Friday, March 29, 2024

ఏడారి దేశంలో క్రికెట్ సందడి!

- Advertisement -
- Advertisement -

Dubai ready to host IPL 2020

మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. కరోనా వల్ల నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్‌కు త్వరలోనే తెరలేవనుంది. ఏడాది, దేశం యుఎఇ వేదికగా ఈ కాసుల క్రికెట్ టోర్నమెంట్ జరుగనుంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాకున్న దుబాయిలోనే ఈసారి టోర్నీ జరుగుతుందనే విషయాన్ని ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. దీంతో ఐపిఎల్ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెర పడింది. ఇక, దుబాయిలో జరిగే ఐపిఎల్ కోసం విస్త్రృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా భయంతో ఈ ఏడాది ఐపిఎల్ అసలు జరుగుతుందా లేదా అనే అనుమానాలు మొదట నెలకొన్నాయి. అయితే, భారత క్రికెట్ బోర్డు మాత్రం ఈ ఏడాది ఎలాగైన ఐపిఎల్‌ను నిర్వహించి తీరాలనే పట్టుదలతో కనిపించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రత్యేక చొరవ కనబరచడంతో టోర్నమెంట్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. ఇదిలావుండగా ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్ వాయిదా పడడంతో ఐపిఎల్‌కు ఉన్న అడ్డంకులన్ని తొలగి పోయాయి. ప్రపంచకప్ నేపథ్యంలో ఐపిఎల్ నిర్వహణ జరగడం కష్టంగా కనిపించింది. కానీ ఎప్పుడైతే ఈ టోర్నీని వాయిదా వేశారో ఐపిఎల్‌కు లైన్ క్లియర్ అయ్యింది. కాగా, భారత్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉండడంతో ఇక్కడ ఈ టోర్నీని నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దుబాయి వేదికగా ఐపిఎల్‌ను నిర్వహించేందుకు బిసిసిఐ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా యుఎఇ క్రికెట్ బోర్డుతో పలు దశల్లో సంప్రదింపులు జరిపింది. మరోవైపు యుఎఇ క్రికెట్ బోర్డు కూడా ఐపిఎల్ నిర్వహణకు సిద్ధమని ముందే స్పష్టం చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి.
విస్త్రృత ఏర్పాట్లు
ఇక, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఐపిఎల్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. టోర్నమెంట్ ప్రారంభానికి నెల రోజుల ముందే ఆయా జట్ల క్రికెటర్లు ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. ఇలాంటి, సమయంలో ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఆటగాళ్ల బస కోసం హోటళ్లను ముందే బుక్ చేసుకుంటున్నాయి. అంతేగాక, క్రికెటర్ల క్వారంటైన్‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. మరోవైపు ఆటగాళ్లను తరలించేందుకు ప్రత్యేక విమానాల ఏర్పాట్లలో ఫ్రాంచైజీ యాజమాన్యాలు నిమగ్నమయ్యాయి. విదేశీ క్రికెటర్లు నేరుగా దుబాయికి చేరుకునే అవకాశాలుండగా, భారత ఆటగాళ్లను ప్రత్యేక విమానాల ద్వారా దుబాయికి తరలించనున్నారు. దీని కోసం భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఆటగాళ్లను అక్కడికి తరలించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి.
అభిమానులు లేకుండానే
ఇక, ఈసారి ఐపిఎల్ టోర్నమెంట్ అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల కాకున్నా కరోనా భయం నేపథ్యంలో అభిమానులకు అనుమతి ఇస్తారా లేదా అనేది సందేహంగా మారింది. యుఎఇ ప్రభుత్వం అనుమతితి ఇస్తే మాత్రం అభిమానుల సమక్షంలో టోర్నమెంట్ జరిగే అవకాశాలుంటాయి. ఇది జరిగితే గల్ఫ్ దేశాల్లో ఉండే క్రికెట్ అభిమానులకు ఐపిఎల్‌ను ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం లభిస్తుంది. ఇదిలావుండగా బిసిసిఐ మాత్రం అభిమానులకు అనుమతి ఉన్నా లేకున్నా పట్టించుకోకూడదని భావిస్తోంది. డిజిటిల్, లైవ్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఒక వేళ అభిమానులకు అనుమతి లేకున్నా పెద్దగా వచ్చే నష్టమేమీ ఉండదు. దీని లోటును ఇతర మార్గాల ద్వారా పూడ్చుకోవాలనే ఉద్దేశంతో బిసిసిఐ ఉంది. మరోవైపు ఐపిఎల్ షెడ్యూల్‌ను మరో వారం రోజుల్లో ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇక, ఎలాంటి కోతలు లేకుండా పూర్తి స్థాయిలో టోర్నీని నిర్వహించేందుకు బిసిసిఐ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు రెండు నెలల పాటు ఈ టోర్నమెంట్ కొనసాగనుంది. భారత్‌తో సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, లంక తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించనున్నారు. అన్ని జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో టోర్నమెంట్ అభిమానులను కనువిందు చేయడం ఖాయం.

Dubai ready to host IPL 2020

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News