ్తుంది.

అయితే.. మతతత్వ శక్తులు రాజ్యమేలుతూ.. అన్నింటా మనుస్మృతులే అమలు చేస్తూ, ప్రశ్నించిన వారిని ఖైదు చేస్తూ, దళితులపై, మైనార్టీలపై అమానుష హత్యాకాండ అమలు చేస్తూ, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితులలో దళితుల కార్యాచరణ ఏమిటి? మతంలో కళ్లు మూసుకుపోతూ ఏ దారుణానికి స్పందించని బలహీన వర్గాల ప్రకలను చైతన్యం చేసే దారేది?

దోపిడీ కులాల రాజకీయ పార్టీలలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న దళిత నాయకత్వం విముక్తి ఎప్పుడు? రాజ్యాధికారమే లక్ష్యంగా పీడిత వర్గాలు పని చేయాలని ఉద్యమించాలని అంబేడ్కర్ పిలుపు, కల నెరవేరేదెపుడు?
గతం కన్నా ప్రస్తుతం దళిత ప్రజానీకం మునుపెన్నడూ లేని విధంగా పెను సవాళ్లు ఎదుర్కొంటోంది.పెను మార్పులకు అతలాకుతలం అవుతోంది. ఈ మార్పులకు తగ్గట్టు దళిత కవిత్వం, సాహిత్యం తన పంథా మార్చుకుందా..? జరుగుతున్న దుర్మార్గాల మీద తన తిరుగుబాటు చేస్తోందా?

నేటి దళిత కవులు నూకతోటి రవికుమార్, ఎజ్రాశాస్త్రి, రత్నాజీ, సోని, పల్లిపట్టు, నాగిళ్ల రమేష్, తగుళ్ల గోపాల్, మెట్టా నాగేశ్వరరావు, ముస్లిమ్ సాహిత్యానికి సంబంధించి స్కై, షాజహానా, నబి, సాబిర్, రసూల్, నిర్గుణ్ లాంటి వాళ్లు మంచి కవిత్వం ఇప్పటికే రాస్తున్నా, ఈ పోకడలను గుర్తించి మరింత ప్రత్యామ్నాయ సాహిత్యం సృష్టించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతోవుంది. దానికి ఈ పుస్తకం ఏ మాత్రం పురికొల్పినా ఈ పుస్తక లక్ష్యం నెరవేరినట్టే.
ఇటీవల కనుమూసిన దళితకవి సిద్ధలింగయ్య ప్రసిద్ధ కవిత ‘గాలివాన’ తో ఈ పుస్తకం ప్రారంభం కావడం కాకతాళీయం అయినా బావుంది.
‘ If education does not create a need for the best in life, then we are stuck in an undemocratic, rigid caste society’ Sargent Shiver

                                                                               పి.శ్రీనివాస్ గౌడ్
                                                                               9949429449

                                                                              గాలివాన (13 భాషల
                                                                                అనువాద కవిత్వం)
                                                                         అనువాదం: డా.జి.వి.రత్నాకర్
                                                                           ప్రతులకు: 7013507228
                                                                         భూమి బుక్ ట్రస్ట్, వెల : 120/-

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News