Home ఎడిటోరియల్ ఆర్థిక నోబెల్

ఆర్థిక నోబెల్

Economic Nobel Prize

 

ఈ ఏడాది ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతి పేదరిక నిర్మూలనకు సరికొత్త మార్గాలను సూచించిన ముగ్గురు శాస్త్రజ్ఞులకు లభించడం ప్రపంచంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయి దారిద్య్రం మరింతగా మేట వేస్తున్న దుస్థితిపై అంతర్జాతీయ సమాజం దృష్టి కేంద్రీకృతం అయ్యేలా చేస్తుంది. అభిజీత్ బెనర్జీ, ఎస్తెర్ డఫ్లో, మైఖేల్ క్రెమెర్లకు ఉమ్మడిగా ఈ బహుమతిని ప్రకటించారు. అభిజీత్ బెనర్జీ ప్రవాస భారతీయుడు, బెంగాలీ కావడం గమనార్హం. అమర్త సేన్ తర్వాత మళ్లీ ఒక బెంగాలీకి ఈ రంగంలో ప్రపంచ అత్యున్నత పురస్కారం లభించడం దేశానికి గర్వకారణం. ఫ్రెంచ్ వనిత ఎస్తెర్ డఫ్లో అభిజీత్ బెనర్జీ భార్య. దంపతులిద్దరినీ ఒకే అంశంపై పరిశోధనకు సంయుక్తంగా నోబెల్ అవార్డు వరించింది. మూడవ గ్రహీత మైఖేల్ క్రెమెర్ అమెరికన్ అభివృద్ధి ఆర్థికవేత్త.

అభిజీత్ బెనర్జీ, ఎస్తెర్ డఫ్లో మసాచుసెట్స్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో క్రెమెర్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు. “ఈ ముగ్గురి పరిశోధన వల్ల ప్రపంచ దారిద్య్రంపై మన పోరాట పటిమ గణనీయంగా పెరిగింది, వీరు కనుగొన్న ప్రయోగాల ఆధారిత పేదరిక నిర్మూలన పద్ధతి అభివృద్ధి ఆర్థిక దృక్పథాన్నే మార్చివేసింది. ఈ కారణంగా ఈ రంగం ఇప్పుడు పరిశోధకులను విశేషంగా ఆకర్షిస్తోంది” అని నోబెల్ బహుమతి పత్రం పేర్కొన్నది. దారిద్య్రంపై పోరాటం మూస పద్ధతిలో కొనసాగితే ప్రయోజనం ఉండబోదని పై నుంచి విధి విధానాలు రూపొందించి రుద్దడం వల్ల మేలు తక్కువేనని ఆచరణలో ఎదురయ్యే సమస్యలను తెలుసుకొని పేదరికంతో పోరాడే పద్ధతులను రూపొందించాలని ఇందుకు శాస్త్రీయమైన ప్రయోగాలే సరైన ప్రాతిపదిక కాగలవని వీరు సూత్రీకరించారు. పేదరికాన్ని సంప్రదా య దృష్టితో చూడరాదని దాని వివిధ కోణాలను విడదీసి హేతు దృష్టితో పరిష్కారాలు కొనుగొనాలని ఎస్తెర్ డఫ్లో అభిప్రాయపడ్డారు.

ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల మంది అత్యంత పేదరికంలో మగ్గుతున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవ సంఖ్య ఇంతకంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కోట్లాది మంది బాలలు ప్రాథమిక విద్యకు కూడా నోచుకోకుండా వయసుకు మించిన పని భారంతో అంధకారంలో కూరుకుపోతున్నారు. అర్ధాకలితో అర్ధ నగ్నంగా బతుకులు వెళ్లమారుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక విధానాలను, ప్రభుత్వ పాలనా రీతులను పేదరిక నిర్మూలన కృషికి అనుసంధానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏడాది ఆర్థిక నోబెల్ అందుకుంటున్న ముగ్గురు శాస్త్రజ్ఞులు సూచించిన పాఠశాలల్లో అదనపు బోధన పద్ధతిని పాటించడం వల్ల భారత దేశంలో 50 లక్షల మంది బాలలు ప్రయోజనం పొందారని నోబెల్ సంస్థ పేర్కొన్నది. అభిజీత్ బెనర్జీ, ఎస్తెర్ డఫ్లో కలిసి రచించిన పూర్ ఎకనామిక్స్ అనే గ్రంథం విశేష ప్రాచుర్యాన్ని పొందింది. 2011 ఫైనాన్సియల్ టైమ్స్, గోల్డ్ మేన్ సాచెస్ బిజినెస్ బుక్ అవార్డును సాధించుకున్నది.

పేదరిక నిర్మూలనలో మచ్చు ప్రయోగాల పద్ధతిని వీరు కనుగొన్నారు. చిలీ, భారత దేశం, కెన్యా, ఇండొనేషియా వంటి పలు దేశాల్లో పేదరికంపై ప్రయోగాలు సాగించి నూతన విధానాలను అన్వేషించారు. సంక్షేమ ఆర్థిక విధానాన్ని కనుగొన్నందుకు అమర్తసేన్‌కు 1998 ఆర్థిక శాస్త్ర నోబెల్ అవార్డు లభించింది. ఏ ఆర్థిక విధానం గొప్పతనమైనా ప్రజల జీవితాల్లో అది సాధించే వికాసంపైనే ఆధారపడి ఉంటుందని జన సంక్షేమంతో సంబంధంలేని ఆర్థిక విధానం నిరర్థకమని అమర్తసేన్ సూత్రీకరించారు. కరువు కాటకాలు అట్టడుగున ఉండే అణగారిన నిరుపేద వర్గాలనే కాటేస్తాయని ఆయన కనుగొన్నారు. 1943 బెంగాల్ క్షామాన్ని బాల్యంలో స్వయంగా చూసిన అమర్తసేన్ ఆహార కొరత వల్ల కరువు సంభవించలేదని యుద్ధ కారణంగా ధరలు పెరిగిపోడం వల్ల అల్పాదాయ వర్గాలకు ఆహారం దొరక్క అది తలెత్తిందని వెల్లడించారు.

సమాజంలో ధనం పాత్ర మితిమించినప్పుడు ఇటువంటి దుస్థితి సంభవిస్తుందని, ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక వ్యవస్థలో పాలకులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విధానాలను పాటించాలని లేని పక్షంలో తదుపరి ఎన్నికల్లో వారికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేస్తారిని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజారోగ్యం, విద్యా రంగాల్లో సాంఘిక సంస్కరణలు తీసుకు వచ్చినప్పుడే ఏ దేశమైనా ఆర్థికంగా పుంజుకుంటుందని కూడా అన్నారు. విచిత్రమేమిటంటే ఎన్ని నూ తన సూత్రీకరణలు వెలువడుతున్నా ప్రపంచంలో అసమానతలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు మితిమించిన ధనికులు మరో వైపు పోగులు పడిన దారిద్య్రం. హేతుబద్ధమైన సంపద పంపిణీ జరగనంతవరకు ఈ దుస్థితికి శాశ్వతంగా తెరపడదు, పేదరికం నిర్మూలన కాదు.

Economic Nobel Prize for Scientists