Wednesday, April 24, 2024

విద్య, వైద్య రంగాలే గీటురాళ్లు!

- Advertisement -
- Advertisement -

Education and medicine are the cornerstones

 

దేశ దశ, దిశలను నిర్ణయించే ప్రమాణాలుగా అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన వైద్య సదుపాయాలు అనబడే రెండు ముఖ్య అంశాలు గుర్తించబడ్డాయి. విద్యావంతులు పెరిగితే పేదరికం, నిరక్షరాస్యత, జనాభా విస్పోటనం సహజంగానే అదుపు చేయబడతాయి. విద్య, వైద్య సదుపాయాల కల్పన ప్రభుత్వాల కనీస బాధ్యతలుగా, ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలి. ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలను భారం గా, ఉత్పాదకతలేని రంగాలుగా గుర్తించడం భవిష్యత్తు తరాలకు శాపంగా మారనున్నాయి. కరోనా అలలు పలుచబడటంతో ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో విద్యాలయాలు తెరిచి విద్యా బోధన జరిగేలా చూస్తున్నారు. కరోనాతో సహజీవనం చేస్తూ మానవ జీవనయానం జరగాల్సిందే, తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమ తమ పనులు చూసుకోవలసిందే.

ప్రస్తుత దేశ విద్యారంగ పరిస్థితులు

ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సకల సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యతలను ప్రైవేటుకు వదిలేయడం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తున్నది. 6 నుంచి 14 వయసు గల బాలలు అందరికీ ఉచిత, తప్పనిసరి విద్య హక్కును భారత రాజ్యాం గం కల్పించిన విషయాన్ని ప్రభుత్వాలు మరిచి పోవడం విచారకరం. ప్రాథమిక విద్య కల్పనలో 70 శాతం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు కొంత భారాన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు మోస్తున్నాయి. విద్యాలయాలను నెలకొల్పడం ఎంత ముఖ్యమో, జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగ గల నాణ్యమైన విద్యను కల్పించడం కూడా అంతకన్నా అతి ప్రధానమని గమనించాలి. మన విద్యా విధానంలో థియరిటికల్ నాలెడ్జికి పెద్ద పీట, ప్రయోగాత్మక పరిజ్ఞానానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది.

పుస్తకంలోని ప్రశ్నలు / జవాబులను బట్టీ పట్టడం, ర్యాంకుల వెంట పాఠశాలలు / తల్లితండ్రులు వెలం వెర్రిగా పడడం, సృజనకు / ఆలోచనా విస్తృతికి / ఊహాశక్తి విస్తరణకు అవకాశం లేకపోవడంతో డిగ్రీల పట్టాలు కాగితాల వరకే పరిమితం అవుతున్నాయి. నైపుణ్య వికాసం సన్నపూస అయ్యింది. చదువంటే మెడిసిన్ లేదా ఇంజినీంగ్ అని భావించడం దురదృష్టకరం. వీటికి సమాధానంగా నూతన విద్యా విధానం -2020 ప్రవేశపట్టి, శాస్త్రసాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనలు, వ్యక్తిత్వ వికాస అంశాలకు పెద్ద పీట వేసి రాబోయే తరాన్ని నైపుణ్యవంతులుగా నిర్మించాలని ఆశిద్దాం.

విద్యా ప్రమాణాల పెంపు

ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో అక్షరాస్యత రేటు 77.2 శాతం ఉండడం, వీరిలో 82.1 శాతం పురుషుల రేటు, 65.5 శాతం మహిళా అక్షరాస్యత రేటు ఉంది. ప్రపంచ అక్షరాస్యత రేటు 86.3 శాతంతో పోల్చితే భారత్ చాలా వెనుకబడి ఉందని అర్థం అవుతున్నది. విద్య ప్రమాణాలను ప్రభావితం చేసే అంశాల్లో మౌలిక వసతులు కలిగిన విద్యాలయాలు, పని దినాలు, సుశిక్షితులైన ఉపాధ్యాయులు, విద్యా విధానం, క్రీడా వసతులు, సిలబస్ కూర్పు, విద్యార్థి – ఉపాధ్యాయ, బాలల జనాభా -విద్యాలయాల నిష్పత్తులు లాంటివి ముఖ్య భూమికను నిర్వహిస్తాయి. పాఠశాలలో బాలల నమో దు రేటును పెంచడంతో పాటు డ్రాప్ అవుట్‌లను తగ్గించడంలో దృష్టి సారించాలి. భారతీయ పాఠశాల విద్య లో ఉపాధ్యాయ- విద్యార్థి నిష్పత్తి 1:32 ఉండగా, ఉన్నత విద్యలో 1 : 24 గా ఉన్నది. దక్షిణ ఆఫ్రికా దేశాల్లో టీచర్- విద్యార్థి నిష్పత్తి 1 :80 ఉండగా, జార్జియాలో 1 : 6 ఉన్నది. మన దేశంలో 29 శాతం స్కూల్ డ్రాప్ అవుట్‌లు ఉండడం సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అవరోధంగా నిలుస్తున్నది.

ఉచిత వైద్య సేవలు అందుతున్నాయా?

కరోనా కల్లోల నేపథ్యంలో ప్రజారోగ్యం గాల్లో దీపమైంది. వైద్యరంగ బలహీనతలను కొవిడ్- 19 వైరస్ బట్టబయలు చేసింది.138 కోట్ల జనాభా కలిగిన స్వతంత్ర భారతంలో ఉచిత వైద్య సదుపాయాల కల్పనలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ముఖ్యం గా బీహార్, యుపిలో పాటు కొండ ప్రాంత ఈశాన్య ప్రాంతాలు, జమ్ము-కశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో వైద్య వసతుల కొరత అధికంగా ఉన్నది. గ్రామీణంలో వైద్య సబ్-సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు లాంటి ప్రభుత్వ వైద్య సౌకర్యాలు కొంత మేరకు దేశ నలుమూలల విస్తరించబడి ఉన్నప్పటికీ అందరికీ ఉచిత వైద్యం అందడం లేదు. అధిక జనాభా, నాటు వైద్యాలు, మూఢ విశ్వాసాలు, నిరక్షరాస్యత, పేదరికం, భౌగోళిక స్వభావాలు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, ఔషధాల కొరత, ప్రైవేట్ ఆసుపత్రుల అనైతిక కదలికలు, అర్హత కలిగిన వైద్యుల కొరత లాంటి అనేక సవాళ్ళ నడుమ అందరికీ ఉచిత వైద్య సేవలు లభించడం ప్రభుత్వాలకు అసాధ్యంగా తోస్తున్నది.

దేశ వైద్యరంగ పరిస్థితులు

ఐక్యరాజ్య సమితి సిఫార్సుల ప్రకారం ప్రతి 1000 జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి (1:1000 నిష్పత్తి). తాజా వివరాల ప్రకారం భారత్‌లో అల్లోపతిక్ డాక్టర్ జనాభా నిష్పత్తి 1 :1,404 (0.8 :1000) ఉండడంతో అందరికీ ఉచిత వైద్య అందడం లేదు. ఇండియాలో 12 లక్షల ఎంబిబియస్ డాక్టర్లు, 8.85 లక్షల ఆక్సిల్లరీ నర్సులు, 21.30 లక్షల రిజిస్టర్డ్ నర్సులు, 56,644 మహిళా హెల్త్ విజిటర్స్ ఉన్నారని అంచనా. డాక్టర్ -జనాభా నిష్పత్తిలో బీహార్‌లో 1 : 28,391, యుపిలో 1 :19,962 నమోదు కావడం వైద్యసేవల కొరతను నిరూపిస్తున్నది. జర్మనీలో 4 :1000, ఆస్ట్రేలియాలో 3.37 : 1000, అమెరికాలో 2.55: 1000 డాక్టర్- జనాభా నిష్పత్తి ఉన్నది.

ఢిల్లీలో అత్యధిక డాక్టర్లు ప్రజావైద్య సేవలో ఉండగా, గోవాలో అత్యధిక రిజిస్టర్డ్ వైద్యులు ఉన్నారని తేలింది. నీతిఆయోగ్ వివరాల ప్రకారం ఆరోగ్యకర రాష్ట్రాల జాబితాలో కేరళ, ఆంధ్రప్రదేశ్‌లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉండగా, తెలంగాణ 10వ స్థానం లో ఉన్నది. దేశంలోని అల్లోపతి డాక్టర్లలో 52 శాతం ఐదు రాష్ట్రాలలోనే (మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, యుపి) ఉన్నారు. దేశ వ్యాప్తంగా 479 వైద్య కళాశాల ద్వారా ప్రతి ఏటా 67,218 మంది ఎంబిబియస్ కోర్సులో చేరుతున్నారు. వీటితో పాటుగా ఆయుష్ (ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి) వైద్య విధానాలు కూడా 7.88 లక్షల నిపుణుల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాయి. గ్రామీణ భారతంలో ఆర్‌యంపి, పియంపి లాంటి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కూడా విలువైన వైద్య సేవలు అందిస్తున్నారు.

విద్యను నిర్లక్ష్యం చేస్తే తరాల మానసిక ఆరోగ్య నిర్మాణాలు తగలబడి పోతాయని, వైద్యం అందని యెడల అనారోగ్య మానవవనరులు అభివృద్ధిలో భాగస్వామ్యం కాలేరని తెలుసుకోవాలి. విద్య, వైద్యాన్ని ప్రజలకే వదిలి, ప్రభుత్వాలు ఎక్కువ కాలం స్థిరంగా నిలబడలేవు. విద్యావంతులతో దేశ సమగ్రాభివృద్ధి, ఆరోగ్యకర సమాజంతో బహుముఖీన ప్రగతి పరుగులు పెడుతుంది. ప్రభుత్వాలు పౌర సమాజం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, భారతీయులంతా ఆరోగ్యకర విద్యావంతులతో నిండుగా, పసందుగా, బాధ్యతాయుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News