Friday, April 26, 2024

అబద్ధాల్ని గుర్తించే విద్య కావాలి!

- Advertisement -
- Advertisement -

Education identify fake news

సోషల్ మీడాయాలో తరచూ కనబడే కొన్ని ఫేక్ మెసేజ్‌ల ప్రభావంలో పడి యువత కొట్టుకుపోతోంది. కొంచెం ఇంగిత జ్ఞానం ఉపయోగించి ఆలోచిస్తే నిజానిజాలు బయటపడతాయి. మనకు అందుతున్న సమాచారమంతా వాస్తవమైంది కాదన్నది ముందు గ్రహించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాధి నేతలే వారి స్వప్రయోజనాల కోసం పనిగట్టుకొని ఎ.కె. 47తో కాల్పులు జరిపినట్టుగా అబద్ధాలు పౌరుల గుండెల్లో పేలుస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు సంగతి వదిలేయండి. పీల్చుకునే గాలి సైతం కలుషితమై పోతూ వుంటే ప్రభుత్వాలు ఒకరినొకరు దూషించుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం గురించి సుప్రీంకోర్టు చివాట్లు వేసినా చలనం లేదు. ఒకవైపు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ మరో వైపు దాని గూర్చి మహోపన్యాసాలు ఇస్తున్నారు. విజ్ఞానం పెరిగితే ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రశ్నల్ని ఎదుర్కొనే స్థైర్యం ప్రభుత్వాలకు లేదు. అందుకే ఏదో వంకతో విశ్వవిద్యాలయాలను మూసేయాలనుకొంటాయి. లేదా వాటి పేర్లు మార్చి తమకు అనుకూలమైన వేద పాఠశాలలుగానో, మనుస్మృతి కళాశాలలు గానో మార్చాలనుకుంటాయి. ప్రైవేటుపరం చేసి, ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందాలనుకుంటాయి. పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలనుకుంటాయి. అందులో భాగంగానే జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పేరు మార్చి నరేంద్ర మోడీ పేరు పెట్టాలని ఒక ప్రతిపాదన ముందుకొచ్చింది. భారతీయుల్ని ఉద్ధరించడానికి అవతరించిన కారణజన్ముడు మోడీ అని ఆయన భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు కదా?

కార్మికుల, కష్ట జీవుల స్వేదాన్ని, రాజ్యాంగం వారికి కల్పించిన హక్కుల్ని తొక్కి పడేసి ప్రభుత్వాలు వేల కుటుంబాల్ని రోడ్డున పడేయాలనుకుంటాయి. సంస్థలు ప్రైవేటుపరం చేస్తే కమీషన్లతో తాము వర్ధిల్లుతూ వుండొచ్చని, మళ్లీ ఓట్లు కొనుగోలు చెయ్యొచ్చని కొందరు నాయకులు ఆశపడుతుంటారు. సామాజిక, రాజకీయ అంశాలు ఇలా వుంటే, మరో వైపు కొందరు తమ విమర్శలు అసలు తట్టుకోలేకపోతున్నారు. అలాంటి వారు చేసే ఆరోపణ సామాన్యంగా ఒకటి వుంటుంది. “మీకు మా మతమే కనిపిస్తోందా? విమర్శించడానికీ?” అని గింజుకుంటూ వుంటారు. అసలు విషయమేమంటే లేని గొప్పతనాన్ని, కట్టుకథల్ని, పిట్ట కథల్ని, పుకారు వార్తల్ని తమ తమ మతాలకు ఆపాదించి అవన్నీ నిజమని ప్రచారం చేసుకుంటున్నప్పుడు అవి ఏ మతం గురించైనా సరే విమర్శను ఎదుర్కోక తప్పదు. అలాంటి కట్టుకథల్ని, అబద్ధపు దుష్ప్రచారాల్ని యువత అర్థం చేసుకంటూ వుండాలి. సహేతకంగా తిప్పి కొడుతూ ఉండాలి. ఎందుకంటే ఎవరి మతమేదైనా, ఎవరి విశ్వాసాలు ఎలాంటివైనా మన మంతా మనుషుల మన్నది మరిచిపోకూడదు. మానవ వికాసంలోనే ఆధునిక వైజ్ఞానిక వికాసం జరుగతూ వస్తోంది. మనం దానికి ప్రాధాన్యమివ్వాలి. మనిషి మనిషిగా సగౌరవంగా నిలబడగలిగినప్పుడే వివక్షలేవీ లేని మానవ సంబంధాలు సమాజంలో బలపడతాయి. విచారించదగ్గ విషయమేమంటే ఈ దేశంలో మానవీయ విలువల్ని మంటగలిపిన వారే డబ్బులు వెదజల్లి అనైతికంగా అధికారం చేజిక్కించుకుంటున్నారు. ఈ విషయం యువత అర్థం చేసుకొని విశ్లేషించుకుంటూ వుండాలి. దానికి అడ్డుకట్ట వేయగలగాలి.

వైజ్ఞానిక పరిశోధనల గురించి తెలుసుకోవడం మంచిది. అది వీలు కానప్పుడు పురాణాల్ని హేతుబద్ధంగా విశ్లేషించిన రచయితల పుస్తకాలు చదివినా మనకు మన గురించి సరైన అవగాహన కలుగుతుంది. కవి రాజు త్రిపురనేని రామస్వామి, తాపీ ధర్మారావు, సి.వి. నార్ల వెంకటేశ్వర రావు లాంటి వారెందరో అలాంటి పుస్తకాలు రాశారు. అలాంటి వారిలో మనం చెప్పుకోవాల్సిన మరో పేరు పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి (5 నవంబర్ 1877 7 జనవరి 1950) మన ముందు తరం రచయిత. వీరి రచన “మహాభారత చరిత్రము” సుమారు 85 ఏళ్లకు పూర్వం వెలువడి, గొప్ప సంచలనం సృష్టించింది. మొదట భారత రచన జరిగాక కాలక్రమంలో ఎన్నెన్ని మార్పులు జరిగాయో, ఎన్నెన్ని అంశాలు కొత్తగా చేరుతూ వచ్చాయో పరిశీలించాలనుకునే వారు తప్పక చదవాల్సిన పుస్తకం. సమాజం మీద ఆధిపత్యం సంపాదించి, దాన్ని దుర్వినియోగం చేస్తూ ఆర్య బ్రహ్మణులు అధిక సంఖ్యాకుల్ని ఎలా శాసించారో, ఎలా హింసించారో తెలుసుకోవాలంటే ఇలాంటి సాహిత్యం చాలా చాలా చదవాల్సి వుంటుంది. ఉదాహరణకు పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి వివరించిన కొన్ని విషయాలు ఇలా వున్నాయి.
శ్రీకృష్ణుని అవతార పురుషునిగా, పాండవుల్ని సకల సద్గుణ సంపన్నులుగా చిత్రిస్తూ రాసుకోవల్సిన అవసరం ఏ మొచ్చింది? విశ్లేషించుకుంటే, నిజాలు కొన్నయినా బయటపడతాయి. మొదట్లో కృష్ణావతారం తర్వాత కలికావతారం ఎందుకుంది? తర్వాత కాలంలో బుద్ధుణ్ణి దశావతారాలలో చేర్చుకొని, కలికావతారాన్ని ఎందుకు చివరికి నెట్టారు? శ్రీకృష్ణుని యుగ ప్రవక్తగా కీర్తించిన భాగం అంతా ఎప్పుడు చేర్చబడింది వంటి ప్రశ్నలు సంధిస్తూ పెండ్యాల వారు తన వివరాల్ని కూడా పొందు పరిచారు. బౌద్ధం భారతదేశంలోనూ, చుట్టు ప్రక్కల దేశాల్లో నూ బాగా వ్యాపించి వున్న దశలో వైదిక రచయితలు కావాలని పూనుకొని రాముణ్ణి, కృష్ణుణ్ణి అవతార పురుషులుగా చిత్రించారు. ఇదంతా 400 బిసిఎ ప్రాంతంలో జరిగింది. ఆ విధంగా వైదిక మత పునరుద్ధరణ కొన్ని శతాబ్దాల పాటు జరుగుతూ వచ్చింది. ఒక వైపు రచనల్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ మరో వైపు బౌద్ధ, జౌన ఆరామాల్లో ప్రార్థనా మందిరాల్లో మార్పులు చేసుకుంటూ హైందవ మతాన్ని పునరుద్ధరించడం జరిగింది. వివరాలన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి. వ్యాసుడు ‘జయం’ అని, వైశంపాయనుడు ‘భారతం’ అని సౌతి ‘మహాభారతం’ అనే పేర్లతో వేరు వేరు కథల్ని రచించారు. కాని, కాలక్రమంలో ఆ ముగ్గురు రచించిన గ్రంథాలు కలిసిపోయి ఏది ఎవరు రాశారో తెలియకుండా పోయిందనడానికి ఆధారాలున్నాయన్నారాయన!

కృష్ణుడు బాల్యంలో పూతన, శకటాసురుడు వంటి రాక్షసులను వధించాడని ఉంది. కాని ‘శుశ్రుతము’ అనే వైద్య గ్రంథాన్ని బట్టి అవి పిల్లలకు వచ్చే రోగాల పేర్లని తెలుస్తోంది. గ్రంథకర్తలు ఆ వ్యాధుల్ని వ్యాధులుగా కాక, రాక్షసులుగా చిత్రించారు. పల్లెల్లో శిశువులకు రోగాలు సోకకుండా శండేరధ అనే మంత్రాలను చదువుతూ జాత కర్మంలో బ్రాహ్మణులు హోమం చేస్తారు. తవుడు, ఊకలతో పొగ వేస్తారు. కృష్ణుడనే కల్పిత దేవుడి పాత్ర, ఆయా రాక్షసుల్ని బాల్యంలో వధించాడని కథలు కథలుగా వర్ణించుకున్నారు. భారతంలో ద్రౌపది ఐదుగురికి భార్య కావడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికీ ఆ ఆచారం హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ఆదిమ తెగలలో కనిపిస్తూ వుంది. అదే విషయాన్ని తీసుకొని రచయితలు భారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు అనే అంశం పొందుపరిచి వుంటారు. ఏమైనా అది ఒక ఆదిమ అనాగరిక సంప్రదాయం. దాన్ని మహోన్నతమైన అంశంగా గుర్తించాల్సిన పని లేదు. ఆ దశ నుండి సమాజం చాలా ముందుకు వచ్చిన విషయం గమనించాలి. కౌరవులలో అసూయాద్వేషాలు వున్న మాట నిజమే కాని, అందుకు ద్రౌపది, పాండవులు, కృష్ణుడు చేసిన పనులు అన్న మాటలు కౌరవుల మీద ఉత్ప్రేరకాలుగా పని చేసి వుంటాయి. ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. ఇకపోతే సర్పయాగం అంటే పాములను చంపడం కాదు. మన నాగజాతి ప్రజల నిర్మూలన అని అర్థం చేసుకోవాలి. దక్షిణ భారతీయులంతా నాగ జాతీయులే. ఉత్తరం నుండి వలస వచ్చిన జాతులు ఇక్కడ మూలవాసుల్ని నాశనం చేయడాన్ని నాగజాతి నిర్మూలన అంటే సర్పయాగం అనే సంకేతంతో లిఖించుకున్నారన్న మాట! ద్రౌపది వస్త్రాపహరణ జరగలేదనడానికి ఆధారాలున్నాయంటారు పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. అంతే కాదు, దుర్వాసుడు తన వందల మంది పరివారంతో వనవాసంలో వున్న పాండవుల దగ్గరికి వచ్చినప్పుడు ద్రౌపది అక్షయ పాత్రతో అందరికీ భోజనం పెట్టాలనుకుంటుంది. కాని, దాని వల్ల పని జరగలేదు. మూల రచనలో ఆ ఘట్టం బలహీనంగా, అసందర్భంగా వుందని ఆ భాగం ఎర్రన అనువదించకుండా వదిలేశారట.

ఇలాంటి విషయాలన్నీ పరిశోధించి రాసిన వేంటక సుబ్రహ్మణ్య శాస్త్రి పుస్తకానికి ఏటుకూరి బలరామమూర్తి ముందు మాట రాశారు. కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారు అభినందిస్తూ అందులో తమ అభిప్రాయాలు నమోదు చేశారు. ఈ గ్రంథాన్ని సమర్థిస్తూ, విమర్శిస్తూ అనేక గ్రంథాలు వెలువడ్డాయి. ఒక రకంగా ఇదొక సంచలనం. ఎందుకంటే ఈ గ్రంథం వివాదాస్పదమై 1929 లో కోర్టుకెక్కింది. భారతంలోని అక్రమ సంబంధాల్ని ప్రశ్నిస్తూనే కాబోలు, నాటి సామాజిక స్థితిగతులపై వేమన ఈ విధంగా స్పందించారు.
తాతగన్న తల్లి తన తండ్రి గను తల్లి /తన్ను గన్న తల్లి తల్లి తల్లి
తల్లి శూద్రురాలు తానెట్టు బాపడో / విశ్వదాభిరామ వినురవేమ.

బాగా అర్థం చేసుకుంటే ఇది ఈ కాలపు అహంభావులకూ వర్తిస్తుంది. విశాల హృదయంతో మానవత్వ స్ఫూర్తి గురించి ఆలోచించగలిగితే కళ్లు కూడా తెరిపిస్తుంది. మానవ జాతి అంతా మిశ్రమ సంతతేనని, అయితే అంతా ఒక్కటేనని నిరూపించిన ఆధునిక జన్యు పరిశోధనలు స్ఫురణకు వస్తాయి. పురాణాలలో కూడా లాజిక్ వుంటుంది. అయితే అది ఈ అత్యాధునిక సమాజానికి సరిపడదు. ఉదాహరణకు ఒక కవిత సారాంశం గమనించండి. అది ఇలా వుంది. అందరి పాపాలు కడుగుతాను గనుక తను గొప్పదాన్నని అంది గంగ. నువ్వే నా జడలో వుంటావు గనక నేను నీ కన్నా గొప్ప అని అన్నాడు శివుడు. శివుడే తన ఒడిలో వుంటాడు గనుక తనే గొప్ప అంది హిమాలయ పర్వతం. పర్వతాన్నే ఎత్తగలను గనుక తానే గొప్ప అన్నాడు ఆంజనేయుడు. ఆంజనేయుడు నా సేవకుడు గనుక తనే గొప్ప అని అన్నాడు రాముడు. “రాముడెక్కడ గొప్ప? అతను తన జేబులో పడి వుండేవాడు” అని అంది సంఘ్ పరివార్?” ఇది “అయోధ్య గాథ” అనే డాక్యుమెంటరీ చలన చిత్రంలోంచి తీసుకున్న ఒక కవితా భాగం. ఈ డాక్యుమెంటరీ రూపొందించిన వారు వాణీ సుబ్రహ్మణ్యం. నేషనల్ ఫిల్మ్ అవార్డు సాధించిన డాక్యుమెంటరీ చిత్రం ఇది. వాణీ సుబ్రహ్మణ్యం మహిళల హక్కుల కోసం పోరాడే సామాజిక కార్యకర్త. అయితే 1990 దశకంలో ఆమె లఘు చిత్రాలు రూపొందించడం ప్రారంభించారు. సరే. విషయమేదైనా అంతర్లీనంగా నీచ రాజకీయాలు జనాన్ని విడదీయడంపై ఆమె మండిపడతారు. వాస్తవాలు గ్రహించాలన్న స్పృహ జనంలో వుంటే తగిన పుస్తకాలు, సినిమాలు, ఇతర కళారూపాలు చాలా వున్నాయి. అయితే వాటిని వెతుక్కోవాల్సి వుంటుంది. వెతుక్కోకపోతే అబద్ధాల హోరులో కొట్టుకుపోతాం!

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News