Home తాజా వార్తలు ఇడిల కమిటీ చర్చలు

ఇడిల కమిటీ చర్చలు

ED Committee

 

సమ్మెలోని ఆర్‌టిసి కార్మికుల 21 డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం
నేటి సమావేశంలో రూపొందనున్న ప్రతిపాదనలు, ఆ తర్వాత నివేదిక
సిఎం ఆదేశాలపై ఊపందుకున్న ప్రక్రియ

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఆర్‌టిసి కార్మికుల 21 డిమాండ్‌ల సాధ్యాసాధ్యాలపై ఆర్‌టిసి కార్యనిర్వాహకుల(ఇడిల) సమావేశం జరిగింది. రాష్ట్ర రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఇన్‌చార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ల కమిటీ బుధవారం బస్ భవన్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధ్యయనం చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెఎసి సమ్మె నోటీసులో ప్రతిపాదించిన 26 డిమాండ్‌లో ఆర్‌టిసి సంస్థ విలీనం డిమాండ్ మినహాయించి.. మిగతా వాటిపై యాజమాన్యం చర్చించాలని హైకోర్టు సూచనతో కమిటి సమగ్ర ఆధ్యయనం జరిపింది. గురువారం మరో మారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ల ఆధ్యయన కమిటీ సమావేశం జరిపి, ప్రతిపాదనలపై సమగ్ర నివేదకను రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఇన్‌చార్జ్ ఎండి సునీల్ శర్మకు అందజేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

ఈ నివేదిక అంశాలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్యక్షతన మరోసారి క్షుణ్ణంగా అధ్యయనం జరిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కార్మికులు సమ్మె నోటీసు నందు ప్రతిపాదించిన డిమాండ్‌లలో ముఖ్యాంశాలేంటి…? తక్షణమే నెరవేర్చాల్సిన అంశాలేమిటి..? స్వల్ప, మధ్య, దీర్ఘకాలీకంగా ఏయే సమస్యలను పరిష్కరించాలనే విషయం మీద ఆధ్యయన కమిటీ సమగ్రంగా సమీక్షించారు. కార్పొరేషన్‌పై ఎలాంటి భారం పడుతుంది..? ఈ డిమాండ్‌లను ఎలా నెరవేర్చాలనే దానిపై సమాలోచన చేశారు.ఆర్‌టిసి ఆర్థిక పరిస్థితి, లాభనష్టాలు, ఆదాయ మార్గాలు, నష్టాలకు కారణాలేంటి..? అద్దె బస్సులు తీసుకురావడం వల్ల లాభాలు, కార్మికుల వేతనాలు చెల్లింపు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పురుషోత్తం, వినోద్ కుమార్, యాదగిరి, వెంకటేశ్వర్లు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు..

తాత్కాలిక సిబ్బంది ఎంపికలో భద్రతా ప్రమాణాలు
ఆర్‌టిసి కార్మికుల సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఇన్‌చార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ పలు ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యంతో పాటు భద్రత అందించాలని అదేశించారు. బస్‌స్టాండ్ ప్రాంతాలలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొవాలని సూచించారు. అలాగే సాధ్యమైనంత వరకు బస్సులను పెంచాలని క్షేత్ర స్థాయి అధికారులకు సూచించారు. తాత్కాలిక సిబ్బంది అందుబాటులో ఉంటే వీలైనన్ని ట్రిప్పులు నడపాలని తెలిపారు. బుధవారం సాయత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,912 బస్సులు, 3,037 ప్రైవేట్ బస్సులు నడిచాయి. 4,231 మంది ప్రైవేట్ డ్రైవర్‌లు, 5,912 ప్రైవేట్ కండక్టర్‌లు విధుల్లో పాల్గొనగా, 3815 బస్సులలో టిమ్స్ యంత్రాలు వినియోగించారు. 1,478 బస్సుల్లో టికెట్లను జారీ చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కెసిఆర్‌కు క్షీరాభిషేకం చేస్తా : జగ్గారెడ్డి
ఆర్‌టిసి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే ముఖ్యమంత్రి కెసిఆర్‌కు క్షిరాభిషేకం చేస్తానంటూ సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఆరుగురు అధికారులతో కమిటీ వేసినందుకు కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, సంగారెడ్డి మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిన కెసిఆర్, మంత్రి ఈటల రాజేందర్‌కు జగ్గారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్ష ఎంఎల్‌ఎకు ఉన్న స్వేచ్ఛ అధికార పార్టీ ఎంఎల్‌ఎకు ఉండదన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతూనే ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తుందని..చెడు చేస్తే ప్రశ్నిస్తుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ED Committee Discussions