Friday, April 19, 2024

ఇక రిమోట్ ఓటింగ్..

- Advertisement -
- Advertisement -

ఇక ఓటేసేందుకు సొంతూరుకు వెళ్లక్కర్లేదు!
ఇసి రిమోట్ ఓటింగ్ మిషన్ యోచన
ఒకే పోలింగ్ కేంద్రం నుంచి 72నియోజకవర్గాల్లో ఓటేసే వీలు
జనవరి 16న నమూనా ప్రదర్శన
అన్నిరాజకీయ పార్టీలను ఆహ్వానించిన ఇసి

న్యూఢిల్లీ: ఉపాధి కోసమో, ఉద్యోగరీత్యానో సొంత ఊళ్లను వదిలిపెట్టి వేరే రాష్ట్రాల్లో ఉండే వారు దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారు సొంత ఊళ్లకు వెళ్లి ఓటు వేయడం గగనమే. ఆసక్తి లేకనో, ప్రయాణ ఖర్చులను భరించలేకనో వారిలో చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. అందువల్లనే ఇప్పటికీ దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఓటు హక్కును వినియోగించుకునే వారు సగటున 65 శాతానికి మించడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడుతోంది. దేశీయంగా వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు తాము ఉన్న చోటునుంచే తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసే విధంగా రిమోట్ ఓటింగ్ మిషన్(ఆర్‌విఎం)ను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఈ రిమోట్ ఓటింగ్ మిషన్‌కు సంబంధించి ఎన్నికల సంఘం ఓ కాన్సెప్ట్ నోట్‌ను సిద్ధం చేసింది. దీంతో పాటుగా ఓ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నమూనాను రూపొందించింది. ఒకే పోలింగ్ బూత్‌నుంచి 72 నియోజకవర్గాల్లో ఓటుహక్కును వినియోగించుకునే విధంగా ఈ రిమోట్ ఇవిఎంను రూపొందించారు. జనవరి 16న ఈ నమూనా మిషన్ ప్రదర్శనకోసం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు ఇసి గురువారం ఒక ప్రకటనలో తెలియజేసింది. రియోట్ ఓటింగ్‌ను అమలులోకి తెచ్చే ముందు ఆచరణలో ఎదురయ్యే న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఇసి వివరించింది.

అందుకోసం రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరనున్నట్లు తెలిపింది. ‘2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం పోలింగ్ నమోదయింది. దాదాపు 30 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోకపోవడం ఆందోళనకరం. ఓటరు తమ కొత్త నివాసప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకోకపోవడానికి అనేక కారణాలున్నాయి. అంతర్గత వలసల( డొమెస్టిక్ మైగ్రంట్స్) కారణంగా ఓటు వేయలేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విద్య, ఉద్యోగం, పెళ్లి ఇలా అనేక కారణాలతో చాలామంది స్వస్థలాలను వదిలి వెళుతున్నారు.

అయితే తమ సొంత స్థలాల్లో శాశ్వత నివాసాలు, ఆస్తలు కలిగి ఉండడం కారణంగా వారు తమ స్వస్థలాలు, లేదా నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితానుంచి తమ పేర్లను తొలగించుకోవడానికి ఇష్టపడడం లేదు. దేశంలో దాదాపు 85 శాతం మంది ఇలాంటి వాళ్లే’ అని ఇసి ఆ ప్రకటనలో వెల్లడించింది. వలస వెళ్లిన వాళ్లు కూడా ఓటుహక్కును వినియోగించుకునేందుకే ఈ రిమోట్ ఓటింగ్‌పై దృష్టిపెట్టినట్లు తెలిపింది. ప్రజాస్వామ్య పండగలో ఎక్కువమంది పాల్గొనేలా ఈ రిమోట్ ఓటింగ్ గొప్ప నాంది కాబోతుందని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News