Home అంతర్జాతీయ వార్తలు అమెరికాను దాటేసిన చైనా

అమెరికాను దాటేసిన చైనా

Dragon that has overtaken the US in 20 years

 

ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా డ్రాగన్
20 ఏళ్లలో మూడు రెట్లయిన ప్రపంచ సంపద
మూడింట రెండు వంతుల సంపద 10 శాతం మంది చేతుల్లోనే
68 శాతం సంపద రియల్ ఎస్టేట్ రంగంలోనే పెట్టుబడి
మెకెన్సీ కన్సల్టెన్సీ పరిశోధనా విభాగం వెల్లడి

జూరిచ్: అమెరికా అంటేనే సంపన్నులకు స్వర్గధామం అనేది అందరూ అనే మాట. అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని చైనా కొట్టేసింది. కేవలం 20 ఏళ్లలోనే ప్రపంచ సంపద మూడు రెట్లు పెరిగింది. ఈ పెరుగుదల ఫలితంగా చైనా ప్రపంచంలోనే సంపన్న దేశంగా ఆవిర్భవించడానికి దారి తీసింది. జూరిచ్‌కు చెందిన మెకెన్సీ అండ్ కో కన్సల్టెన్సీ పరిశోధనా విభాగం ఈ విషయం వెల్లడించింది. ప్రపంచ సంపదలో 60 శాతం కేవలం పది దేశాలకే చెందుతుందని ఆ సంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే చైనా అమెరికాను దాటి ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మారింది. ‘ఇప్పుడు మనం ఎన్నడూ లేనంత సంపన్నులం’ అని మెకన్సీ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ భాగస్వామి జాన్ మిస్చేక్ ఒక ఇంటర్వూలో చెప్పారు. 2000 సంవత్సరంలో 156 ట్రిలియన్ డాలర్లుగా ఉండిన ప్రపంచ సంపద 2020 నాటికి 514 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ పెరుగుదలలో దాదాపు మూడో వంతు చైనాదే కావడం విశేషం.

2000 సంవత్సరంలో కేవలం 7 ట్రిలియన్ డాలర్లుగా ఉండిన ఆ దేశ సంపద 2020 నాటికి ఒక్క సారిగా 120 ట్రిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్య దేశంగా చేరిన తర్వాత చైనా ఆర్థిక వృద్ధి శరవేగంగా జరగడమే దీనికి కారణం. మరో వైపు అమెరికాలో స్థిరాస్తి ధరల పెరుగుదలలో మార్పుల కారణంగా దాని సంపద ఇదే సమయంలో కేవలం 90 ట్రిలియన్ డాలర్లు మాత్రమే పెరిగింది. అమెరికా, చైనా ..ఈ రెండు దేశాల్లోను మూడింట రెండు వంతుల సంపద కేవలం 10 శాతం మంది వద్ద మాత్రమే పోగయి ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రానురాను వారి వాటా ఇంకా పెరుగుతూ ఉందే తప్ప తగ్గడం లేదు. ఇక మెకెన్సీ పరిశోధన ప్రకారం ప్రపంచ సంపదలో 68 శాతం రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉంది. మిగతా మొత్తం ఇన్‌ఫ్రా, మెషినరీ, పరికరాల రంగంలో ఉండగా.. కొద్దిపాటి మొత్తం మాత్రమే మేధో హక్కులు, పేటెంట్లు లాంటి వాటిలో ఉంది. వివిధ కారణాల వల్ల ఫైనాన్షియల్ ఆస్తులను ప్రపంచ సంపదలో చూపించలేదు.

దుష్ప్రభావాలు
ప్రపంచ సంపద గణనీయంగా పెరగడంతో పాటు పలు దుష్ప్రభావాలు(సైడ్‌ఎఫెక్ట్) కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ స్థూల డొమెస్టిక్ ఉత్పత్తి ( జిడిపి)కన్నా ఎక్కువ వేగంతో సంపద పెరగడానికి ప్రధాన కారణం స్థిరాస్తుల ధరలకు రెక్కలు రావడమే. వడ్డీ రేట్లు తగ్గిపోవడంతో బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంసల్లో జనం డబ్బులు దాచుకోవడానికి బదులు స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టారు. ఆస్తుల విలువ వ్యక్తుల దీరకాలిక సగటు ఆదాయాలకన్నా 50 శాతం ఎక్కువ ఉన్నట్లు మెకెన్సీ పరిశోధనలో వెల్లడయింది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి కారణంగా పెరిగిన సంపదతో పాటుగా అన్నిరకాల సైడ్ ఎఫెక్ట్ కూడా తోడవుతున్నాయని మిస్చేక్ అంటున్నారు. రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశానికి చేరుకోవడంతో చాలా మందికి సొంత ఇల్లు అనేది కలగా మారుతోందని, 2008లో అమెరికాలో సంభవించిన ఆర్థిక సంక్షోభం లాంటి ఆర్థిక సంక్షోభాలు తలెత్తే ప్రమాదం పెరిగిపోతుందని ఆయన అంటున్నారు. చైనాలో ఇప్పటికే అలాంటి సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సరయిన పరిష్కారం ఏమిటంటే పెరిగిన ప్రపంచ సంపదను మరింతగా ఉత్పాదకతతో ముడిపడిన రంగాల్లో పెట్టుబడులు పెట్టడమేనని, దీనివల్ల ప్రపంచ జిడిపి మర్తిగా విస్తరిస్తుందని ఆ నివేదిక అభిప్రాయపడింది.

Dragon that has overtaken the US in 20 years