Saturday, April 20, 2024

ముగిసిన ప్రచారం.. మూగబోయిన మైకులు

- Advertisement -
- Advertisement -

Dubbaka Bypoll Campaigning Ends today

: దుబ్బాక ఎన్నికల ప్రచారం పర్వం ఆదివారం ముగిసింది. గత నెల రోజులుగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారంతో, మైకులతో హోరెత్తిన దుబ్బాక గల్లీలు మూగబోయాయి. సాయంత్రం ఐదుగంటల నుంచి దుబ్బాక నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు చేశారు. దుబ్బాకలో విజయ బావుటా ఎగురవేసేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటీఆర్‌ఎస్‌తో పాటు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పోటాపోటీగా ప్రచారం నిర్వహించగా గతంలో తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్తూ మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రచారం చేశాయి. దుబ్బాక సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని అన్ని పార్టీల ప్రధాన నాయకులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు దుబ్బాకలో మాకం వేసి ప్రచారాన్ని చేశారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ తరుపున రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రచార బాధ్యతలను మొత్తం తన భుజాలపై వేసుకుని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం చేశారు. సోలిపేట రామలింగారెడ్డి చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఆయన ఆశయాల సాధన కోసం సోలిపేట సుజాతను గెలిపించాలని కోరారు.

దుబ్బాక అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. లక్ష మెజార్టీ లక్షంగా దుబ్బాకతో పాటు సిద్దిపేట జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా.. ఒక సారి ఎంపీగా ఓటమి చెందిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తనకు అవకాశం కల్పించాలని కోరుతూ ప్రచారం చేశారు. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రచారంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొని చెరుకు శ్రీనివాస్ రెడ్డి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. దుబ్బాకలో తమదే విజయంటూ గెలుపు ధీమాలో ఆయా పార్టీల నేతలు ఉన్నారు. మరోవైపు నవంబర్ 03న పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భారతీ హోలికెరీ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. మొత్తం 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 89 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సీపీ జోయల్ డెవిస్ భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. నాలుగు కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలను రప్పించారు. దాదాపు 1600 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News