Home ఎడిటోరియల్ తారుమారు న్యాయం!

తారుమారు న్యాయం!

Sai-Baba

‘న్యాయమూర్తులు‘ గతంలో డబ్బు, పదవీ విరమణానంతర అధికారాలకు ఆశపడేవారు. ఇప్పుడు పాలక ప్రభావాలతో న్యాయా న్యాయా లు తారుమారవుతున్నాయి. న్యాయం చేయడమే కాదు చేసినట్లు కనిపిం చాలన్నది నానుడి. అనేక సందర్భాలలో ఇవి రెండూ జరగడం లేదు.
మార్చి 8న, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ.) జైపూర్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి దినేశ్ గుప్తా, ఆర్.ఎస్.ఎస్. సీనియర్ ప్రచారక్ ‘స్వామి’ అసీమానంద్ మరో ఆరుగురు నిందితులను అజ్మీర్ దర్గా బాంబు పేలుడు కేసు నుండి వదిలేశారు. ఇద్దరు సంఘ్ ప్రచారకులు దేవేంద్ర గుప్తా, సునీల్ జోషిలను దోషులుగా ప్రకటించారు. పారిపోయిన నలుగురు సంఘీయ నిందితులు నేటికీ దొరకలేదు. 2006లో ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ హిందూదేశ స్థాపన లక్ష్యంగా హిందుత్వ సంస్థ ‘అభినవ భారత్’ను స్థాపించారు. ఈ సంస్థ సభ్యుడైన అసీమానంద్ మాలెగావ్, సంజౌత ఎక్ప్రెస్, హైదరాబాద్ మక్కా మసీదు బాంబు పేలుళ్ళలో కూడా నిందితులే. అజ్మీర్ దర్గా పేలుడు 2007 అక్టోబరు11 న జరిగింది. 2011లో అరెస్టయినప్పుడు, భారత్‌లో పలు చోట్ల మైనారిటీ లు లక్ష్యంగా జరిగిన పేలుళ్ళకు నాయకత్వం వహించానని, ప్రణాళికలు రచించానని, సహాయ సహకారాలు అందించానని, పేలుళ్ళలో హిందుత్వ సంస్థల కుట్ర, సంఘ్ సీనియర్ నాయకుల ఆమోదం, ప్రోత్సాహం ఉన్నాయని మేజిస్ట్రేట్ ముందర అసీమానంద్ అంగీకరించారు. మోడీ చాలా సహాయాలు చేశారని ఇంటర్వ్యూలలో చెప్పారు. సంఘ్ ప్రముఖ నాయకుడు ఇంద్రేశ్ కుమార్‌ను ఈ కోర్టు ఇంతకు ముందే పవిత్రీక రించింది. నేరాన్ని అంగీకరించినా అసీమానంద్‌ను ఎందుకు వదిలేశారో అర్థం కావడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్విని శర్మ అన్నారు. ‘బాంబు పేలుళ్ళను మోహన్ భాగవత్, ఇంద్రేశ్ కుమార్ ఆమోదించారని అసీమానంద్ నాకు చెప్పారు. బాంబుపేలుళ్ళ కేసులో అసీమానంద్ మొదలగు నిందితులకు వ్యతిరేకంగా గట్టి సాక్ష్యాధారాలున్నాయని 2013లో ఎన్.ఐ.ఎ. పరిశోధనాధికారి విశాల్ గార్గ్ నాతో అన్నారు. అవన్నీ ఇప్పుడే మయ్యాయో?’అని కారవాన్ మ్యాగజైన్ ఎడిటోరియల్ మేనేజర్ లీనా గీతా రఘునాథ్ ‘కళ్ళకు గంతలు కట్టిన న్యాయం’ అన్న తన వ్యాసంలో పేర్కొన్నారు.

ఆచార్య సాయిబాబా 90% అంగవైకల్యంతో, గుండె, నరాల, ఊపిరి తిత్తుల, కాలేయ, మధుమేహ, రక్తపోటు జబ్బులతో ఎడమచేయి పని చేయని వ్యక్తి. సామాజిక స్పృహ కలిగి, నిర్దిష్ట చైతన్య రాజకీయాభి ప్రాయాలు కలిగిన మేధావి. ఇంటిని, కళాశాలను వదలలేని, చక్రాల కుర్చీ నుంచి సాయం లేకుండా కదలలేని ఆచార్యుడు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్నది ఈయన పై అభియోగం. ఈయనతో పాటు శిక్షకు గురైన ముగ్గురు విద్యార్థులు నర్మదక్క అనే మావోయిస్ట్ కమాండర్ నుండి రూ.5 లక్షలు, మావోయిస్ట్ భావజాల ప్రచారం కోసం సాయి బాబాకు ఇవ్వడానికి తెచ్చారని నింద. మావోయిజం ప్రభుత్వాల వైఫల్య పాలనతో పుట్టిన సామాజిక సమస్యల పరిష్కార వేదిక. మత సంస్థలంత హానికరం కాదు. సహజవనరులను బహుళజాతి సంస్థలకు అప్పజెప్ప డాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న ‘విప్లవ ప్రజాస్వామిక వేదిక’ బాధ్యుడు సాయిబాబా. ఆయన కార్యక్రమాలు, రచనలు అన్నీ బహిర్గతమే. నిర్దిష్ట అభిప్రాయం కలిగి ఉండటం, ప్రచారం చేయటం తప్పుకాదు. రెచ్చ గొట్టడమే. ఇప్పుడు దేశంలో ఎవరు ఏ పని చేస్తున్నారో ప్రజలకు తెలుసు. ఆయన అభిప్రాయాలతో పాలకులు ఏకీభవించక పోవచ్చు. వారికి 31% ఓటర్లే ఓటేశారన్న మాట అటుంచి, వారి మత రాజకీయాలను అధిక శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే రెండున్నరేళ్ళ జైలు అనుభ వించిన సాయిబాబాకు యావజ్జీవం విధించారు. ఇది ప్రభుత్వాలు, పాలకులు పనిగట్టుకొని తమకు నచ్చని భావజాలానికి వేయించిన శిక్ష.
సాధ్వి ప్రజ్ఞా సింఘ్ ఠాకూర్ సహా శ్యామ్ సాహు, శివ నారాయణ్ కల్సాంగ్రా, లోకేశ్ శర్మ, ధన్ సింఘ్ చౌదరి, ప్రవీణ్ ముతాలిక్ మొత్తం ఆరుగురిని ఎన్.ఐ.ఎ. 2016 మే 13న మాలేగావ్ పేలుళ్ళ కేసులో నిర్దోషులుగా నిర్ణయించింది. మరో పదిమందిపై ‘మహారాష్ట్ర వ్యవస్థీకృత నేర నియంత్రణ చట్టం’ కింద పెట్టిన నేరారోపణలను ఉపసంహరించు కుంది. 49 మంది సాక్షులను మార్చడానికి రూ 4 కోట్ల రహస్య నిధి ఖర్చయిందని అంచనా. 2016 ఏప్రిల్ 26 న ప్రత్యేక కోర్టు ఈ కేసులో నిందితులైన 9 మంది ముస్లింలపై ఉగ్రవాద నేరారోపణలను తోసి పుచ్చింది. వెంటనే బాంబే హై కోర్టు ఈ విడుదలను ‘పక్షపాత అంశం’ కింద విచారణకు చేపట్టింది. ప్రజ్ఞ, అసీమానంద్‌ల విడుదల పక్షపాతం కాదా? ప్రజ్ఞ, పురోహిత్ బృందం అరెస్టులను విమర్శించిన బిజెపి నేడు అధికారంలో ఉంది. వీరిని సమర్థించిన నాటి బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ నేటి కేంద్ర హోం మంత్రి. బిజెపి అధికారం చేపట్టిన తర్వాత ‘న్యాయాలు’ చాలా జరిగాయి. నిఘా విభాగాలు, దర్యాప్తు సంస్థలపై వత్తిడి పెంచి వాటి నిర్ణయాలను తారుమారు చేయించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో 2014 ఏప్రిల్ 4న అమిత్ షా చేసిన అక్రమప్రచారంపై కేసు నమోదయింది. దీనికి ఆధారాలు లేవని 2016 జనవరి 20న పోలీసులు కోర్టుకు నివేదించారు. బహిరంగ ఉపన్యాసం దొరకలేదు! గుజరాత్‌లో సొహ్రాబుద్దిన్ షేక్, అతని భార్య కౌసర్ బీ (ఈమెను మానభంగం చేసి, చంపి, కాల్చేశారు.) బూటకపు ఎన్‌కౌంటర్ (2005లో), గుజరాత్ మాజీ మంత్రి హరేన్ పాండ్యా హత్య (2006 లో) కేసులో ప్రధాన సాక్షి తులసి రామ్ ప్రజాపతి బూటకపు ఎన్‌కౌంటర్ కేసులలో మోడీ, అమిత్ షా నిందితులు. 2014, డిసెంబర్ లో సి.బి.ఐ. స్పెషల్ కోర్టు ఈ కేసులను కొట్టేసింది. ఎహ్సాన్ జాఫ్రి హత్య కేసులో మోడీ హస్తం లేదని తీర్పు నిచ్చింది. అతి తీవ్రమైన 12 మోదీ కేసులు ముందుకు పోలేదు.
బాబ్రి మసీదు కూల్చివేత కేసులో జరుగుతున్న జాప్యానికి సుప్రీం కోర్టు మార్చి ఆరున ఆందోళన వెలిబుచ్చింది. లక్నో, రాయిబరేలీ కేసులను కలిపి విచారించాలన్నది. బాబ్రి మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, ఉమా భారతి, మురళి మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్ తదితరులు నిందితులు. నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్, 1993అక్టోబర్ 8న, ఈ కేసును రాయిబరేలి కోర్టు నుండి లక్నొ కోర్టుకు మార్పించారు. ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. హై కోర్టు ఆమోదం తప్పనిసరి. ఈ లోప భూయిష్ట చర్యను సరిచేసుకోమని 2001 ఫిబ్రవరి 12న ఉత్తరప్రదేశ్ హై కోర్టు రాజనాథ్‌సింగ్‌ను ఆదేశించింది. ఆయన కోర్టు సలహాను పాటించ లేదు. ఫలితంగా అద్వానీ, ఉమా భారతి తో పాటు 12 మంది ప్రత్యేక కోర్టు విచారణ తప్పించుకున్నారు. బాబ్రి మసీదును కూల్చిన తర్వాత 1992 డిసెంబర్, 1993 జనవరిలలో 1000 మందికి పైగా ముస్లింలను హతమార్చారు. ఈ హత్యలను శివసేన అధినాయకుడు బాల్ ఠాకరే, శివసేన ఎం.ఎల్.ఎ. మధుకర్ సర్ పోత్ చేయించారని జస్టిస్ శ్రీకృష్ణ నివేదించారు. వీరి మీద కోర్టు విచారణలే లేవు. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాతి ఊచకోతలో ఢిల్లీలోనే 3,000 మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారు.
2002 గోద్రా అనంతర ఘటనలలో వేలాది ముస్లింలను అతి ఘోరంగా హత్య చేశారు. మహిళా మంత్రి మాయా కొద్నాని స్వయం పర్యవేక్షణలో వందల హత్యలు చేయించారు. కాంగ్రెస్ ఎం.పి. జాఫ్రీని, ఆయన ఇంటిలో రక్షణ కోసం చేరిన వారిని అతి భయంకరంగా చంపేశారు. ఎంతోమంది ముస్లిం మహిళలను మానభంగం చేసి చంపారు. బిల్కిస్ బానోను సామూహిక మానభంగం చేశారు. 14 మంది కుటుంబ సభ్యులను హతమార్చారు. ఆమె మూడేళ్ళ కుమార్తెను తల పగులకొట్టి చంపారు. ఒడిశాలో కుష్టు రోగ చికిత్సకుడు, ఆస్ట్రేలియా డాక్టర్ గ్రాహమ్ స్టేన్స్ ను, ఆయన ఇద్దరు కుమారులను (10,7) పరివార్ సంస్థ బజరంగ్ దళ్‌కు చెందిన దారా సింగ్ 1999, జనవరి 22-23 రాత్రి సజీవ దహనం చేశాడు. ఇతడు ముస్లిం వ్యాపారి షేక్ రహ్మాన్, క్రైస్తవ మత గురువు అరుల్ దాస్‌లతో సహా 9 మందిని హత్య చేసిన పాత నేరస్థుడు. స్టేన్స్ భార్య శిక్షిత నర్స్ గ్లాడిస్, మరణ శిక్ష పశ్చాత్తాప, సంస్కరణా వకాశాలను హత్య చేస్తుందన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పి. సదాశివన్, బి.ఎస్.చౌహాన్, ‘డా.స్టేన్స్ ఆయన కుమారుల హత్య, పేద గిరిజనులను క్రైస్తవులుగా మారుస్తున్నం దుకు గుణపాఠం.’ అని విచిత్ర వ్యాఖ్యానం చేసి దారా సింగ్‌కు జీవిత ఖైదు మాత్రమే విధించింది. సదాశివన్ ను బిజెపి ప్రభుత్వం కేరళ గవర్నర్ గా నియమించింది. ముజఫర్ నగర్ మత కలహాలలో ఒక మతం వారు హత్యలకు గురయ్యారు. ఆ మతానికి చెందిన మహిళలను అతి క్రూరంగా వారి కుటుంబ సభ్యుల ఎదుటనే మానభంగం చేశారు. తర్వాత అందరినీ చంపేశారు. 2013 సెప్టెంబర్ 8 న లోంక్ గ్రామంలో 10 ఏళ్ళ పిల్లవాడిని, 30 ఏళ్ళ మహిళ ను చంపారు. ఈ సందర్భంలో ఒక బిజెపి ఎమ్.ఎల్.ఎ., ఆయన అనుచరులు 9 మంది మీద గృహదహనం, మానభంగం, హత్యానేరాలు మోపబడ్డాయి. 2016, ఫిబ్రవరిలో కోర్టు మొత్తం 10మందినీ వదిలేసింది. ఈ దానవ ఘటనల సూత్రధారులైన సంగీత్ సోం, సురేశ్ రానా, రాం ప్రతాప్ చౌహాన్‌లను శిక్షించక పోగా ‘విజయ శంఖానాదం’ పేరుతో సన్మానించారు.
పరివార్ సంస్థలకు పోలీసు మద్దతు, న్యాయవ్యవస్థ సహాయసహ కారాలు అందుతున్నాయి. ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలను పోలీసు విభాగం లో భర్తీ చేశాము. 60% యువ పోలీసులు అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యులే అని మంగళూరు బిజెపి ఎం.ఎల్.ఎ. కెప్టెన్ గణేశ్ కార్తిక్ చెప్పా రు. ముజఫర్ నగర్ పరివార్ ప్రముఖుడు సంజయ్ అగర్వాల్ న్యాయ వాదులలో చాలా మంది స్వయంసేవకులేనన్నారు. మా న్యాయవాదులు న్యాయవ్యవస్థలో జరిగే కార్యక్రమాలను గమనిస్తుంటారని, మేము న్యాయవాదుల సంఘాన్ని, ప్రైవేటు సైన్యాన్ని నడుపుతున్నామని ముజ ఫర్ నగర్ జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు లలిత్ మహేశ్వరి చెప్పారు.
‘అన్యాయాలతో అలసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. కాని ప్రియసతి కోసం బతుకుతున్నాను.’ అని 1609 లోనే ఒక పద్యంలో, ప్రఖ్యాత ఆంగ్ల కవి, నాటక కారుడు షేక్స్‌పియర్ బాధపడ్డారు. మతహత్య లకు, విధ్వంసాలకు పాల్పడినవారు నిర్దోషులు. దేశాభ్యున్నతికి ఉద్య మిస్తున్న వారు దోషులు. అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడటమే కర్తవ్యం. లేకపోతే అన్యాయం న్యాయమవుతుంది. న్యాయస్థానాలు ప్రభుత్వాల మద్దతు సంస్థలవుతాయి.