Home తాజా వార్తలు డా.రెడ్డీస్ అదుర్స్

డా.రెడ్డీస్ అదుర్స్

Dr Reddy's Q3 net profit up 3,468% at Rs 707 cr

 

క్యూ3లో నికర లాభం రూ.707 కోట్లు
గతేడాదితో పోలిస్తే రూ.3,468% పెరిగింది..

మన తెలంగాణ/ హైదరాబాద్ : డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ ల్యాబ్ అద్భుతంగా రాణించింది. సేల్స్ పెరగడంతో క్యూ3(అక్టోబర్‌డిసెంబర్)లో సంస్థ నికర లాభం రూ.707 కోట్లతో ఏకంగా 3,468 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.20 కోట్లు మాత్రమే ఉంది. డా.రెడ్డీస్ ల్యాబ్ ఆదాయం రూ.4,923 కోట్ల నుంచి రూ.5,320 కోట్లకు అంటే 8 శాతం పెరిగింది. గ్లోబల్ జనరిక్స్ నుంచి రెవెన్యూ రూ.4,075 కోట్ల నుంచి రూ.4,451 కోట్లతో 9 శాతం వృద్ధిని సాధించింది. అదే సమయంలో నార్త్ అమెరికా నుంచి రెవెన్యూ రూ.1,865 కోట్లతో 7 శాతం పెరగ్గా, గతేడాది ఇది రూ.1,739 కోట్లుగా ఉంది.

యూరప్ నుంచి ఆదాయం రూ.414 కోట్ల నుంచి రూ.406 కోట్లకు అంటే 2 శాతం క్షీణించింది. కోవిడ్ వైరస్ విషయానికొస్తే, స్పుత్నిక్ లైట్ కోసం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. తేలికపాటు నుంచి తీవ్రమైన పరిస్థితుల్లో కొవిడ్19 చికిత్స కోసం అనేక ఔషధాలను కంపెనీ అభివృద్ధి చేసింది. ఫలితాలపై డా.రెడ్డీస్ కొచైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.ప్రసాద్ స్పందిస్తూ, ఆరోగ్యకరమైన ఎబిటా, పటిష్ఠమైన క్యాష్ జనరేషన్‌తో క్యూ3లో నిలకడగా వృద్ధిని సాధించామని అన్నారు. అదే సమయంలో వ్యాపారం వృద్ధి కోసం పెట్టుబడులను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటికీ తమకు ఇఎస్‌జి(పర్యావరణ, సామాజిక, పాలన) కీలకమైన అంశాలని అన్నారు.

ఎల్ అండ్ టి లాభం 17% క్షీణత
క్యూ3(అక్టోబర్‌డిసెంబర్)లో కంపెనీ నికర లాభం రూ.2,055 కోట్లతో 17 శాతం క్షీణించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.2,467 కోట్లుగా ఉంది. కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ.35,596 కోట్ల నుంచి రూ.39,563 కోట్లతో 11 శాతం పెరిగింది.

స్వల్పంగా నష్టపోయిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతం శుక్రవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 77 పాయింట్లు కోల్పోయి 57,200 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 17,101 పాయింట్ల వద్ద స్థిరపడింది. రెండు సూచీలు ప్రారంభం నుంచి లాభాల్లో కనిపించినా, ఆఖరి సమయంలో నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతానికి పైగా లాభపడి పాజిటివ్‌గా ముగిశాయి. టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్ స్టాక్స్ నష్టపోయాయి. మరోవైపు ఎన్‌టిపిసి, యుపిఎల్ లిమిటెడ్, సన్‌ఫార్మా, టాటా కన్జూమర్ ప్రోడక్ట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభపడ్డాయి.

Dr Reddy’s Q3 net profit up 3,468% at Rs 707 cr