Home Default సంపాదకీయం : క్రమబద్దీకరణతో విద్యదూరం

సంపాదకీయం : క్రమబద్దీకరణతో విద్యదూరం

Sampadakeeyam-Logo

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండూ పాఠశాల విద్యను క్రమబద్దీకరించే పేరుతో పెద్ద ఎత్తున స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో 4600లకు పైగా స్కూళ్ల మూసివేత, విద్యార్థులు, ఉపాధ్యాయుల సర్దుబాటుకు కసరత్తు జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యాశాఖ ఏకంగా దాదాపు 9వేల స్కూళ్ల మూసివేతకై “ఎపి స్కూల్స్ రేషనలైజేషన్ గైడ్‌లైన్స్, అండ్ నార్మ్ ఫర్ 2017” పేరుతో మే 22న జిఒ 29 జారీ చేసింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ అజమాయిషీ కింద ఉన్న 6500 ప్రాథమిక పాఠశాలలు, 2500 ప్రాథమికోన్నత పాఠశాలలు, 50కి పైగా హైస్కూళ్లు మూతపడనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 4,637స్కూళ్లు మూతకు సిద్ధమవుతుండగా, మొత్తంమీద 20మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లలో 6116 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మానవ వనరులను మెరుగ్గా వినియోగించుకోవటం, వృధా వ్యయాన్ని నివారించటం ఈ క్రమబద్దీకరణ లక్షం. విద్యార్థుల సంఖ్యను బట్టి పరిసర గ్రామాల్లోని స్కూళ్లను కలుపుతారు, టీచర్లను అవసరం మేరకు సర్దుబాటుచేస్తారు, మిగులు ఉంటే ఇతర స్కూళ్లకు బదిలీ చేస్తారు.
తెలంగాణలోని పరిస్థితిని పరిశీలిస్తే, ఒక్క విద్యార్థిలేని స్కూళ్లు 460 ఉండగా, వాటిలో 403మంది టీచర్లున్నారు. 10మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లలో 1,769 మంది టీచర్లున్నారు. మొత్తంమీద 2౦మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లలో 5713 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 20మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లలో అత్యధికం (4096) ప్రాథమిక పాఠశాలలు. వాటిలో ఒక విద్యార్థిలేని ప్రాథమిక పాఠశాలలు 5 కాగా, 20మందిలోపు విద్యార్థులున్న హైస్కూళ్లు 76 .
ప్రాథమిక విద్యలో అసలే వెనుకబడి ఉన్న తెలంగాణలో ఈ విపరీతం ఏమిటి? పిల్లల్ని స్కూళ్లకు రాబట్టేందుకు బడిబాట వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, మధ్యాహ్న భోజనం పెడుతున్నా విద్యార్థుల కొరత ఎందుకు ఏర్పడింది? విద్యపట్ల సామాన్య ప్రజల్లో సైతం ఆసక్తిపెరిగిన ఈ కాలంలో స్కూళ్లమూసివేత విద్యారంగంలో ఏర్పడిన ఒక వక్రగతికి నిదర్శనం. ఇది ప్రభుత్వాలు గత రెండు-రెండున్నర దశాబ్దాలుగా అనుసరిస్తున్న ‘విద్య ప్రైవేటీకరణ’ విధానాల పర్యవసానం. 1990వ దశకంలో సరళీకరణ విధానాలు ప్రవేశించిన తదుపరి విద్యలో ప్రైవేటురంగ ప్రవేశం క్రమంగా ఊపు అందుకుంది. కంప్యూటర్ల ఆగమనం ఇంగ్లీషును తప్పనిసరి చేసింది. ఇంగ్లీషు మీడియం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి పోటీ పరీక్షలు విద్య స్వరూపాన్ని, దిశను పూర్తిగా మార్చివేశాయి. ఎంసెట్‌లో ర్యాంకు, ఇంజనీరింగ్ సీటు సంపాదించటమే పరమార్థమన్నంతగా విద్యలో పోటీతత్వం పెరిగింది. ఈ మానసిక స్థితి పట్టణాలనుంచి గ్రామాలకు వ్యాప్తి చెందింది. గ్రామాల్లో ఆర్థికంగా వెసులుబాటున్న వారు తమ పిల్లల్ని కాన్వెంట్లకు పంపుతున్నారు. విద్యపట్ల ఆసక్తి ఉన్న పేదలు సైతం ఫీజులు ఎక్కువైనా కష్టనష్టాలకోర్చి తమ పిల్లల్ని ఇంగ్లీషు స్కూళ్లలో చేర్చుతున్నారు. ప్రజల్లో ఆసక్తి గమనించిన నిరుద్యోగ విద్యాధికులు పెద్ద గ్రామాలవరకు కాన్వెంట్లు తెరిచారు. ఇక ప్రభుత్వ పాఠశాలలకు మిగిలింది ఆర్థికంగా ఏ మాత్రం వెసులుబాటులేని ఎస్‌సి, ఎస్‌టి, ఇతర బలహీనవర్గాల పిల్లలు. ఈ పరిస్థితికి ప్రభుత్వ విధానాలతోపాటు ఉపాధ్యాయులు బాధ్యులు.
పైన ప్రస్తావించిన స్కూళ్ల స్థితినిబట్టి వాటి క్రమబద్ధీకరణ సమంజసమేనన్న భావన కలగకమానదు. టీచర్లను హేతుబద్ధంగా సర్దుబాటు చేయటం ప్రయోజనకరం అనిపిస్తుంది. కాని మానవ వనరుల అభివృద్ధి దృష్టి నుంచి చూచినపుడు అట్టడుగు సామాజిక తరగతుల పిల్లలు విద్యకు దూరమవుతారు, డ్రాప్‌ఔట్స్ మరింత పెరుగుతాయి. అందువల్ల స్కూళ్లమధ్య నాలుగైదు కిలోమీటర్లకు మించి దూరం లేకుండా చూడటం, పిల్లల రవాణాకు బస్‌సౌకర్యం కల్పించటం, స్కూలు వాతావరణాన్ని ఆహ్లాదకరం చేయటం, టీచర్ల కొరత తీర్చేందుకు డిఎస్‌సి నిర్వహించటం వగైరా చర్యలు అవసరం.