Home ఎడిటోరియల్ పతన ఆర్థిక సూచీలు

పతన ఆర్థిక సూచీలు

Sampadakiyam         2018-19 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) అంతకు ముందటేడాదిలో రికార్డయిన దాని (7.2 శాతం ) కంటే తగ్గి 6.8 శాతంగానే నమోదయింది. అలాగే ఆ ఏడాదిలో ఎగుమతి దిగుమతులకు సంబంధించిన కరెంటు అకౌంటు లోటు (సిఎడి) అంతకుముందటేడాది (1.9 శాతం) కంటే పెరిగి 2.6 శాతంగా నమోదయింది. ఆ మేరకు మన ఎగుమతులకు మించి దిగుమతుల కిమ్మత్తు భారీగా పెరిగింది. ఈ లోటు 2017-18లో 162.1 బిలియన్ డాలర్లు కాగా, 2018-19లో 184 బిలియన్లు. 2018 మార్చి ఆఖరు 2019 మార్చి ఆఖరు మధ్య విదేశీ మారక ద్రవ్య నిల్వలు 11.6 బిలియన్ల డాలర్లు తగ్గాయి. బ్యాంకుల, ముఖ్యంగా పబ్లిక్ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎగ్గొట్టిన అప్పులు) పెరిగాయి. తయారీ రంగం వృద్ధి దారుణంగా పడిపోయింది.

2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో ఇది వరుసగా 12.1 శాతం, 6.9 శాతం, 6.4 శాతంగా రికార్డు అయింది. నాలుగో మూన్నెళ్ల కాలంలో 3.1 శాతానికి దిగజారిపోయింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధి సూచీలు ఇంతగా పడిపోయిన చేదు వాస్తవాన్ని గురువారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే నివేదికలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. అదే సమయంలో నూతన ఆర్థిక సంవత్సరం (2019-20) లో 7 శాతం వృద్ధి రేటును సాధించనున్నట్టు ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 77.5 శాతం వృద్ధిని సాధిస్తామని చెప్పుకొన్న జోస్యం రుజువుకాని నేపథ్యంలో ఈసారి 7 శాతం పరిమిత లక్షాన్నే పెట్టుకున్నట్టు బోధపడుతున్నది. కరంటు అకౌంటు లోటు పెరగడానికి భారత దేశం కొనుక్కునే రకం క్రూడాయిల్ ధర మళ్లీ పెరగడం కూడా ఒక కారణమని నిర్మలా సీతారామన్ తాజా ఆర్థిక సర్వేలో చెప్పుకున్నారు.

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర భారీగా తగ్గి చమురు కోసం పూర్తిగా దిగుమతులపై ఆధారపడే మన వంటి దేశాలకు అమిత ఊరటనిచ్చిన దశ గడిచిపోయింది. ఇప్పట్లో అటువంటి ప్రోత్సాహకర అధ్యాయం తిరిగి అవతరించబోదని చెప్పవచ్చు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగి గల్ఫ్ దేశాల నుంచి చమురు ఎగుమతయ్యే జల మార్గాలు యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోయినా మరే కారణాలు తలెత్తినా క్రూడాయిల్ ధరలు అనూహ్యంగా పెరిగిపోయే ప్రమాదమే సంభవిస్తుంది. అందుచేత ఆర్థిక సర్వేలో చెప్పుకొన్న 7 శాతం వృద్ధి రేటు లేదా ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రకటిం చిన 5 ట్రిలియన్ డాలర్ల మహా ఆర్థిక వ్యవస్థగా అవతరణకు అవసరమయిన 8 శాతం వృద్ధి రేటు సాధ్యమా అనేది కీలకమైన ప్రశ్న. లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు తమకిచ్చిన భారీ మెజారిటీల తీర్పు ఆర్థికంగా దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి తగిన ఊపునిస్తుందని నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే నివేదికలో అభిప్రాయపడ్డారు. ప్రజలిచ్చిన అత్యంత సానుకూలమైన తీర్పుతో దేశంలో ఏర్పడిన రాజకీయ సుస్థిరత ఆర్థిక వ్యవస్థ అనూహ్యమైన ముందడుగు వేయడానికి తగిన అశ్వశక్తినిస్తుందని కూడా ఆమె అన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో (2018-19) రబీ పంట దిగుబడి అంతకు ముందటేడాది కంటే పడిపోయిందని ఆర్థిక సర్వేలోనే పేర్కొన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు నిరుత్సాహం చెందారని కూడా అన్నారు. ఈ ఏడాది కూడా దేశంలోని అధిక భాగంలో వానలు ఆశాజనకంగా లేవు. జల వనరులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇది వ్యవసాయ రంగ సంక్షోభాన్ని పెంచుతుందేగాని తగ్గించదు. తయారీ రంగం కోలుకునే సూచనలు కనిపించడం లేదు. ఉద్యోగాల కల్పన ఊహించని స్థాయిలో ఊపందుకుంటేగాని ప్రజల కొనుగోలు శక్తి పెరగదు. వస్తు వినియోగిత మెరుగుపడదు. ఈ నేపథ్యంలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను ఆవిష్కరించుకోడం సంగతి అటుంచితే 7 శాతం వృద్ధి రేటు లక్ష సాధన కూడా గగనమే అనిపించడం సహజం. విద్యుత్తు, రియల్ ఎస్టేట్, టెలికాం, బొగ్గు, పౌర విమానయానం వంటి రంగాలు దెబ్బతిని ఉన్నాయి. కార్పొరేట్ రంగంలో పెట్టుబడులు గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోయాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు నిధుల లేమితో తీసుకుంటున్నాయి. పర్యవసానంగా చిన్న మధ్య తరహా వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలకు రుణ సదుపాయం అందుబాటులో లేకుండాపోయింది. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు లంఘించేలా చేయడానికి శుక్రవారం నాడు ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ఏమేమి అద్భుత, అమోఘ నిర్ణయాలు తీసుకోగలుగుతారోనని దేశం ఎదురు చూడడం సహజం.

Economic Survey projects 7% GDP growth in current fiscal