Saturday, April 20, 2024

ఆర్‌విఎంలు!

- Advertisement -
- Advertisement -

ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఓటు హక్కు వినియోగం లోపరహితంగా, గరిష్ఠ స్థాయిలో జరిగినప్పుడే ప్రజల ఆకాంక్ష మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నారనే సంతృప్తి కలుగుతుంది. ఓటర్లు ఉపాధి పనుల మీదనో, చదువు, ఉద్యోగం తదితర వ్యాపకాలపైనో ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్థిరపడినప్పుడు వారొకచోట, వారి ఓటొకచోట అయిపోతున్నది. పర్యవసానంగా ఆ ఓటు వినియోగానికి నోచుకోడం లేదు. 2019 సాధారణ ఎన్నికల్లో 30 కోట్ల మంది ఓట్లు పడలేదని ఎన్నికల సంఘం గుర్తించింది. పర్యవసానంగా ఎన్నికల్లో ప్రజల మొగ్గు స్పష్టంగా ప్రతిబింబించడం లేదు. దీనికి తెర దించడానికి ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నం ఫలించిన సూచనలు కనిపిస్తున్నాయి. వలస ప్రజలు తామున్నచోటి నుంచే ఓటు వేయడానికి ఉపకరించే రిమోట్ ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌ను కనుగొన్నామని ఇసి ప్రకటించింది. ఈ యంత్రాన్ని జనవరి 16న దేశంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ముందు ప్రదర్శించాలని నిర్ణయించింది.

ముందుగా దీని పని తీరు, దానిని వినియోగంలోకి తేవడంలో ఎదురయ్యే సవాళ్ళ గురించి వివరిస్తూ ఒక పత్రాన్ని వాటికి పంపించింది. దానిపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరింది. ఓటు హక్కు వినియోగంలో పరిపూర్ణతను సాధించేందుకు ఇసి పడుతున్న తాపత్రయం అభినందనీయం. అయితే ఇవిఎంలపైనే అనుమానాలింకా కొనసాగుతున్నందున ఈ ఆర్‌విఎంలకు రాజకీయ పార్టీల మద్దతు పూర్తిగా లభిస్తుందా అనే సందేహం సహజంగానే తలెత్తుతుంది. ఆర్‌విఎంల ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యతిరేకించింది. ఈ యంత్రం ఎన్నికల వ్యవస్థ మీద గల విశ్వాసాన్ని దెబ్బ తీస్తుందని పేర్కొన్నది. ఒక్క ఆర్‌విఎంను 72 నియోజక వర్గాల వలస ఓటర్లు ఒకేసారి వినియోగించుకోవచ్చునని తెలుస్తున్నది. ముందుగా ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకొని స్వస్థలాల్లోని తమ ఓటు వివరాలను తెలియజేస్తే ఆ మేరకు ఆర్‌విఎంలో వాటిని పొందుపరుస్తారు. వాస్తవానికి వలస పౌరుల ఓట్లు తరచూ తస్కరణకు గురి అవుతున్నాయి.

దీనిని తొలగించవలసిన అవసరం ఎంతైనా వుంది. కేవలం 24 దేశాల్లోనే ఇవిఎంలను వినియోగిస్తున్నారన్న సమాచారం ఈ యంత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల మద్దతు చేకూరలేదని స్పష్టం చేస్తున్నది. 241 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్న అమెరికాలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ బ్యాలట్ పత్రాలనే వినియోగిస్తున్నారు. కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే ఇవిఎంలపై ఆధారపడుతున్నారు. జర్మనీలో 2005లో ఇవిఎంలను ప్రవేశపెట్టినప్పటికీ 2009లో అక్కడి అత్యున్నత న్యాయస్థానం వాటిని రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించింది. ఇండియాలో 1988లో ఇవిఎంల చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. మన దేశంలో ప్రతి ఎన్నిక సమయంలోనూ ఓడిన వారు ఇవిఎంలను తప్పుపట్టడం మామూలైపోయింది. వాటిలోని లోపాలను ఎత్తి చూపుతూ నిపుణులు వివరించిన సందర్భాలున్నాయి. ఎన్నికల సంఘం మాత్రం వాటిని కొట్టివేస్తూనే వుంది. ఇవిఎంల నిజాయితీని నిరూపించడానికి వివిప్యాట్ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) లను ప్రవేశపెట్టారు.

ఓటు వేయగానే ఈ కాగితం ఓ క్షణ కాలం కనిపించి ఆ ఓటు సవ్యంగా వినియోగం అయ్యిందో లేదో ఓటరుకు తెలియజేస్తుంది. అయినా ఇవిఎంలపై ఆరోపణల వెల్లువ తగ్గడం లేదు. కాని బ్యాలట్ పత్రాల ద్వారా ఓటు హక్కు వినియోగించుకొనేటప్పుడు ఎదురయ్యే సమస్యలు ఇవిఎంల విషయంలో ఎదురు కావనేది వాస్తవం. అందుచేత ఆర్‌విఎంలు కూడా దేశంలో వీలైనంత తొందరలో అమల్లోకి వస్తే ఆశించిన మంచి తప్పనిసరిగా జరుగుతుందని భావించవచ్చు. ఆర్‌విఎంలు ఇంటర్‌నెట్‌తో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా పని చేస్తాయని చెబుతున్నారు. ఇది ఓటు గోప్యతను కాపాడుతుందని భావించవచ్చు. 2014 సాధారణ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 9 లక్షల 30 వేల పోలింగ్ కేంద్రాల్లో 14 లక్షల ఇవిఎంలను ఉపయోగించారు. కేవలం 13 లక్షల మంది జనాభా వున్న యూరప్‌లోని ఎస్తోనియా 2005 నుంచి ఇవిఎంలను వినియోగిస్తున్నది.

ఆర్‌విఎంలను ఆచరణలోకి తీసుకురాడానికి మన ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని, ఎన్నికల నిర్వహణ నిబంధనలను, ఓటర్ల జాబితా నమోదు చట్టాన్ని సవరించవలసి వుంటుంది. ఆర్‌విఎంలను కూడా దొంగ ఓటర్లు దుర్వినియోగం చేసే ప్రమాదం లేకపోలేదు. దానిని అరికట్టడానికి ఆయా ప్రాంతాల ఓటర్ల గురించి తెలిసిన పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవలసి వుంటుంది. ఆర్‌విఎంలకు ఆమోదం లభిస్తే 2023లో జరగబోయే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వాటిని వినియోగిస్తారు. ఆ తర్వాత 2024 పార్లమెంటు ఎన్నికల్లో వాడుతారు.ప్రజాప్రాతినిధ్యం పరిపూర్ణంగా ప్రతిఫలించడం ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరం. అయితే రాజకీయ పార్టీలు, అభ్యర్థులలో దొడ్డిదారుల్లో గెలుపు సాధించాలనుకొనే దుష్ట ధోరణి తొలగినప్పుడే ఏ యంత్రం వల్లనైనా ఫలితం పూర్తిగా లభిస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News