Home సంగారెడ్డి ఈ-సంగారెడ్డి ఫిర్యాదులు సత్వరమే పరిష్కారం

ఈ-సంగారెడ్డి ఫిర్యాదులు సత్వరమే పరిష్కారం

SRDP

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : ఈ సంగారెడ్డి మొబైల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను మండల తహసిల్దార్లు జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా జెసి వెంకటేశ్వర్లు ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి మండల తహసిల్దార్లతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఈ సంగారెడ్డి మొబైల్ యాప్‌ను తహసిల్దార్లు సద్వి నియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదును దరఖాస్తుచేసుకొని వుంటే వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలుతీసుకోవాలన్నారు. యాప్‌లో మండలాల వారీగా వచ్చిన ఫిర్యాదులను పరిష్క రించాలని, దీన్ని జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారని అన్నారు. షాదీముబారక్,కల్యాణ లక్ష్మి దరఖాస్తు లను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే చర్యలు తీసుకోవా లని అధికారులను ఆదేశించారు.

జిల్లా రెవెన్యూ అధికారి రఘురాంశర్మ మాట్లాడుతూ జనవరి 25వ తేదీన జాయతీ ఓటరు దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించా లన్నారు. ఇంటరాక్టివ్ స్కూల్ ఇంగేజ్‌మెంట్ సెక్షన్ పేరుతో వచ్చే ఎన్నికల నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఓటు హక్కు వచ్చే విద్యార్థులకు ఓటింగ్ పట్ల అవగాహన కల్పించాలన్నారు. జనవరి 10,11 తేదీల్లో తహసీల్దార్లు పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించి బ్యాడ్జీలు, పుస్తకాలు అందజేయాలన్నారు. ఇంటరాక్టివ్ సెషన్‌లో ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, ఓటరు కార్డు ఎలా పొందాలి, ఓటరు కార్డులో ఏదైనా తప్పులు దొర్లితే ఎలా సవరించుకోవాలి తదితర అంశాలపై విద్యార్థులతో అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.