Home ఎడిటోరియల్ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం

సమాఖ్య స్ఫూర్తికి విఘాతం

Article about Modi china tour

 

పదిహేనవ ఆర్థిక సంఘానికి (ఫైనాన్స్ కమిషన్) కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరిశీలనాంశాలను (టర్మ్ ఆఫ్ రెఫరెన్స్) వ్యతిరేకిస్తూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని విజయవాడలో సోమవారం జరిగిన ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రుల సమావేశం నిర్ణయించటం ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తున్నది. ఆ పరిశీలనాంశాలు అభివృద్ధిలో, కేంద్ర పథకాల అమలులో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేసేవిగా, వెనుకబడిఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేసేవిగా ఉన్నాయన్న భావన బలంగా ఉంది. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన వాటాను నిర్ణయించటం ఆర్థిక సంఘం ప్రధాన విధి. దాని నివేదిక కేంద్రానికి శిరోధార్యం. అయితే దాని సిఫారసులు దానికి నివేదించిన పరిశీలనాంశాల పరిధిలోనే ఉంటాయి. 15వ ఆర్థిక సంఘం సిఫారసులు 2020 2025 వరకు అమలులో ఉంటాయి. 14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతాన్ని సిఫారసు చేసి రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిందని కేంద్రం వ్యధ చెందుతోంది. అందువల్లనే కేంద్ర ప్రాయోజిత పథకాలను సగానికిపైగా తగ్గించటంతోపాటు వాటికి రాష్ట్ర వాటాను పెంచింది. మోడీ అధికారానికి వచ్చిన కొత్తలో ‘సమాఖ్య స్ఫూర్తి’, ‘సహకార ఫెడరలిజం’, ‘టీం ఇండియా’ వంటి పదాలు గుప్పించారు. కాని ఆచరణ అందుకనుగుణంగా లేదు. 15వ ఆర్థిక సంఘం పరిశీలనాంశాలు చూస్తే కేంద్రం ఆర్థిక పెత్తందారీతనాన్ని కోరుకుంటున్నట్లు అర్థం అవుతుంది. రాష్ట్రాలతో సంప్రదించకుండా పరిశీలనాంశాలను ఆర్థిక సంఘానికి ఇవ్వటంలోనే దాని ఏకపక్ష, ఆధిపత్య ధోరణి విదితమైంది.
కేంద్రం నివేదించిన పరిశీలనాంశాలు అన్యాయంగా, రాజ్యాంగంలో పొందుపరిచిన ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలపై కఠినమైన షరతులు విధించేవిగా ఉన్నాయన్న అభిప్రాయం గూర్చి చర్చించేందుకు కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐసాక్ ఏప్రిల్ 10న తిరువనంతపురంలో దక్షిణాది ఆర్థికమంత్రుల సమావేశం పిలిచారు. కేరళతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, పుదుచ్చేరి ఆర్థిక మంత్రులు హాజరుకాగా తమిళనాడు, తెలంగాణ వాటి సొంత కారణాలరీత్యా హాజరుకాలేదు. కాగా ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిచ్చిన రెండవ సమావేశానికి పై రెండు రాష్ట్రాలు గైరుహాజరు కొనసాగించగా ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఆర్థిక మంత్రులు లేక ఆర్థిక నిపుణులు హాజరైనారు. తొలి సమావేశంలో పాల్గొన్న నాలుగు రాష్ట్రాలకు అదనంగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఢిల్లీ ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. తమిళనాడు, తెలంగాణ పాల్గొనకపోయినా వాటి ప్రతినిధులు ప్రైవేటుగా తమ ప్రయత్నంతో ఏకీభవిస్తున్నారని కేరళ ఆర్థికమంత్రి ఐసాక్ చెప్పటం గమనార్హం. అంతేగాక తమిళనాడు ప్రభుత్వం కొన్ని పరిశీలనాంశాలను గట్టిగా వ్యతిరేకిస్తూ, కేంద్రం పన్ను ఆదాయానికి రాష్ట్రం నుంచి సమకూరిన ఆదాయం ప్రాతిపదికగా వెయిటేజి ఇవ్వాలని ఆర్థిక సంఘానికి రాసింది. వ్యవసాయం, ఆర్యోగం, విద్య, పట్టణ, గ్రామీణ అభివృద్ధి వంటి వాటిలో కేంద్ర మితిమీరిన జోక్యాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్‌ఎస్ ప్లీనరీలో నిరసించటం తెలిసిందే.
ఫెడరల్ ద్రవ్య అధికారాలు వినియోగించటంలో రాష్ట్రాల హక్కులను నిలదొక్కుకోవటం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం అనేది ఈ బిజెపియేతర పార్టీల సమాలోచనలకు ప్రాతిపదిక. నిధుల పంపిణీకి 1971కి బదులు 2011 జనాభా లెక్కలు ఆధారంగా తీసుకోవాలన్న నిబంధన వల్ల జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపు తగ్గిపోతుంది. అలాగే రాష్ట్రాలు రుణాలు పొందేందుకు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని 3 నుంచి 1.7 శాతానికి తగ్గించే సూచన ఉంది. కేంద్ర పథకాల అమలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రాంట్లు మంజూరు అన్న విధానాన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అన్నిటికీ మించి, 14 వ ఆర్థిక సంఘం రాష్ట్రాల వాటా బాగా పెంచిందని, అందువల్ల కేంద్ర ఆర్థిక పరిస్థితులపై పన్నుల పంపిణీ ప్రభావాన్ని సహేతుకంగా మదింపు చేయాలని, 2022 నాటికి ‘నవ్య భారత్’ ఆవిష్కరణను దృష్టిలో పెట్టుకొని సిఫారసులు చేయాలని కేంద్రం కోరటం రాష్ట్రాలకు అదనంగా నిధులను నిరాకరించాలని సూచనప్రాయంగా చెబుతోంది.
అందువల్ల, బిజెపియేతర, బిజెపి ప్రభుత్వాలనే తేడా లేకుండా రాష్ట్రాలకు అదనపు నిధులకై కేంద్రంపై, ఆర్థిక సంఘంపై ఒత్తిడి తేవాలి. వెనుకబడిన ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కొంత అదనపు నిధులు కేటాయించవచ్చుగాని పురోగతిలోని రాష్ట్రాలకు చేటు చేస్తే ప్రజలు క్షమించరు.