Home సిద్దిపేట ప్రతి నియోజకవర్గ కేంద్రాన్ని క్రీడా గ్రామంగా అభివృద్ధి

ప్రతి నియోజకవర్గ కేంద్రాన్ని క్రీడా గ్రామంగా అభివృద్ధి

harish

*విద్య, ఉద్యోగాలలో క్రీడాకారుల రిజర్వేషన్ కోటా పెంపునకు కృషి
*ఏసియన్ గేమ్స్‌కు తెలంగాణ క్రీడాకారులు సిద్ధ్దం కావాలి
*రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడల ముగింపు సభలో మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/గజ్వేల్ : సిఎం నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ వేదికగా వచ్చే సంవత్సరంలో జాతీయ క్రీడలను నిర్వహిస్తామని అందుకు తగిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మినీస్టేడియంలో గత మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి అండర్- 19 బాల బాలికల కబడ్డీ పోటీల ముగింపు సభలో విజేతలకు బహుమతులందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారులకు సిఎం కెసిఆర్ తగినంత ప్రోత్సాహం కల్పిస్తున్నారని, రానున్న కాలంలో ఉద్యోగ, విద్యావకాశాలకు ఇప్పుడున్న దానికంటే రిజర్వేషన్ కోటాను మరింత పెంచుతామన్నారు. ఇటీవలి కాలంలో క్రికెట్‌తో సమానంగా కబడ్డీ క్రీడకు క్రేజ్ పెరిగిందని, ఈ క్రీడలను తమ ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని క్రీడాకారులకు మంత్రి సూచించారు. గజ్వేల్ పట్టణంలోని రింగు రోడ్డును ఆనుకుని సుమారు 20 ఎకరాల స్థలంలో అధునాతన క్రీడా స్టేడియాన్ని నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న స్టేడియం ఔట్‌డోర్ క్రీడాస్టేడియంగా కొనసాగుతుందన్నారు. గజ్వేల్ ను అద్భుతమైన క్రీడా గ్రామంగా అభివృద్ధ్ది చేయనున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రాన్ని క్రీడా గ్రామాలుగా అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తున్నదని, దీనివల్ల గ్రామీణ ప్రాంతం నుంచి మంచి క్రీడాకారులు తయారవుతారన్నారు. కబడ్డీ క్రీడ ఏసియన్ గేమ్‌గా ఉందని రానున్న కాలంలో తెలంగాణ నుంచి ఏసియన్ గేమ్స్‌కు క్రీడా పోటీల్లో మనవాళ్లు రాణించే విధంగా తయారు కావాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలో ప్రథమ బహుమతి సాధించిన నల్లగొండ జిల్లా బాలబాలికల జట్లను మంత్రి అభినందించారు. క్రీడల్లో విజేతలైన క్రీడాజట్లకు మంత్రి మెడల్స్, కప్పులను అందచేశారు. గడా అధికారి హనుమంతరావు, ఎస్‌జిఎఫ్ క్రీడల మ హిళా కార్యదర్శి, ఎంఇఒ సునీతతో పాటు పలువురు పిడి సత్యనారాయణరెడ్డి తదితరులను మంత్రి సన్మానించారు. అనంతరం ఇదే ప్రాంగణంలో సుమారు రూ.2.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రాంగణంలో ఆయనతోపాటు ఎంపి ప్రభాకర్‌రెడ్డిలు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ భూమిరెడ్డి, రాష్ట్ర ఎస్‌జిఎఫ్ క్రీడల కార్యదర్శి రాంరెడ్డి, గడా అధికారి హనుమంతరావు, ఆర్డీఒ విజయేందర్ రెడ్డి, జిపిఎన్పీ ఛైర్మన్ భాస్కర్, వైస్ చైర్మన్ అరుణా భూపాల్‌రెడ్డి, జడ్పీటిసి వెంకటేశం గౌడ్, ఎంఇఒ సునీత పిడి సత్యనారాయణ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ జిల్లాలకు చెందిన పిఇటిలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో సత్తా చాటి నిలిచిన నల్లగొండ నగర్ బాలురు
తృతీయ స్థానంలో నిలిచిన వరంగల్ బాలికలు, నిజామాబాద్ బాలురు బాలబాలికల జట్లు
ద్వితీయ స్థానం దక్కించుకున్న ఖమ్మం బాలికలు, మహబూబ్

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మినీ స్టేడియంలో గత మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ అండర్- 19 బాలబాలికల పోటీలు ఆదివారం సాయత్రానికి ముగిసాయి. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో నల్లగొండ జిల్లా బాలికలు, బాలుర జట్లు తమ ప్రత్యర్థులపై ఘన విజయం సాధించటంతో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. మొత్తం టోర్నీలో ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. అంతకుముందు సెమీస్‌లో నిజామాబాద్ జట్టుపై గెలిచిన నల్లగొండ బాలురు, హైదరాబాద్ జట్టుపై గెలిచిన మహబూబ్‌నగర్ బాలుర జట్లు ఫైనల్ పోరుకు తలపడ్డారు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ తుదిపోరులో చివరకు మహబూబ్‌నగర్ జట్టుపై తల పడ్డ నల్లగొండ బాలుర జట్టు విజయం సాధించి రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచారు. తుది వరకు విజయం కోసం పోరాడి ఓడిన మహబూబ్‌నగర్ బాలు ర జట్టు ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ టోర్నీలో నిజామాబాద్ బాలురు మూడో స్థానం దక్కించుకున్నారు. ఇక బాలికల విభాగంలో జరిగిన ఫైనల్స్ పోటీ ఆద్యంతం ఉత్కంఠగానే సాగింది. నల్లగొండ బాలికలు ఖమ్మం బాలికల జట్టుతో తీవ్రమైన పోటీని ఎదుర్కున్నారు. ఎంతో హోరాహోరీగా సాగిన ఈ పోటీలో చివరకు నల్లగొండ బాలికల జట్టు తమ ప్రత్యర్థి ఖమ్మం విజయం సాధించి అగ్రగామిగా నిలిచారు. రెండో స్థా నాన్ని ఖమ్మం బాలికలు దక్కించుకున్నారు. టోర్నీలో ప్రతిభ చూపిన వరంగల్ బాలికల జట్టు తృతీయ స్థానంలో నిలిచారు. మొత్తం మీద ఈ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో నల్లగొండ జిల్లాకు చెందిన బాలబాలికల జట్లు  ప్రథమ స్థానంలో నిలిచి జయకేతనం ఎగుర వేయటం విశేషం.