Friday, April 19, 2024

న్యాయవ్యవస్థలో లొసుగులు

- Advertisement -
- Advertisement -

Drawbacks in the Indian Judiciary

 

భారతదేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువాడైన జస్టిస్ ఎన్‌వి రమణను ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్దే సిఫార్స్ చేశారు. సీనియారిటీ దృష్ట్యా చూస్తే జస్టిస్ రమణ తదుపరి ప్రధాన న్యాయమూర్తి కావడానికి అవసరమైన ప్రాథమిక లాంఛనం పూర్తయినట్లే. అయితే కొందరు న్యాయశాస్త్ర పండితులు, అనుభవజ్ఞులు చెబుతున్న దాన్ని బట్టి భారత ప్రధాన న్యాయమూర్తిగా బాబ్దే సిఫార్స్‌ను ప్రభుత్వం కచ్చితంగా అంగీకరించాలన్న నిబంధన లేదు. వారికి ఇష్టం లేకపోతే మరొకరిని ఎంచుకునే సావకాశం ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే ప్రధాన న్యాయమూర్తి తన సిఫార్స్‌లో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తుల పేర్లను ప్రభుత్వ ప్రరిశీలనకు పంపుతారు.

సాధారణ పరిస్థితుల్లో ప్రధాన న్యాయమూర్తి సిఫార్స్ తొంభై తొమ్మిది పాళ్ళు చెల్లే అవకాశమే ఉన్నది. కానీ, ఇక్కడ ఎందుకు సందేహాలు పొడసూపుతున్నాయంటే సుప్రీం సీనియర్ న్యాయమూర్తుల లిస్టులో అమిత్ షా తరపున కేసులు వాదించిన యువి లలిత్ ఉన్నారు. ఆయనంటే అమిత్ షాకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నది. అయితే ఆయన కన్నా ముందు జస్టిస్ నారిమన్ కూడా ఉన్నారు. అమిత్ షా అభీష్టం నెరవేరాలంటే ఇద్దరిని దాటుకుని మూడో స్థానంలో ఉన్న వ్యక్తిని ఎంపిక చెయ్యాలి. అది సాధ్యం అవుతుందా? ఎన్నో దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయాలకు భిన్నంగా మోడీ, అమిత్ షాలు వ్యవహరిస్తారా అనేది ఇక్కడ ఉత్కంఠ కలిగిస్తున్న ప్రశ్న.

ఇక జస్టిస్ రమణపై కొన్ని అవినీతి ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి సాక్ష్యాధారాల వివరాలతో భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక ఫిర్యాదు చేశారు. ఒక పెద్ద రాష్ట్రం ముఖ్యమంత్రి సాక్షాత్తు కాబోయే ప్రధాన న్యాయమూర్తిపై ఫిర్యాదు చేస్తే ఏమి చర్యలు తీసుకున్నారో తెలియదు కానీ, జస్టిస్ రమణ మీద వచ్చిన ఆరోపణలపై రహస్య విచారణ చేశామని, ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని, అందుకే ఆ పిటీషన్‌ను డిస్మిస్ చేశామని, అయితే ఆ వివరాలు బయట పెట్టకూడదంటూ సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ ప్రకటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే తన లేఖలో చేసిన ఆరోపణలతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సుప్రీం కోర్ట్ జగన్మోహన్ రెడ్డిని కోరడం, ఆయన ఆ విధంగా చెయ్యడం కూడా జరిగింది. మరి అలాంటప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన ఫిర్యాదీకి వివరాలు తెలియాల్సిన అవసరం లేదా?

సుప్రీంకోర్టు ఎవరితో విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది? ఎప్పుడు వారు విచారించారు? ఎవరి దగ్గర వివరాలు తీసుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మోపిన ఆరోపణలపై వివరాలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులనే సంప్రదించాలి కదా? అలా చేస్తే ముఖ్యమంత్రికి తెలియకుండా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సుప్రీంకోర్టుకు ఎలా వివరాలు అందజేస్తారు? గోప్యత పేరుతో సుప్రీంకోర్టు వివరాలను దాచడాన్ని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా తప్పు పట్టారు.

ఇక్కడ ఉత్కంఠ కలిగిస్తున్న అంశమేమిటంటే సుప్రీంకోర్టు రహస్యంగా చేసిన దర్యాప్తు ఫలితాలు ప్రధానమంత్రికి, కేబినెట్‌కు తెలుసా? ఒకవేళ వారికి తెలియదనుకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ ను కేబినెట్, రాష్ట్రపతి ఆమోదించాల్సిందేనా? ఇప్పుడు సరిగ్గా ఈ పాయింట్ నే మోడీ, అమిత్ షా లు కొంచెం సీరియస్ గా తీసుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని ప్రమోట్ చేయడానికి విముఖత వ్యక్తం చేసే అవకాశం లేదా? చేయాలి అని అనుకుంటే మాత్రం జస్టిస్ రమణ నియామకం ఆగిపోవచ్చేమో? అయితే ఏదైనా మిరకిల్ జరిగితే తప్ప ఇలాంటివి సంభవం కావు.

ఇక్కడ న్యాయ నిపుణులు ప్రస్తావిస్తున్న మరొక విషయం ఏమిటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఆరోపణల పట్ల సుప్రీంకోర్టు ఇంత రహస్య విచారణ ఎందుకు జరపాలి? బహిరంగంగానే జరిపి ఆ వివరాలను బయల్పరచి జస్టిస్ రమణ మీద వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమని, ఆయన నిరపరాధి అని సర్టిఫికెట్ ఇవ్వవచ్చు కదా? అలా ఇవ్వడం జస్టిస్ రమణకు మరింత ఖ్యాతి తెచ్చే అంశం కదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లిఖితపూర్వక ఫిర్యాదుకే విలువ లేకపోతే ఇక సామాన్యుడికి కోర్టుల్లో న్యాయం ఎలా జరుగుతుంది అని పెదవి విరుస్తున్నారు. ఎంతోమంది ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకులు, జయలలిత, లాలూ ప్రసాద్, చివరకు పివి నరసింహారావు లాంటి ప్రధానమంత్రి పై వచ్చిన ఆరోపణలను కూడా బహిరంగంగా విచారణ జరిపినపుడు ఒక న్యాయమూర్తి విషయంలో రహస్యం దేనికని ప్రశ్నిస్తున్నారు.

అసలు న్యాయ వ్యవస్థలోనే అనేక లొసుగులు ఉన్నాయని, న్యాయమూర్తుల నియామకాలు పారదర్శకంగా జరగడం లేదని మేధావులు ఎన్నాళ్ళ నుంచో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యవస్థ మొత్తాన్ని శాసించే స్థాయికి వెళ్లే వారు నిస్సందేహంగా అత్యంత నిజాయితీపరులే కాకుండా, ఆ వ్యవస్థలో పని చేసే ఉన్నతాధికారుల కన్నా మరింకేదో గొప్ప అర్హత కలిగి ఉండాలి అని చాలా మంది అభిప్రాయం. ఉదాహరణకు చెప్పాలంటే న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకాలు జరిపేటపుడు వారికి న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉన్నదా లేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నదా, వారు ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు, ఎలాంటి కేసులు వాదించారు, ఎన్ని గెలిచారు అని చూస్తున్నారు తప్ప సాధారణ న్యాయవాదులకన్నా వారు ఇంకా ఎక్కువ అర్హతలు ఏమి సాధించారు అని చూడటం లేదు. వారు న్యాయశాస్త్రంలో పిహెచ్‌డి చేయడం, న్యాయశాస్త్రానికి సంబంధించి పరిశోధనలు చేశారా, పుస్తకాలు రచించారా? వారు గెలిచిన కేసుల గూర్చి ఎవరైనా రెఫెరెన్స్‌గా తీసుకుని పరిశోధనలు చేస్తున్నారా అనే అంశాలను నియామకాలు చేసేవారు పట్టించుకోవడం లేదు. అలాగే విదేశాల రాజ్యాంగాలు ఎలా ఉన్నాయి, అక్కడి న్యాయ వ్యవస్థ నిర్వహణ తీరు ఎలా ఉన్నది అనే విషయాల గూర్చి లోతైన పరిశీలన జరిపారా లేదా అనేది న్యాయమూర్తుల నియామకాల్లో అసలు పాటించడం లేదు. కేవలం సీనియారిటీ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు.

మన దేశంలో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, గవర్నర్, రాష్ట్రపతి లాంటి వారిని కూడా వేరేవారు నియమిస్తుంటారు. సివిల్ సర్వీసులకు ఎంపికయ్యే వారికి, గ్రూప్ పరీక్షలు రాసేవారికి కఠినమైన పరీక్షలు ఉంటాయి. వాటన్నిటిని పరిష్కరించుకుంటూ అగ్రశ్రేణులుగా నిలిచే వారికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయి. ఒక ఆఫీసులో గుమస్తాను, అటెండర్ ను నియమించాలన్నా బోలెడు నిబంధనలు ఉంటాయి. వ్రాత పరీక్షలు, ముఖాముఖీ ఇంటర్వ్యూలు ఉంటాయి. వాటిని అమలు చేయడానికి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి వ్యవస్థలు ఉంటాయి. ఒక కలెక్టర్ బదిలీ అయిపోతూ మరొక వ్యక్తిని తన స్థానంలో నియమించ లేడు.ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ విరమణ చేసే ముందు తన వారసుడిని తాను నియమించ లేడు. కానీ, మన న్యాయ వ్యవస్థలో జడ్జీలను నియమించడం, ప్రధాన న్యాయమూర్తులను నియమించడం సుప్రీంకోర్టే చేస్తుంది. కొలీజియం పేరుతో ఐదారుగురు న్యాయమూర్తులు కూర్చుని తమ అధిపతి ఎవరో తామే నిర్ణయించుకుంటారు! చాలామంది మేధావులు ఈ తరహా పాలసీని విమర్శిస్తున్నప్పటికీ ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఈ విధానాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉన్నది. కానీ పిల్లి మెడలో గంట కట్టే దెవరు?

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News