Home కలం తొలితరం కవి కాంచనపల్లి

తొలితరం కవి కాంచనపల్లి

Kavi-image

స్వాతంత్య్ర పోరాట యోధునిగా, రాజకీయ నాయకునిగా, న్యాయవాదిగా చరిత్ర గర్వించదగ్గ మహామనిషి కాంచనపల్లి చినవెంకట రామారావు. ఈయ న స్వగ్రామం నల్లగొండ పట్టణ సమీపంలోని చారిత్రాత్మకమైన పానగల్లు. 10 ఏప్రిల్ 1921న కాంచనపల్లిలో జన్మించా రు. తల్లి శేషమ్మ, తండ్రి కాంచనపల్లి రామచందర్‌రావు.

కాంచనపల్లి రెండు సంవత్సరాల వయసులో ఉండగా తల్లి కాలం చేసింది. ఆ తర్వాత కాంచనపల్లి తండ్రి రామచందర్ రావు తాయమ్మను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు ముగ్గురు కుమారులు. కాంచనపల్లి ఆలనాపాలనా అమ్మమ్మ, పెదతల్లి సీతమ్మ చూసుకునేవారు. కాంచనపల్లి తండ్రి రామచందర్ రావు భూస్వామి. రెండు వందల ఎకరాల ఆసామి. పానగల్లు, తిప్పర్తి మండలం సర్వారం గ్రామాలలో భూములుండేవి.

కాంచనపల్లి బడి ఈడుకు వచ్చేనాటికి నిజాం పాలన కొనసాగుతూనే ఉంది. నాడు ఉర్దూ మీడియం పాఠశాలలే అందుబాటులో ఉండేవి. కాంచనపల్లి ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు. విద్యార్థి దశలోనే ఆయనకు పత్రికలు చదవడం అలవాటయ్యింది. నాడు షబ్నవీసు వెంకట రామ నర్సింహారావు సంపాదకత్వంలో వెలువడిన ‘నీలగిరి’ పత్రిక ఆయనపై ప్రభావాన్ని చూపింది. సాహిత్యంపై అభిమానం కలిగింది. హైదరాబాద్‌లో న్యాయవిద్యను చదువుకున్నారు. అప్పటి అయిదో ఆంధ్రమహాసభ(1936)ఆరో మహాసభలకు(1937) మిత్రులతో కలిసి సైకిల్‌పై పోయి హాజరయినారు. దేవుపల్లి రాఘవేంద్రరావుతో కలిసి బ్రిటిషాంధ్రలో పర్యటించారు. బెజవాడలో ఖద్దరు బట్టలు కొనుక్కొని నాగపూరు వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. 1941 లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. మూడవ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు, న్యాయవాది పులిజాల వెంకట రంగారావు వద్ద జూనియర్‌గా చేరారు. సాయుధ పోరాటంలో పాల్గొని ఉరిశిక్షకు గురైన నల్లా నరసింహులు, బాల నిందితుడిగా జైల్లో మగ్గిన ఎర్రబోతు రాంరెడ్డి తదితర కామ్రేడ్ల తరఫున వాదించారు. ఆంధ్రమహాసభల్లో కాంచనపల్లి చురుకుగా పాల్గొన్నారు. భువనగిరిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన పదకొండవ ఆంధ్ర మహాసభల నాటికి ఆయన అతివాదుల వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత కమ్యూనిస్టుపార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సాయుధ పోరాట కాలంలో కృష్ణాజిల్లా రామాపురం గ్రామంలో అరెస్టు అయినారు. కడలూరు, రాయవెల్లూరు, వరంగల్లు జైళ్లలో ఏడాది శిక్షను అనుభవించారు. 1964 కమ్యూనిస్టు పార్టీ చీలిక సమయంలో కూడా కాంచనపల్లి అరెస్టు అయ్యారు.

రాజమండ్రి, ముషీరాబాద్ జైళ్లలో గడిపారు. 1952 లో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ జిల్లా చినకొండూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా పిడిఎఫ్ తరుఫున ఎన్నికైనారు. శాసనసభాపక్ష ఉపనాయకునిగా పనిచేశారు. 1962లో నల్లగొండ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. జిల్లా బోర్డు ఉపాధ్యక్షునిగా నల్లగొండ జిల్లా సహకార మార్కెటింగ్ డైరెక్టరుగా కూడా పనిచేశారు. ఈ కాలంలోనే ఆయన పానగల్లు మ్యూజియం ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. నల్లగొండ పట్టణంలోని నాగార్జున డిగ్రీ కళాశాల గవర్నింగ్ బాడీ సభ్యుడిగా సేవలం దించారు. సాహిత్యం పట్ల అభిలాషతో విద్యార్థిగా ఉండి సొంతగ్రామమైన పానగల్లులో ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయం స్థాపించారు. ఆ రోజుల్లో లిఖిత మాసపత్రికను కూడా నడిపారు. గోల్కొండ, ఆంధ్రవాణి తదితర పత్రికల్లో పలు వ్యాసాలు రాశారు. ఆయన రాసిన కథలు, కవిత్వం కూడా ఈ పత్రికల్లో అచ్చయ్యాయి. 1952లో ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షునిగా కూడా ఆయన విలువైన సేవలందించారు.1967లో నల్లగొండ లో ఏర్పాటైన యువరచయితల సమితికి ఆయన పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ఎంతోమంది యువ రచయిత లను ప్రోత్సహించారు. మాలిక, దర్పణం, సమర్పణ కథా సంకలనాలను వెలువరించారు. సంఘర్షణ వంటి కవితా సంకలనాలను అందించారు. “దర్పణం” సాహితీ త్రైమాసిక పత్రిక సంపాదకుడిగా వ్యవహరించారు. తను రాసిన కథలను కూడా యువ రచయితల సమితి ద్వారానే వెలువరించారు.

నల్లగొండ జిల్లా సాహిత్య సభలు నిర్వహించడంలో కాంచనపల్లి పాత్ర విలువైనది. మూడుసార్లు జిల్లా మహాసభలు నిర్వహించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన 1970,1974,1983లో జిల్లా మహాసభలు నిర్వహించారు. కాంచనపల్లి సాహితీ ట్రస్టును ఏర్పాటు చేశారు.కాంచనపల్లి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కవిత్వం, కథలు, నాటకాలు, గొల్లసుద్దులు రాసారు. తొమ్మిది కథలతో “మా వూళ్ళో కూడానా?!” పేరుతో 1973లో కథా సంపుటిని వెలువరించారు. ఆనాటి వెట్టిచాకిరీ, దానిని పనిపాటలలో ఎదిరించిన తీరు మా ఊళ్లో కూడా నా కథలో అద్భుతంగా చిత్రించాడు కాంచనపల్లి. నాటి నైజాం పాలనలో ముస్లింల పాత్ర చురుకైనది. ఈ కథలో ముస్లిం పాత్రలు అద్భుతంగా చిత్రించారు. కాంచనపల్లి. “అరుణ రేఖలు” పేరుతో కవితా సంపుటిని అందించారు. ఆయన జీవిత కోరిక అయిన రష్యా పర్యటన చేసి ఆ అనుభవాలను “మధుర స్మృతులు”గా అందించారు. కమ్యూనిస్టు నాయకుడు నర్రా రాఘవరెడ్డి నాడు ప్రదర్శించిన గొల్లసుద్దులు, బుర్రకథలు రాసింది కాంచనపల్లే.

విశిష్టమైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకున్న కాంచనపల్లి 13 మార్చి 1992న కాలం చేశారు. ఆయన సతీమణి జానకమ్మ 2007లో కాలధర్మం చెందింది. కాంచనపల్లి గొప్ప మానవతావాది. న్యాయవాదవృత్తి, సాహిత్యంతో ఆయన అనుబంధాన్ని పెంచుకున్నారు. విలువలకు మారుపేరుగా నిలిచారు. తెలంగాణ గర్వించదగ్గ తొలితరం కథకుల్లో కాంచనపల్లి చిన వెంకట రామారావు ఒకరు.