Home ఎడిటోరియల్ సంపాదకీయం: వానచుక్కకై నోళ్లు తెరిచిన నేల

సంపాదకీయం: వానచుక్కకై నోళ్లు తెరిచిన నేల

Sampadakeeyam-Logo

తెలంగాణ రాష్ట్రం వరుసగా మూడవ సంవత్సరం కరువు పరిస్థితులు చవిచూడక తప్పదా? ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అటువంటి ఆందోళన కలుగచేస్తున్నాయి. వచ్చే నాలుగైదు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురవక పోతే ఐదున్నర లక్షల ఎకరాల్లో పచ్చని పైర్లు ఎండుముఖం పట్టే ప్రమాదం పొంచి ఉంది. గత 20 రోజులుగా వర్షం పడకపోవటంతో పైర్లు నీటి కోసం తపిస్తున్నాయి. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన మైనా వర్షం తెస్తుందా అని రైతులు ఆకాశంవైపు ఆశతో చూస్తున్నారు. సముద్రపు గాలులు అనుకూలించకపోవటంతో ఆ అవకాశం తక్కువేనని, అక్కడక్కడ చెదురుమదురు జల్లులు పడవచ్చని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబు తున్నారు. నైరుతి రుతుపవనాల ఆరంభం అదిరింది – కాని అనంతరకాలంలో దక్షిణ భారత్‌ను, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను కరుణించ లేదు. చెదురుమదురు వర్షాలు పడినప్పటికీ మండు తున్న బెట్ట వాతావరణం భూమిలో తేమను శీఘ్రం గా హరిస్తున్నది. భూగర్భ జలాలు సైతం మట్టం తగ్గాయి. ఎగువరాష్ట్రాల్లో ఆలస్యంగా కురిసిన భారీ వర్షావల్ల జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు కొంత మేరకు జలకళ వచ్చినా, కీలకమైన నాగార్జునసాగర్ బోసిపోయి ఉంది. అందువల్ల కుడి – ఎడమ కాల్వల కింద తాగునీటి అవసరాలు తీర్చటంతో పాటు ఆరుతడి పంటలే వేసుకోవాలని నిర్ణ్ణయించటం జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మంచిగా వర్షాలు కురిసి జలాశయం నిండితే రబీసాగు అప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. శ్రీరాంసాగర్ కింద పరిస్థితి మెరుగ్గా ఉంది.

అయితే రాష్ట్రంలో వ్యవసాయంలో అత్యధిక భాగం వర్షాధారం కావటం, బోర్లపై హెచ్చుగా ఆధారపడటం వల్ల రైతాంగ జీవితం వర్షంతో పెన వేసుకుని ఉంది. ఈ సంవత్సరం సగటు వర్షపాతం దేశమంతటా దీర్ఘకాలిక సాధారణ సగటుకన్నా హెచ్చుగా ఉంటుందన్న భారత వాతావరణశాఖ అంచనాలు నెరవేరవచ్చు – ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. కాని రెండు తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణాదిరాష్ట్రాల్లో వర్షాకాలం ఆరంభం మంచిగా మొదలై తర్వాత బెట్ట ఆవరించింది. తొలుత విస్తారంగా వర్షాలు కురవటంతో గ్రామీణ జీవితంలో ఉత్సాహం నిండింది. పంటలు మంచిగా పండుతాయన్న ఆశలు రేకెత్తాయి. ఈ ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన పంటలు సాగు ఆశాజనకంగా ఉంది. పత్తిసాగును 17లక్షల హెక్టార్ల నుండి 12.11 లక్షల హెక్టార్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో – లక్షంమేరకు పత్తివిత్తు లు నాటారు. పత్తి ఎగుమతులకు ప్రోత్సాహకాన్ని కేంద్రప్రభుత్వ ఉపసంహరించిన దృష్టా, పత్తికి మంచి ధర రాకపోవచ్చన్న అంచనాతో ప్రభుత్వం పత్తివిస్తీర్ణం తగ్గించింది. అధికారులు రైతులను సోయాచిక్కుడు, పప్పుధాన్యాలు, మొక్కజొన్న సాగువైపు ప్రోత్సహించారు. అందువల్ల ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం గత రెండు సంవత్సరాలతో పోల్చితే పెరిగింది. గత రెండు సంవత్సరాలు ఖరీఫ్ సాగు విస్తీర్ణం వరుసగా 32.12; 33.19 లక్షల హెక్టార్లు కాగా ఈ ఏడాది 35.04 లక్షల హెక్టార్ల పంట భూమి సాగయింది. మొక్కజొన్న, కందులు, సెనగలు, మినుములు, సోయా చిక్కుడు విస్తీర్ణం బాగా పెరిగింది. మొక్కజొన్న సాగు 5.74 లక్షల హెక్టార్లకు (గత సంవత్సరం 3.96ల.హె), కందుల సాగు 4.24ల. హెక్టార్లకు ( 2.13ల.హె), సెనగలు సాగు 1.04 ల. హెక్టార్లకు (1.04ల.హె), మినుముల సాగు 0.46ల. హెక్టార్లకు ( 0.27ల.హె.), సోయా చిక్కుడు 2.98ల.హెక్టార్లకు(2.52ల.హె) పెరిగింది. ప్రధాన ఆహారపంట వరిసాగు కూడా 4.13ల.హె. నుంచి 5.11ల.హెక్టార్లకు పెరిగింది. మిర్చి, ఆముదం సాగు విస్తీర్ణం కూడా పెరిగింది.

ప్రభుత్వం వ్యవసాయానికి 9 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా పైరు పచ్చదనానికి దోహదం చేసింది. అయితే ఆగస్టు వర్షాభావంతో నేల నోరు తెరిచింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో పైరు వడిలిపోతున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మొక్క ఎదుగుదల దశలో ఉన్నందున రాగల కొద్ది రోజుల్లో వర్షం కురవకపోతే ఎండిపోయే దశ ఆరంభమవుతుంది. రైతులు వేయికళ్లతో ఆకాశం వైపు చూస్తున్నారు. కాని తీవ్రమైన ఎండ, అప్పుడప్పుడు నల్లని మబ్బులు ఆశ-నిరాశలతో దోబూచులాడుతున్నాయి. లోటు సగటు వర్షపాతం నమోదైన జిల్లాల్లో పరిస్థితి మరీ ఆందోళనకరం. భూగర్భజలాల నీటిమట్టం శీఘ్రంగా పడిపోతున్నది. అలాగే జిల్లాల్లో కూడా మండలాలమధ్య వర్షపాతం లో తీవ్రమైన వ్యత్యాసాలున్నాయి. కాబట్టి ఎల్‌నినో ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోనట్లే. ఇక సెప్టెంబర్ వర్షాలపైనే ఆశలన్నీ. అవీ ముఖంచాటేస్తే లేక అరకొరగా వర్షిస్తే వరుసగా మూడవ సంవత్సరం కరువు పరిస్థితులు తప్పవు. ప్రభుత్వం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూ ఎప్పటికప్పుడు తీసుకోగల చర్యలపై దృష్టి సారించాలి.