Thursday, April 25, 2024

నలిమెల పలుకు తళుకులు

- Advertisement -
- Advertisement -

Dr. Nalimela Bhaskar works on Telangana language

 

మాతృభాష మాధుర్యం ఆస్వాదించాలనే ఆలోచన ఉందా? తెలుగుు మాటల పరిమళాల్ని ఆఘ్రాణించాలని అనుకుంటున్నారా? అమ్మ నుడుల కమ్మదనం అనుభవించాలన్న తలంపు ఉందా? జాను తెనుగు జాణతనం చూడాలనుకుంటున్నారా?… పల్లెల్లోకి పదండి – ఇది డా॥ నలిమెల భాస్కర్ ఇచ్చిన పిలుపు.

మాతృభాష తెలుగంటే జానపదుల గుండె కొండల్లోంచి సహజసిద్ధంగా దూకే సెలయేరు. నిసర్గ సుందర జలపాతం.. వేపచెట్టు గాలి పీల్చినట్లు, మర్రి చెట్టు నీడన విశ్రమించినట్లు, వెనుకటి వాగులో అప్పటికప్పుడు చెలమ తోడుకొని దూప తీర్చుకున్నట్లు, కట్టెల పొయ్యి మీది వంటను ఆవురావురుమని ఆరగించినట్లు అత్యంత స్వాభావికమైనది తెలుగు భాష అని భాస్కర్ భావన.
తల్లిదండ్రులు తెలుగు. అమ్మానాన్నలు తెలుగు. అవ్వయ్యలు సిసలైన తెలుగు. జననీ జనకులు తెలుగు కాదు. జననీ ! ఎట్లున్నావు? జనకా! వందనాలు – వంటి మాటలు తెచ్చి పెట్టుకున్నట్లుగా ఉంటాయి. నిజమైన తెలుగు పల్లెల్లో ఉంది. పల్లె ప్రజల మాటలు తెలుగు తనానికి ఆటపట్టులు, తీయని తేనెపట్టులు – అని తెలియజేస్తాడు. నలిమెల భాస్కర్ రాసిన తెలంగాణ భాష – దేశ్య పదాలు చదివితే తెలుగుకున్న ప్రత్యేకతలన్నీ తెలంగాణ తెలుగుకున్నాయని, దేశ్యపదాల సౌరభం తెలంగాణ తెలుగులో గుుబాళిస్తుందని, దేశ్య పదాలు తెలంగాణ పల్లెల్లో – ముఖ్యంగా చదువురాని వాళ్ల నోళ్లల్లో చక్కగా నానుతున్నాయని తెలుస్తుంది.

అటు ప్రక్క, ఇటు ప్రక్క అనడం కన్న అటాంకల, ఇటాంకల అంటే ఎంత బాగుంది! ద్రాక్ష, అప్పగింతలు, ఆడపడుచు, చామనఛాయ, చారికలు, వెండ్రుకలు, ప్రసవం, ఎండు ద్రాక్షలు, కునికిపాట్లు, క్రీనీడ, తలంబ్రాలు, గ్రుక్కిళ్ళు మింగు, ఆనందాతిశయంతో రావడం, పెళ్లికొడుకు అనే పదాలకు బదులు తెలంగాణ జానపదులు వాడే అంగూర్లు, అంపుకాలు, ఆడిబిడ్డ, సామనలుపు, సార్కలు, ఎంటికెలు, కానుపు, కిసుమీసులు, కూర్పాట్లు, కైనీడ, తల్వాలు, గుటికిల్లు మింగు, చెంగలిచ్చుడు, పెండ్లి పిలగాడు – మాటలు ఎంతో తేలికగా అర్థమవుతాయి. కౌగిలించుకొను, పరిష్వంగములోనికి తీసుకొను, ఆశ్లేషించుకొను, వాటేసుకొను అనడం కన్న ‘అలుముకొను” అనేది ఎంతో బాగుంటుంది. వాక్యాలలో కూడా భూమి కంపించింది, సూర్యుడు అస్తమించాడు అనడం కన్న భూమి అదిలింది, పొద్దు గుంకింది అనేవే బాగుంటాయి. ఇటువంటి వాటిని వివరిస్తూ భాస్కర్ దేశిపదాల అందాలను అందించే తీరు పసందుగా ఉంటుంది.‘అత్తర బుత్తర’ పదాలలో అత్తరం అంటే తొందర. బిత్తరం అంటే చంచలం. తెలుగు భాషలోని ‘మెట్లు’ తెలంగాణలో ‘తంతెలు’. మెట్టబడేది మెట్టు.

కొత్త కోడలు తన కుడికాలు మెట్టుతూ అత్తవారింట అడుగుపెట్టడం వల్ల అది మెట్టినిల్లు అయింది. మరి తంతెలు – తంతే పడి ఉండేవి తంతెలా అని ఆలోచించాలి. ఉప్పును కారమును చేర్చి మామిడికాయలు లోనగుు వాటిని రోటిలో వేసి రోకలితో తొక్కడం వల్ల మెత్తగా మారి ముద్దగా అయ్యేది ‘తొక్కు’. పరచుకొని ఉండేది పరుపు. మెత్తగా ఉండేది మెత్త. చల్లగా ఉండేది చల్ల. ఎర్రగా ఉండేది ఎర్ర. ఇలా- తెలంగాణ తెలుగు అర్థవంతమైన భాష అని, వ్యుత్పత్తికి అందేమాటలు అనేకం ఉంటాయని భాస్కర్ వివరిస్తుంటే ఆశ్చర్యానికీ, ఆనందానికీ లోనవుతాం. ఎప్పుడో నన్నయాది ప్రాచీన పద్యకవులు తమ రచనల్లో వాడిన పదాలు, వాక్య విన్యాసాలు తెలంగాణ ప్రజల నోళ్లల్లో వింటాం అంటూ “ఇప్పుడ యెటొబోయె” అనే వాక్యం ‘ఇప్పుడే ఎటో పాయె’ అని తెలంగాణలో విన్పిస్తుందంటాడు. ‘బొమిక’ పదం గురిం చి రాస్తూ, ఆముక్త మాల్యద లోని పద్యపాదాన్ని ఉదహరిస్తూ, ఆ పదం తెలంగాణలో ‘బొక్క’ అయిందంటాడు. ‘నిలుకడ’ గురించి రాస్తూ పెద్దన చెప్పిన ‘నిలుకడ వల యు కృతికి’ అనే వాక్యాన్ని ఉటంకిస్తాడు. వీటన్నిటిని చూస్తే భాస్కర్ ఎంత అధ్యయనశీలియో తెలుస్తుంది.

తెలంగాణ పల్లెవాసుల సంభాషణల్లో, సరస సల్లాపాల్లో, కోపతాపాల్లో దేశ్యాల పాళ్ళే ఎక్కువ. ఈ పద ప్రయోగాలు గుండె లోతుల్లోంచి వచ్చే నిర్మల ప్రవాహాలు, మమతానురాగాలు వెల్లివిరిసే తల్లి పలుకులు – అంటూ పలు పదాలను సోదాహరణంగా వివరిస్తాడు.

‘మెయి’ అనేది తెలంగాణలో ‘పెయి’ అయింది. పెయి కాక అంటే జ్వరం. పెయి సబ్బు అంటే టాయ్‌లెట్ సోప్. స్నానం చేయడమంటే పెయి కడుక్కునుడు. ‘బుగులు’ పదాన్ని గురించి రాస్తూ – తెలుగుులో ఉన్న గుబులు పదానికి ఏ భయం వేసిందో కాని తెలంగాణలో అది వర్ణ వ్యత్యయంతో ‘గుబులు’ అయ్యిందంటాడు. ‘పొయ్యి రాజేసినవా’ అనే మాటలో ‘రాజు’ అనే దేశిక్రియ రాజులాంటి మాట అంటాడు. రువ్వితే ఎంత వడితో పోతుందో అంత వేగం ‘రువ్వడి’ అంటాడు. పోరడు, పోరి అనే పదాలు దురదృష్టవశాత్తు నిందార్థంలో వాడబడుతున్నాయని, నిజానికి ఇవి భాషా గౌరవానికి అర్హమైన మాటలు అని తెలియజేస్తాడు.

‘ఓపికమంతుడు’లో ఓపిక తెలుగు. మంతుడు సంస్కృతం. ప్రజలు గొప్ప పనిమంతులు గనుక యిట్లాంటి మిశ్ర సమాసాలు యథేచ్ఛగాచేసేస్తారని, ఓపికమంతురాలు అనడం కూడ ఎంతో ఉచితంగా ఉందంటాడు. అన్నం, ఆహారం సంస్కృత పదాలు. బువ్వ, కూడు అనేవి తెలుగుు. కుడిచేయిని బువ్వచేయి అని పిలుస్తారు. కుడిచే చేయి కుడిచేయి అయినప్పుడు, బువ్వను భుజించే చేయి బువ్వ చేయి కాదా! పదాలను అద్భుతంగా సృష్టించగల్గిన నేర్పు ప్రజలది అని కితాబిస్తాడు.

ఈతకల్లూ, తాటికల్లూ తెల్లగా ఉంటాయి కాబట్టి వాటిని తెల్ల కల్లు అని, సారాయి నీళ్లలా నల్లగా ఉంటుంది కాబట్టి నల్లకల్లు అని అంటారు. వాళ్ల ఆలోచనాశక్తి, ఊహాశాలిత, తమాషా సమాస కల్పనలు చదువుకున్న వాళ్లకు అందవుగాక అందవు అని జానపదులను మెచ్చుకుంటాడు.పకపక నవ్వడం తెలంగాణలో పక్కడపక్కడ నవ్వుడు అయింది. చెంగు చెంగున గెంతడం అనేది చెంగడ బింగడ దుంకుడు అయ్యింది అని అందంగా చెబుతాడు.పల్లీయులు వాడే కొన్ని పదాలలో సృజనాత్మకత ఉంటే – భాస్కర్ కొన్ని పదాలకు చేసే వ్యాఖ్యానాలలో కూడా సృజనాత్మకత ఉంటుంది.

ముక్కుకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరపడానికి వీలుగా ఉండే రంధ్రాలను తెలంగాణలో ‘ముక్కు చెలమలు’ అంటారు. నిజానికవి ‘చరమలు’. ఎవరు ఎవలు అయినట్లు చెరమల్ని చెలమలుగా పలుకడంలో కొంత కవితాత్మకత ఉంది. అవి ముక్కుకు ముందు భాగాల్లో అమరిన చిన్నపాటి చెలమలే కదా అని వ్యాఖ్యానిస్తాడు భాస్కర్.

‘పెన్ను గోరంగ కక్కుతుంది’ అనే మాటలో ‘కక్కు’ అంటే కడుపులోనిది వెలిపుచ్చడం. కలాల కడుపుల్లోంచి వెడలిరావడం కనుక పెన్ను కక్కడం అన్నమాట. అసలు కలం కక్కడం అనేది ఎంత కళాత్మకం! మరెంత కవితాత్మకం! ఇంకెంత సృజనాత్మకం! అంటాడు భాస్కర్. ‘వాడికి నెత్తెంటికెలు నడిసినై’ అంటుంటారు. నడవడం అనేది తమాషా మాట. బాల్యం కొంత ముందుకు జరిగి యవ్వనం అవుతుంది. జవ్వనం మరింత మున్ముందుకు నడిచి ముదిమి వస్తుంది. మరి నల్లని వెంట్రుకలు ఈ ప్రావస్థల్ని దాటి తెలుపు రంగులోనికి నడిచి వచ్చాయి. కనుకే ‘నడుసుడు’ అనే క్రియను వాడుతున్నారు గ్రామీణులు. వెంట్రుకలు నడవడం కవితాత్మకతకు నిదర్శనం. గ్రామీణుల మాటకు భాస్కర్ చేసిన అద్భుతమైన వ్యాఖ్యానమిది. కొన్ని పదాలను వివరించేటప్పుడు వ్యాధుల గుురించి, ఆరోగ్యము గురించి భాస్కర్‌కున్న పరిజ్ఞానం తెలుస్తుంది. కాళ్ళు చెడుడు అంటే నీళ్ళవల్ల తడిసి వుబ్బి పగుళ్ళు వారడం.

ముఖ్యంగా చక్కెర వ్యాధిగ్రస్తులకు – అని ఆరోగ్యం పట్ల అవగాహన కల్గిస్తాడు. కడుపు శూల వ్యాధిని తెలంగాణలో కడుపంత ‘కుట్టు’ పట్టినట్టున్నది అంటారు. గవదబిళ్ళలు, టాన్సిల్స్‌ను కుతికెలు వచ్చినై, చెంపలు వచ్చినై అని పిలుస్తారంటూనే ఆ వ్యాధుల లక్షణాల్ని వివరిస్తాడు. గగ్గోడు, గుత్తర వంటి వ్యాధుల్నీ ప్రస్తావిస్తాడు.కొన్ని పదాల వివరణలో మన సంస్కృతి, ఆచార వ్యవహారాలూ తెలుస్తాయి.‘కట్టుచారు’ నూతన సంవత్సరాది నాడు దాదాపు ప్రతి కుటుంబంలో ఉంటుంది. ఉగాది లాంటి పండుగే తెలంగాణలో మరొకటి ‘కొత్త పండుగ’ ఉంది. కొత్తగా పంటలు పండి ఇంటికి వచ్చిన సందర్భంలో కొత్త బియ్యాన్ని వండుకుంటారు. కుందెన, కుదురు, రోలు వంటి వాటిని సున్నము, జాజులతో అలంకరిస్తారు. ఇంటిల్లిపాదీ కష్టసుఖాలు చెప్పుకుంటూ కలిసి భుజిస్తారు. పెళ్లికి ముందు జరిగే నిశ్చితార్థం తెలంగాణలో ‘పైడి ముడుసుడు’ – అంటే ఆ రోజు చేసుకునే ‘మాట ముచ్చట’.

భాష గురించి రాసినా భాస్కర్ సమాజానికి దూరంగా పోడు. పదాలకు ఇచ్చే వివరణలో కూడ సామాజికత తొంగి చూస్తుంది. భిక్షుకులు అడిగే ‘పాతశింపు’ మనకు పాతదైన చిరుగుు కావచ్చును కానీ, పాపం యాచకులకు మెరుగైన గుడ్డ – అని పాఠకులకు – దానం చేయాలనే గుణాన్ని కలిగిస్తాడు.‘చిల్లరకాడు’ అనే మాట ఉంది సామాన్యుడు అనే అర్థంలో. నేడు సామాన్యుడు మహామాన్యుడై, అలగా జనం వెలిగే జనమై భాసిల్లుతున్న కాలం అని సామాన్యునికి పట్టం కడతాడు. కాపోల్లు, కాపుదనపోల్లు అనే మాటల్లోని ‘కాపు’ పరిశీలన చేస్తూ – పంట పెట్టువాడు కాపు.

పంటను పెట్టి ఇంటికి చేరేవరకు దాన్ని కాపు కాసేవాడు కాపు. తర్వాత్తర్వాత ఆ పదం ఒక సామాజిక వర్గాన్ని సూచించేదిగా మారిపోయింది. కాపోల్లు అంటే కాపువాళ్లు. కాపుదనపోల్లు అంటే కాపుదనము కలవాళ్లు. కాపుదనము అంటే కాపలా కాసే గుణము అని విశదీకరిస్తాడు. యాల్లాటలు అంటే వ్రేలాడుటలు అని చెబుతూ రైతులు తెల్లారి లేచేవరకు చెట్టుకు యాల్లాడుతూ కనిపించడం దుర్భరం అని చెప్పిన తీరు హృదయాన్ని ద్రవింప చేస్తుంది. గ్రామీణులు వాళ్ల బతుకేదో వాళ్లు బతుకుతూ కాదు చస్తూ మనల్ని జీవింప చేస్తున్న త్యాగమూర్తులు అంటూ జోహారులర్పిస్తాడు. ఆ నల్ల బట్టలవాళ్లు సృష్టించే ధాన్యరాశులే ఈ తెల్లగుుడ్డల ఆకలిని పోకార్చు తున్నదనే సోయి ఉండాలంటాడు.

అక్కడక్కడ భాస్కర్ రాసే ఒక్కొక్క వాక్యమే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మచ్చుకు కొన్ని –
‘అచ్చు కాయిదం అచ్చంగా తెలుగుు దేశ్యం’.
‘అసలు పదం అసలు సిసలు దేశ్యపదం’.
‘పొద్దు’ ముద్దుగా ఉన్న తెలుగుుమాట.
‘తావు’ ఎంత మంచి తెలుగుు తావి కల్గిన పదం.
‘ముచ్చట’ ఎంత చక్కటి ముచ్చటపడే తెలుగు దేశిపదం.
‘నిగనిగ’ చక్కగా నిగనిగలాడుతున్న తెలుగు మాట.

కొన్నిచోట్ల పదాల వివరణ మనకు హత్తుకునేటట్లు చేయడానికి ‘మంత్రాల బలం కన్న తుంపిళ్ల బలం ఎక్కువ’. ‘చదువు చారెడు బలపాలు దోసెడు’, ‘కొత్త అంత పండుగ లేదు – అల్లుని అంత చుట్టము లేడు’ మొదలైన సామెతలను సందర్భోచితముగా ఉపయోగిస్తాడు.

నలిమెల భాస్కర్ కోరినట్లు పెద్ద మనస్సుతో కవులూ, రచయితలందరూ పల్లె ప్రజలు వాడే పదాల్ని తమ రచనల్లో విరివిగా వాడాలి. ఆ పదాల మీద పరిశోధనా వెలుగులు ప్రసరింప చేస్తే తెలుగుు భాష తళుకులన్నీ తెలుస్తాయి. పాఠకులకు దేశిపదాలు వాడాలనే అభిలాష కలిగేలా, పల్లెల మీద మమకారం పెరిగేలా, సామాన్యుని మాన్యుని చేసేలా, శ్రమైక జీవన సౌందర్యం విలువ తెలిసేలా “తెలంగాణ భాష దేశ్య పదాలు” గ్రంథం రచించిన డా॥ నలిమెల భాస్కర్ అభినందనీయుడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News