Home తాజా వార్తలు రూ.700కోట్ల కార్వీ షేర్లు స్తంభన

రూ.700కోట్ల కార్వీ షేర్లు స్తంభన

ED freezes karvy shares worth Rs 700 crore

 

దర్యాప్తు వేగవంతం చేసిన ఇడి, సంస్థ షేర్లను అమ్మడానికి యత్నిస్తున్న ఎండి పార్థసారథి
పలు బ్యాంకుల నుంచి రూ.2873 కోట్లు రుణం తీసుకొని ఎగవేత
పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే కార్వీపై మనీలాండరింగ్ కేసు

మనతెలంగాణ/హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అక్రమాలపై దర్యాప్తు చేపడుతున్న ఇడి అధికారులు శనివారం నాడు రూ.700 కోట్ల విలువైన కార్వీ షేర్లను స్తంభింపజేశారు. ఈ క్రమంలో కార్వీ ఎండి పార్థసారధి, అతని కుమారులు రజట్ పార్థసారథి, అధిరజ్ పార్థసారధిలకు సంబంధించిన షేర్‌లతోపాటు కార్వికి సంబంధించిన 700 కోట్ల రూపాయల షేర్‌లను ఇడి ఫ్రీజ్ చేసింది. సంస్థకు సంబంధించిన షేర్లను కార్వీ ఎండి పార్థసారథి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇడి అధికారులు వివరిస్తున్నారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఛైర్మన్ పార్థసారథి పలు బ్యాంకుల నుంచి 2,873 కోట్ల రూపాయలు రుణం తీసుకొని, తిరిగి చెల్లించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ సిసిఎస్‌లో ఇండన్ ఇండ్ హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంకులు ఫిర్యాదు చేశాయని చెప్పారు. పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కార్వీ సంస్థపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇడి అధికారులు పేర్కొన్నారు.

కాగా ఈ నెల 22వ తేదీన కార్వీ సంస్థకు చెందిన పలు కార్యాలయాలతో పాటు పార్థసారథి ఇంట్లో తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలతో పాటు లాప్‌టాప్,పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఇడి అధికారులు తెలిపారు. పెట్టుబడిదారులకు చెందిన షేర్లను కార్వీ ఖాతాలోకి మళ్లించుకొని వాటిని బ్యాంకులో తనఖా పెట్టి పార్థసారథి రుణం తీసుకున్నట్లు ఇడి విచారణలో తేలిందన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని 9 డొల్ల కంపెనీలకు మళ్లించడంతో పాటు పలు స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. కార్వీ నిర్వాహకుల నిధుల మళ్లింపు అక్రమాలపై ఇడి లోతుగా ఆరా తీస్తోంది. వినియోగదారుల షేర్లను అక్రమంగా బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా రుణంగా తీసుకున్న కోట్ల రూపాయల నిధుల్ని ఎక్కడికి మళ్లించారనే అంశంపై కూపీ లాగుతోంది. ఇలా సేకరించిన రుణాల మొత్తం రూ.1,200 కోట్లకు పైగానే ఉంటుందని తేలడంతో ఇడి ప్రత్యేక దృష్టి పెట్టింది.

ED freezes karvy shares worth Rs 700 cr