Home ఎడిటోరియల్ సాయుధ పోరులో భూమిపుత్రుల సాహిత్యం

సాయుధ పోరులో భూమిపుత్రుల సాహిత్యం

సంగిశెట్టి శ్రీనివాస్
9849220321

leadersతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నేటితో 70 ఏండ్లు నిండుతున్నాయి. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి నుంచి విముక్తి కోసం జరి గిన ఈ పోరాటం 1946 -51 మధ్య న ఐదేండ్ల పాటు సాగింది. దాదాపు 4,500ల మంది తెలంగాణ బిడ్డలు ఈ ఉద్యమంలో అమరులయిండ్రు. నాలుగువేల గ్రామాలు విముక్తమ య్యాయి. చిత్తప్రసాద్, సునిల్ జెనా లాంటి కళాకారులకు అంత ర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిందీ ఉద్యమం. మా గోఖలేకు జీవం పోసింది. సాయుధ పోరాటంపై పాబ్లొ నెరుడా మొదలు కిషన్ చందర్ వరకు అనేక మంది రచనలు చేసిండ్రు. అమెరికన్ పాప్‌స్టార్ పాల్ రాబ్సన్ ఉద్యమాన్ని గానం చేసిండు. ఉర్దూ, హిందీ, మరా ఠీ, బెంగాళీ, పంజాబీ భాషల్లో కూడా ఈ ఉద్యమంపై సాహిత్యం వెలువడింది. అట్లాగే తెలుగులో కూడా నవలలు, కవిత్వం, పాటలు, నాటకాలు, నాటికలు, కథలు, ఆత్మకథలు, బుర్ర కథలు అనేకం వెలువడ్డాయి. అయితే ఈ సాహిత్యాన్ని రెండు రకాలుగా విభజించాల్సి ఉంటది. ఒకటి సంఘీభావ సాహిత్యం, రెండోది భూమిపుత్రుల సాహిత్యం.
తెలంగాణేతరులు ఉద్యమం పట్ల సహానుభూతితో పోరాట కా లంలోనూ, ఆ తర్వాతి కాలంలోనూ సంఘీభావ సాహిత్య సృజ న చేసినారు. ఇట్లా సాహిత్య సృజన చేసినవారికి కేవలం నిజాం వ్యతిరేకతే ప్రధానం. వీరు తెలంగాణ ప్రజలతో మమేకం కాలే దు. తెలంగాణ తల్లిని వీరు గుర్తించలేదు. తెలంగాణ ఔన్నత్యాన్ని కీర్తించలేదు.
అంతేకాదు కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిలో భాగంగానే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రచారం కల్పించేందుకు రచనలు చేసినారు. మరోవైపు ఇండియ న్ యూనియన్ పోలీసు చర్యను స్వాగతించారు కూడా. సంఘీభావంగా సాహిత్యం సృజించిన వారికి ఉద్యమం మీద ప్రేమే తప్ప ఇక్కడి వాస్తవిక పరిస్థితుల పట్ల పూర్తి స్థాయి అవగాహన లేదు. ఇక్కడి టోపోగ్రఫీ పట్ల పరిజ్ఞా నం కూడా లేదు. వీరి రచనలన్నీ ఉద్యమాన్ని బూస్టప్ చేయడానికి వచ్చిన ప్రచార సాహిత్యంగానే పరిగణిం చాలి. ఈ ప్రచార సాహిత్యమంతా కమ్యూనిస్టు పార్టీ సానుకూల పత్రికల్లోనే అచ్చయ్యేది. ఏ రోజుకారోజు పత్రికల్లో వార్తలను చూసి వాటికి అనుగుణంగా కవి త్వం, కథలు రాయడం జరిగింది.
ఇక రెండోది భూమి పుత్రులు రాసిన సాహిత్యం. తెలం గాణలో పుట్టి తెలంగాణతో మమేకమైన వాళ్ళు సృజిం చిన సాహిత్యం. తెలంగాణ తల్లిని కీర్తించి, ఈ ప్రాంత ఔన్నత్యాన్ని గానం చేసిన వీరుల సాహిత్యమది. ఇందు లో దొరలు, భూస్వాములు, నిజాం వ్యతిరేకత ప్రధా నంగా ఉండింది. నిజాంని నిందించినా తెలంగాణ ప్రాం తాన్ని కీర్తించారు. అట్లాగే తమ రచనల్లో ప్రచారయావ లేకుండా విషయ ప్రాధాన్యంగా రచనలు చేసిండ్రు. ఇక్కడి స్థితిగతులపై పూర్తి అవగాహన ఉండడంతో వీరి రచనల్లో ‘అతి’ లేదు. అంతే గాదు టోపోగ్రఫీ కూడా కరెక్టుగా రికార్డయింది. ఇప్పుడు ఒక్కో విభాగం గురించి స్థూలంగా పరిశీలించి ఆనాటి తెలంగాణ, ఆంధ్రావాళ్ళు రాసిన సాహిత్యాన్ని విశ్లేషించుకోవాలి.
విమర్శనాత్మక దృష్టితో విశ్లేషించినట్లయితేనే అసలు ప్రజా సాహిత్యమేదో తేలుతుంది. అందుకు ప్రక్రియల వారిగా విష యాలను పరిశీలిద్దాం. ఇందులో ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు వెలువడ్డ రచనలను మాత్రమే పరిశీలిం చడమైంది. ఎందుకంటే రాష్ట్రావతరణ తర్వాత, ముఖ్యంగా 1972 తర్వాత పనిగట్టుకొని వాస్తవాలను వక్రీకరించారు. విషయాలను మరు గున పరిచిండ్రు. తెలంగాణ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న 1956కు ముందటి సాహిత్యాన్ని ఇక్కడ విశ్లేషించడమైంది. నవలలు
ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు రాసిన రచనలను ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే ఏ ప్రాంతం వారు ఎలాంటి రచనలు చేసినారో ఒక అంచనాకు రావడానికి వీలవుతుంది. ఇటీవల పి.చంద్ రాసిన శేషగిరితో పాటుగా సాయుధ పోరాటం ఇతివృత్తంగా దాదాపు 25 నవలలు వెలువడ్డాయి. ఇందులో సింహగర్జన, మృత్యుంజయులు, ఓనమాలు, ప్రజలమనిషి నవ లలు 1956కు ముందు రాసినవి. దాశరథి రంగాచార్య, గోప రాజు నారాయణరావు, ముదిగంటి సుజాతారెడ్డి, సరిపల్లె కృష్ణా రెడ్డి, అంపశయ్య నవీన్ తదితరులు ఉద్యమం ముగిసిన తర్వాత తమ చిన్ననాటి జ్ఞాపకాలు, ఇతరుల అనుభవాలు, ఉద్యమ కారుల ఇంటర్వ్యూలను ఆధారంగా చేసుకొని నవలలు రాసి నారు. బొల్లిముంత శివరామకృష్ణ ‘మృత్యుంజయులు’ నవలను పోరాటం జరుగుతున్న కాలంలోనే 1947లో వెలువరించాడు. ఉద్యమానికి దూరంగా ఆంధ్రాప్రాంతంలో ఉన్న ఈ రచయిత పత్రికల్లో వచ్చిన వార్తలు, అండర్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి నాయ కులు చెప్పిన విషయాలను ఆధారంగా చేసుకొని నవల ను రాసిండు. వెట్టి చాకిరి పీడనను వ్యతిరేకించిన ఈ నవలలో పోరాటం జరిగిన ఊరుపేరు లేదు. తెలంగాణలోని ఒక పల్లెగానే దాన్ని రచయిత చిత్రించాడు తప్ప స్పెసిఫిక్‌గా ఊరు పేరు చెప్ప లేదు. అదే ఆళ్వారుస్వామి తన ప్రజలమనిషి (1955లో ప్రచు రణ) నవలలో నిజామాబాదు జిల్లా దిమ్మగూడెం అని ఊరి పేరు ను పేర్కొన్నాడు. మృత్యుంజయులు నవలలో రెడ్డి కులస్థుడైన దేశ్‌ముఖ్ శేరిదారు అప్పన్న. ఈయన దేశ్‌ముఖ్ పొలంలో పని చేయడానికి నిరాకరించినందుకు మల్లారెడ్డి భార్య రాము లమ్మ ఇంట్లో చొరబడి ఆమె కూతురును చెరబట్టడం వాస్తవ విరు ద్ధంగా ఉన్నది. దొర దగ్గర జీతగాడు దొర కులానికి చెందిన మల్లారెడ్డి కూతురుని చెరబట్టేందుకు సాహసించలేడు. ఓనమాలు నవల రాసింది మహీధర రామ్మోహనరావు. ఇందులో నైజాం ప్రభుత్వం ఢిల్లీ పాలకులతో పొత్తు పెట్టుకొని రహస్యంగా ఆయుధాలు దిగుమతి చేసుకొని హిందువులపై ప్రయోగించేవారని రాసిండు. ఇది కూడా వాస్తవ విరుద్ధం. ఢిల్లీ పాలకులు హైదరాబాద్‌ని బలవంతంగా విలీనం చేసుకొని దా దాపు లక్షమంది ముస్లింలను ఊచకోత కోసిందనేది చరిత్ర. తెలంగాణేతర రచయితలకు ఇక్కడి హిందూ ముస్లిం జీవన సంసృ్కతి, భాషా మైత్రి తెలియక పోవడంతో మత ఘర్షణలకు, ఖాసీం రజ్వీ ఆగడాలకు అధిక ప్రాధాన్యత నిచ్చారు. ఓనమాలు నవలలో ఉర్దూ, పార్సీ భాషాధిపత్యంలో తెలుగు నలిగిపోతుం దని రచయిత చెప్పిండు. ‘ఓనమాలు’ పుస్తకాన్ని తెచ్చుకొని సంఘ సభ్యులు రహస్యంగా చదివేవారని కూడా రాసిండ్రు. నిజానికి ఉర్దూ అనేది హైదరాబాద్ రాజ్యంలో అధికార భాష. దీనికి మతంతో సంబంధం లేదు.
హిందువులు కూడా ఈ భాషలోనే చదువుకునే వారు. ఉస్మా నియా యూనివర్శిటీ ఏర్పడ్డ తర్వాత ఈ భాషలో ఉన్నత చదు వులు కూడా సాగాయి. అట్లాంటిది ఉర్దూకు మతం రంగు పులి మిండ్రు. ఇది ప్రాంతేతరులు తెలంగాణ జీవితాన్ని దగ్గరగా గమ నించకుండా రాయడం వల్లనే అపార్థాలు చోటు చేసుకున్నాయి.
తెలుగు భాషకు ప్రభుత్వం ప్రోత్సాహం లేక పోయినప్పటికీ సంస్థానాల్లో, గ్రామాల్లోని కాన్గి బళ్ళలో తెలుగు భాష వెల్లి విరిసింది. మొత్తంగా ఉద్యమం జరుగుతున్న కాలంలో మృత్యుం జయులు, సింహగర్జన నవలలు వెలువడ్డాయి. పోరాట విరమణ తర్వాత ఓనమాలు, ప్రజలమనిషి అచ్చయ్యాయి. ఆంధ్రా వాళ్ళు రాసిన నవలల్లో దొరలు, దేశ్‌ముఖ్‌ల కన్నా నిజాం రాజే రాక్షసుడిగా చిత్రితమయిండు. అదే ప్రజలమనిషి నవలలో దొరలు ప్రధాన విలన్లు. పీడకులు.
కథలు
తెలంగాణ సాయుధ పోరాటం, హైదరాబాద్‌పై పోలీసు చర్య నేపథ్యంలో ఇప్పటి వరకు 150కి పైగా కథలు వెలువడ్డాయి. వీటిలో 22 కథల్ని వాసిరెడ్డి నవీన్ ‘తెలంగాణ సాయుధ పోరాట కథలు’ పేరిట మొదటిసారిగా 1982లో అచ్చేసిండు. నూటికి తొంభైశాతం మంది కథకులు తాము తెలంగాణ భూమ్మీద కాలు మోపకుండానే, ఇక్కడి టోపోగ్రఫీ తెలియకుండానే చిలువలు పలువలు కల్పించి కమ్యూనిస్టు భావజాల ప్రచారమే పరమా వధిగా కథలు రాసినారు. ‘శ్రీ విపంచి’ అనే అతను ‘ఛలో హైద రాబాద్’ అనే కథలో మునగాల సరిహద్దుల్లో దేవరుప్పల గ్రామం ఉందని రాసిండు. అలాగే మరో కథలో ప్రత్యేక విలే కరికి మధిర తాలూకాలో పాల్వంచ కనబడింది. దేవరుప్పల ఈ గ్రామం పోరాట నడిగడ్డ జనగామ దగ్గర ఉన్నది. అలాగే గెరిల్లా గోవిందు, పాగల్ యల్లమంద, మత్తానయ్య మరణం, బారికేడ్లు మొదలైన కథలు పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. శారద (నటరాజన్) ‘కొత్త వార్త’ కథలో పోరాడితే గెరిల్లాల చేతిలో చావు ఖాయమని తెలిసి 200ల మంది రజాకార్లు గెరిల్లాలతో కలిసి పోతారని వాస్తవ విరుద్ధమైన కథనమల్లిండు. ‘గెరిల్లా గోవిందు’ కథ కూడా ఇలాంటిదే! శారదతో పాటుగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన తెన్నేటి సూరి, తుమ్మల వెంకటరామయ్య, ఉప్పల లక్ష్మణరావు, ప్రయాగ, అట్లూరి పిచ్చేశ్వరరావు, లక్ష్మీ కాంత మోహన్, రాంషా తదితరులు సాయుధ పోరాటం ఇతి వృత్తంగా కథలల్లిండ్రు. ఇవన్నీ కూడా తెలంగాణలో ఆయుధం చేతబట్టిన వారికి భరోసా ఇచ్చే విధంగా, మిగతా ప్రాంతాల్లో పోరాటం విస్తరించేందుకు ఉపయోగ పడేలా ఉండేవి. వీళ్ళు ఉద్యమాన్ని రొమాంటిసైజ్ చేసిండ్రు. అయితే తెలంగాణకు చెందిన ఆవుల పిచ్చయ్య, పర్చా దుర్గాప్రసాదరావు, కాంచనపల్లి చినవెంకటరామారావు, వట్టికోట ఆళ్వారు స్వామి, పొట్లపల్లి రామా రావు తదితరులు ఉద్యమంలో భాగమై, మమేకమై కథలు రాసిండ్రు. ఉద్యమాన్ని ఉద్యోగ జీవితంలో భాగంగా దగ్గర నుంచి చూసి భాస్కరభట్ల కృష్ణారావు ‘ఇజ్జత్’ కథ రాసిండు. ఆవుల పిచ్చయ్య ‘ఊరేగింపులు’ దొడ్డి కొమురయ్య అమరత్వం నేపథ్యంలో రాసిన కథ. ఈయన ‘దౌరా’, ‘వెట్టి చాకలి దినచర్య’, ‘చపరాసీ దినచర్య’ వెట్టి, దొరల దోపిడీ దౌర్జన్యాలు కేంద్రంగా చేసుకొని రాసిన కథలు. ఈయన ఒక చేతిలో ఆయుధం మరో చేత్తో కలం పట్టిండు. ఆవుల పిచ్చయ్య కథలన్నీ అడివి బాపిరాజు సంపాదకత్వంలోని ‘మీజాన్’ పత్రికలో అచ్చయ్యాయి.
ఆళ్వారుస్వామి జైలులోపల సంపుటే గాకుండా ‘రాజకీయ బాధితులు’, ‘గిర్దావరు’, ‘కాఫిర్లు’ మొదలైన కథలు ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని, దాని తదనంతర పరిస్థితుల్ని రికార్డు చేశాయి. ఆంధ్రాప్రాంత కథకులు మాదిరిగా ఈయన సాయుధ పోరాట కాలానికే పరిమితం గాకుండా పోలీసుచర్య, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కథలు రాసిండు. అదే సమయంలో నెహ్రూ సోషలిస్టు ప్రభు త్వంలో ప్రజలకు మేలు జరుగుతుందని నమ్మినందుకు చింతించిండు. హిందూముస్లిం సఖ్యతను చిత్రించిండు.
తెలంగాణకు చెందిన కథకులు అడ్లూరి అయోధ్యరామకవి, పొట్లపల్లి రామారావు, వట్టికోట ఆళ్వారుస్వామి, పర్చా దుర్గా ప్రసాదరావులు 1956కు ముందే సాయుధ పోరాటంపై తాము రాసిన కథల్ని వెలువ రించారు. ఆంధ్రాకు చెందిన గంగినేని వెంకటేశ్వరరావు ఇంటర్వ్యూల రూపంలో తాను సేకరించిన సమాచారాన్ని ‘ఎర్రజెండాలు’ పేరిట మూడు భాగాలుగా వెలు వరించిండు. అలాగే అభ్యుదయ రచయితల సంఘం కూడా హైదరాబాద్ నుంచి 1945లోనే కథా సంపుటాలు వెలువరిం చింది. సాయుధ పోరాట కథలు ప్రముఖంగా దొరల దౌర్జ న్యాలని, రజాకార్ల దురాగతాలని, కమ్యూనిస్టుల పోరాట పటి మను, అధికారుల దాష్ట్టీకాన్ని చిత్రించాయి. తెలంగాణ కథకులు ముఖ్యంగా ఆళ్వారుస్వామి, పొట్లపల్లి రామారావులు జైలులోని ఖైదీలు కేంద్రంగా ఉద్యమాన్ని రికార్డు చేసిండ్రు. అడ్లూరి అయోధ్యరామకవి కాంగ్రెసు భావజాలంతో రజాకార్ల దుర్మా ర్గాలని ఎండగట్టిండు. పి.వి.నరసింహారావు రాసిన కథల్లో ‘గొల్ల రామవ్వ’ కాకతీయ పత్రికలో ప్రచురితమయింది. ఉద్యమంతో మమేకమైన బహుజనులను చిత్రించింది. ఇప్పటికీ “కాకతీయ” పాత ప్రతులు అందుబాటులో లేవు. ఈ పత్రిక ప్రతులు అంద రికీ అందుబాటులోకి వచ్చినట్లయితే మరిన్ని మంచి కథలు తెలుగు పాఠకులకు తెలిసే అవకాశముంది. అలాగే సారథి అనే పత్రికను తాళ్ళూరి రామానుజస్వామి అనే ఖమ్మంకు చెందిన కాంగ్రెసు కార్యకర్త నడిపించిండు. ఈయన పీటలమీద పెండ్లి అనే కథల సంపుటిని కూడా వెలువరించాడు. సారథి పత్రికలో అనేక మంది కాంగ్రెసు నాయకులు రచనలు చేసినారు. దాశరథి కృష్ణమాచార్య కథలు కూడా అందులో ఉన్నాయి. ఈయన కథకుడిగా కూడా ప్రసిద్దుడే! ఈ పత్రిక ప్రతులు కూడా ఇప్పుడు దొరకడం లేదు. ఇల్లిందల సరస్వతీదేవి, ఎల్లాప్రగడ సీతా కుమారిల కథలని సమగ్రంగా పరిశీలించినట్లయితే సాయుధ పోరాటంపై వాళ్ళు రాసిన కథలు దొరుకుతాయి.
కవిత్వం
తెలంగాణ సాయుధ పోరాట కవిత్వం మొత్తం తెలంగాణేతరులే రాసిండ్రనే విధంగా ఇన్నేండ్లు సీమాంధ్ర విమర్శకులు ఒక అభిప్రాయాన్ని కలిగించారు. ఆరుద్ర (త్వమేవాహం), సోమ సుందర్ (వజ్రాయుధం), గంగినేని (ఉదయిని), అనిసెట్టి (అగ్నివీణ), రెంటాల (సర్పయాగం, సంఘర్షణ), కె.వి.రమణా రెడ్డి (భువనఘోష, అడవి), ఎర్రోజు మాధవాచార్యులు (మఘ వలయం) ఇంకా అనేకమంది పోలీసు చర్య ద్వారా తెలం గాణకు విముక్తి కలిగిందనే భావన కలిగించారు. ఈ రచనలన్నీ నిజాంని, దేశ్‌ముఖ్‌లని, దేశ్‌పాండ్యాలను, దొరలను లక్ష్యంగా చేసుకొని వారి పీడనను నిలదీస్తూ రాసినవే! ఒక్క మఘవల యం, (సర్పయాగం?) తప్ప అన్నీ 1956కు ముందు వెలు వడ్డవే! వీళ్ళు నెహ్రూ, పటేల్ సైన్యాల దాష్టీకాలను నిరసించ లేదు. కనీసం రికార్డు చేయలేదు. శ్రీరంగం శ్రీనివాసరావు హైద రాబాద్‌లో నిజాం సంస్థానంలో సాయుధ పోరాట కాలంలో కొలువు చేసిండు. పోరాటం గురించి ఒక్క కవిత కూడ రాయలేదు. అదే తెలంగాణ దళిత కవి వయ్య రాజారాం
‘రంగు రంగుల మారి నెవురయ్యా/ నీ రంగు బైరంగమాయె నెవురయ్యా/ కుడిన టాటాగాళ్ళు ఎడమ బిర్లాగాళ్ళు/ నడినెత్తిన ట్రామసయ్య నెక్కించుక/ సోషలిజమంటావు నెవురయ్యా నీ/ వేషమంత దెలిసింది నెవురయ్యా’ అని హైదరాబాద్‌పై పోలీసు చర్య ఆంతర్యాన్ని వెల్లడించాడు.
మరో అజ్ఞాతకవి
‘పటేల్ నెవురులొచ్చినా గుర్ఖా సిక్కులదోలినా ఎత్తిన జెండా దించకోయ్ అరుణ పతాకకు జై’ అని నినదించిండు.
దాశరథి, కాళోజీలు స్వయంగా సాయుధ పోరాటంలో భాగమయిండ్రు. దాశరథి కొన్నాళ్ళు అండర్‌గ్రౌండ్‌కు పోయిం డు. కాళోజి “నవయుగంబున నాజీ వృత్తుల నగ్ననృత్యమింకె న్నాళ్ళు/ పోలీసు అండను దౌర్జన్యాలు/ పోషణ బొందేదె న్నాళ్ళు’ అంటూ నిజాం ప్రభుత్వాన్ని 1944లోనే నిలదీసిండు.
తెలంగాణ కవులు ఉద్యమంలో భాగంగా ‘తెలంగాణ తల్లి’ భావనను కవిత్వంలో ప్రవేశ పెట్టిండ్రు. అదే ఆంధ్రా ప్రాంత కవులు ఆ పని చేయలేదు. ఎందుకంటే వారికి తెలంగాణ మాతృభూమి కాదు. దాశరథి తెలంగాణ తల్లి గీతం అందుకు ప్రసిద్ది.
“తెలుగు తల్లి బిడ్డలం తెలంగాణ వీరులం/ మాతృదేశ ముక్తి కొరకు పోరుస లుప కదిలినాం/ తరతరాల నుండి మేము సాగనంప దలచినాం/ వెట్టిపనులు కట్టిపెట్టి జబర్దస్తి నెగరగొట్టి
స్వేచ్ఛగాను బ్రతుకు కొరకు ఐక్యమయ్యి నిలిచినాం” దళాలు మార్చింగ్ సాంగ్‌ని ఆలపించాయి. తిరునగరి రామాంజ నేయులు లాంటి ఒకరిద్దరు ఆంధ్రా ప్రాంతంలో పుట్టినప్పటికీ వారు స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణతో తర్వాతి కాలంలో కూడా మమేకమయిండ్రు కాబట్టే నవలలు, నాటకాలు, కవిత్వాన్ని తెలంగాణని గుండెలకు హత్తుకొని రాసిండ్రు. ఇలాంటి ఒకరిద్దరు మాత్రమే మినహాయింపు. ఆంధ్రా ప్రాంత కవులు తెలంగాణ గురించి ఎంత రాసినా ఇక్కడి వారితో మమేకం కాలేక పోయిండ్రు. ఇక్కడి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారే గానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించలేదు. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరుద్ర, కె.వి.రమణారెడ్డి, శ్రీ.శ్రీ ఇంకా అనేక మంది ఉద్యమ స్థాయిలో వ్యతిరేకించిండ్రు. కేవలం వ్యతిరేకించడమే కాదు ఉద్యమంపై విషం చిమ్మిండ్రు.
ఆంధ్రప్రాంతం నుంచి రాసిన కవులందరూ వినికిడి జ్ఞానంతో కమ్యూనిస్టు ఉద్యమానికి సంఘీభావంగా కవిత్వమల్లిండ్రు. అదే తెలంగాణ కవులు యుద్ధం మధ్యలో ఉండి కవిత్వమల్లిండ్రు. అట్లా అల్లిన వారిలో సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, వయ్యా రాజారాం ప్రభృతులు ప్రముఖులు. సుద్దాల హను మంతు లాంటి వాళ్ళు ఉద్యమ సమయంలో గ్రామ గ్రామాన తిరిగి పాటలను కైగట్టిండ్రు. అయితే అవేవీ ఆయన కాపాడుకోక పోవడంతో 1983 వరకూ పుస్తక రూపంలో రాలేదు. ‘పల్లెటూరి పిల్లగాడా పసుల గాసే మొనగాడా’ లాంటి పాటలు ‘మాభూమి’ సినిమాతో ఇప్పటి తరానికి కూడా తెలియ వచ్చాయి. బండి యాదగిరి పాట ‘బండెన్క బండి కట్టి’ఇప్పటికీ అనేక కాంట్రవర్శీలకు మూలం. బండియాదగిరికి నివాళి అర్పిస్తూ
“కోటపాటి దాడి యాదన్నా/ బల్ భేషుగా చేసావ్ యాదన్నా/ అందుకో జోహారు యాదన్నా/ నీపేరు నిలబెడతాం యాదన్నా” అని పాడుకున్నరు.
సాయుధ పోరాటంలో అమరులైన వారి సృ్మతి గీతాలు ఎక్కువగా తెలంగాణ వాళ్ళే రాసిండ్రు. దొడ్డికొమురయ్యను యాద్జేసుకుంటూ
“తెలుగు తల్లి బంధాలు త్రెంచివేయుటలోన/ బలమట్లు చూపించి తొలి బలిగ నీవేగ/ శూరత్వమన నీవెరా కామ్రేడ్ జోహరు లివిగోరా” అంటూ ఒకరు పాట రాయగా ఇంకొకరు
“కష్టజీవుల పల్లి / కడవెండి గ్రామములో/ కొమురయ్య, మల్లయ్య/ అన్నదమ్ములు వారు” అంటూ వారి చరిత్ర నంత కైగట్టిండ్రు.
నాటకం
దున్నే వాడిదే భూమి అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకు పోయిన నాటకం ‘మాభూమి’. దీని సంయుక్త రచయితలు సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరా వులు. దాదాపు 25 లక్షల మంది ప్రేక్షకులు ఆనాడు ఈ నాటకాన్ని తిలకిం చారంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ నాటకాన్ని బ్లిట్జ్ పత్రిక సంపా దకుడు కె.ఎ.అబ్బాస్ ఎంతగానో కొనియాడారు. తెలం గాణ నుంచి కోదాటి లక్ష్మీనరసింహారావు, వట్టికోట ఆళ్వారు స్వామి, భాస్కరభట్ల కృష్ణా రావు, తిరునగరి రామాంజనేయులు నాటకాలు రాసిండ్రు. తెలంగాణ తల్లిని గుండెలకు హత్తుకొని సాహిత్యాన్ని సృజించిన వాళ్ళు చాలా మంది ఉన్నరు. ఉద్యమ కాలంలో వివిధ పత్రికల్లో వచ్చిన కవిత్వం, కథలు, నాటకాలు ఇప్పటికీ పుస్తక రూపంలో రాలేదు.
సమగ్ర సాహిత్యం అందుబాటులో ఉన్నప్పుడే సాధికారి కంగా వ్యాఖ్యానించడానికి వీలైతది. ఈ 70వ వార్షికోత్సవం సంద ర్భంగా ఇప్పటికైనా ప్రభుత్వమో, తెలుగు విశ్వవిద్యాలయమో పూనుకొని సాయుధ రైతాంగ సాహిత్యాన్ని సంపుటాలుగా అచ్చేయాలి. అంతేగాదు ధనగరే లాంటి పరిశోధకులు వెలుగు లోకి తెచ్చిన విషయాల్ని కూడా తెలుగు పాఠకులకు అందు బాటులోకి తేవాలి. సాయుధ రైతాంగ పోరాటాన్ని ఇప్పటికీ ఆధిపత్య కులాల దృక్కోణంలోనే చూస్తున్నారు. దీని వల్ల మెజారిటీగా ప్రాణాలర్పించిన దళిత, బహుజనుల త్యాగాలకు గుర్తింపు, గౌరవం లేకుండా పోతుంది. సాహిత్యంలో కూడా అదే జరుగుతుంది.
(తెలంగాణ సాయుధ పోరాట
70వ వార్షికోత్సవ సందర్భంగా)